
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది.
సీఎస్‌కే బ్యాటర్లలో విజయ్ శంకర్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఎంఎస్ ధోని(30 నాటౌట్) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ తలా వికెట్ సాధించారు. సీఎస్‌కేకు ఇది వరుసగా మూడో ఓటమి కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా మూడో విజయం కావడం గమనార్హం.
రాహుల్ సూపర్ ఫిప్టీ..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 51 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. రాహుల్‌తో పాటు పోరెల్(33), స్టబ్స్(24), రిజ్వీ(21) రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరానా తలా వికెట్ సాధించారు.
చదవండి: IPL 2025: ధోని ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? ఫ్యామిలీ ఫోటోలు వైరల్