
Photo Courtesy: BCCI/IPL
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందిన ఈ ఫైవ్ టైమ్ చాంపియన్.. ఆ తర్వాత పరాజయ పరంపర కొనసాగిస్తోంది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.
తద్వారా ఈ సీజన్‌లో వరుసగా ఐదు పరాజయాలు నమోదు చేసింది. సీఎస్‌కే చరిత్రలో ఇలాంటి పరాభవం ఇదే తొలిసారి. అది కూడా చెన్నైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలో ఈ చేదు అనుభవం ఎదుర్కోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ఆట తీరు, ధోని కెప్టెన్సీ తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తీవ్రంగా విమర్శించాడు.
ప్రత్యర్థి తెలివిగా ఆడితే.. వీరు మాత్రం
దిగ్గజ ఆటగాడు, కెప్టెన్ అయిన ధోని నుంచి ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదని.. అసలు వాళ్లకు మెదడు పనిచేయడం మానేసిందా అన్నట్లుగా మ్యాచ్ సాగిందని మనోజ్ తివారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థి తెలివిగా ఆడి గెలుపొందితే.. చెన్నై జట్టు మాత్రం తెల్లముఖం వేసిందని ఎద్దేవా చేశాడు.
‘‘సీఎస్‌కే పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ముఖ్యంగా గత మూడు- నాలుగు మ్యాచ్‌లలో వారి ప్రదర్శన మరీ నాసిరకంగా ఉంది. ఆటగాళ్ల షాట్ల ఎంపిక చెత్తగా ఉంటోంది. గత 20- 25 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న వాళ్లకు కూడా ఏమైంది?
అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా?
అసలు వారి ప్రణాళికలు ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. మీ జట్టులో ప్రస్తుత పర్పుల్ క్యాప్ విజేత నూర్ అహ్మద్ ఉన్నాడు. కానీ అతడిని మీరు ఎప్పుడు బౌలింగ్‌కు పంపించారో గుర్తుందా? ఎనిమిదో ఓవర్.. అవును ఎనిమిదో ఓవర్..
ప్రత్యర్థి జట్టులోని సునిల్ నరైన్ తన తొలి బంతికే వికెట్ తీసిన విషయం మీకు తెలియదా? దీనిని బట్టి పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందనే అంచనా రాలేదా? అలాంటపుడు మీ పర్పుల్ క్యాప్ విజేతను ముందుగానే ఎందుకు బౌలింగ్‌కు పంపలేదు?
సాధారణంగా ధోని ఇలాంటి పొరపాట్లు చేయడు. చాలా ఏళ్లుగా అతడిని గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పు అయితే ఎన్నడూ చేయలేదు. కానీ ఈరోజు ఏమైంది? ఓటమి తర్వాతనైనా మీరు పొరపాట్లను గ్రహిస్తారనే అనుకుంటున్నా.
అసలు మెదడు పనిచేస్తోందా?!
మామూలుగా అయితే, అశ్విన్ లెఫ్టాండర్లకు రౌండ్ ది స్టంప్స్ బౌల్ చేస్తాడు. కానీ ఈరోజు అతడు కూడా ఓవర్ ది స్టంప్స్ వేశాడు. ధోని వంటి అనుభవజ్ఞుడైన, దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఉన్న జట్టులో ఇదేం పరిస్థితి? వాళ్లు మెదళ్లు పనిచేయడం ఆగిపోయాయా?’’ అంటూ మనోజ్ తివారి క్రిక్‌బజ్ షోలో సీఎస్‌కే, ధోనిపై విమర్శల వర్షం కురిపించాడు.
కాగా చెపాక్‌లో కేకేఆర్‌తో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. కోల్‌కతా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులే చేసింది. స్పిన్నర్లు సునిల్ నరైన్ మూడు, వరుణ్ చక్రవర్తి రెండు, మొయిన్ అలీ ఒక వికెట్ తీయగా.. పేసర్లు వైభవ్ అరోరా ఒకటి, హర్షిత్ రాణా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ధనాధన్.. 10.1 ఓవర్లలోనే
ఇక సీఎస్‌కే బౌలింగ్ అటాక్‌ను పేసర్ ఖలీల్ అహ్మద్ ఆరంభించగా.. స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను ఎనిమిదో ఓవర్లో రంగంలోకి దింపారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నూర్ తన ఓవర్లో కేవలం రెండు పరుగులే ఇచ్చినా.. మరో రెండు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ గెలుపు ఖరారైంది.
సీఎస్‌కే విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్ పూర్తి చేసింది. ఓపెనర్లలో క్వింటన్ డికాక్ (23) రాణించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సునిల్ నరైన్ మెరుపు ఇన్నింగ్స్ (18 బంతుల్లో 44) ఆడాడు. కెప్టెన్ అజింక్య రహానే (17 బంతుల్లో 20).. రింకూ సింగ్ (12 బంతుల్లో 15)తో కలిసి కేకేఆర్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు.
చదవండి: వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
Game set and done in a thumping style ✅@KKRiders with a 𝙆𝙣𝙞𝙜𝙝𝙩 to remember as they secure a comprehensive 8️⃣-wicket victory 💜
Scorecard ▶ https://t.co/gPLIYGiUFV#TATAIPL | #CSKvKKR pic.twitter.com/dADGcgITPW— IndianPremierLeague (@IPL) April 11, 2025