టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్‌కు ‘మిస్టర్ కూల్’గానూ పేరుంది. పరిస్థితి చేయిదాటి పోతే తప్ప తలా.. మైదానంలో కోపం, అసహనం ప్రదర్శించడు. అయితే, శ్రీశాంత్ చేసిన పని వల్ల తొలిసారి ధోనికి ఆగ్రహానికి గురికావడం చూశానంటున్నాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
తొలిసారి ధోని కోప్పడటం చూశా
2010 నాటి సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని తన పుస్తకం ‘ఐ హావ్ ది స్ట్రీట్స్- ఏ కుట్టీ క్రికెట్ స్టోరీ’(I Have The Streets- A Kutty Cricket Story)లో అశూ వెల్లడించాడు. నాటి మ్యాచ్ సంగతులను ప్రస్తావిస్తూ..
‘‘ఆరోజు నేను డ్రింక్స్ అందించే పని చేస్తున్నా. అప్పుడు ధోని హెల్మెట్ తీసుకురమ్మని చెప్పాడు. నాకెందుకో మహీ కోపంగా ఉన్నట్లు కనిపించింది.
అతడు సహనం కోల్పోవడం నేను అంతకు ముందెన్నడూ చూడలేదు. ‘శ్రీ(శ్రీశాంత్) ఎక్కడ ఉన్నాడు? అతడు అసలేం చేస్తున్నాడు?’ అని ఎంఎస్ అడిగాడు.
శ్రీశాంత్‌కు ఈ సందేశం చేరవేరుస్తానని నేను చెప్పాను. ఆ తర్వాత ఎంఎస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే, మరుసటి ఓవర్లో నన్ను మళ్లీ పిలిచి మహీ హెల్మెట్ రిటర్న్ చేశాడు.
శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో!
అప్పుడు కామ్‌గానే ఉన్నట్లు అనిపించింది. నాకు హెల్మెట్ ఇచ్చే సమయంలో.. ‘ఒక పనిచెయ్.. రంజీబ్ సర్(టీమ్ మేనేజర్) దగ్గరికి వెళ్లు.
శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పు. వెంటనే అతడికి టికెట్ బుక్ చేయమని చెప్పు. అతడు ఎంచక్కా ఇండియాకు తిరిగి వెళ్లిపోతాడు. సరేనా’ అని నాతో అన్నాడు.
ధోని అలా అనడం ఊహించని నాకు షాక్ తగిలినట్లయింది. అసలు నేను ఈ మాటలు విన్నది ధోని నుంచేనా అని కాసేపు అయోమయానికి గురయ్యాను’’ అని అశ్విన్ తన పుస్తకంలో రాశాడు.
ఆ మరుసటి ఓవర్లో తనతో పాటు శ్రీశాంత్ కూడా భారత ఆటగాళ్లకు మైదానంలో డ్రింక్స్ అందించాడని అశూ తెలిపాడు. అయినప్పటికీ ధోని శాంతించలేదని.. అతడి నుంచి డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదని పేర్కొన్నాడు.
మళ్లీ తననే పిలిచి.. శ్రీశాంత్ టికెట్ గురించి మేనేజర్‌తో చెప్పావా?లేదా అని తనను గట్టిగా ప్రశ్నించాడని అశూ తెలిపాడు. కాసేపయ్యాక అంతా మామూలుగా మారిపోయిందని.. సమస్య సమసిపోయిందని అశ్విన్ వెల్లడించాడు.
ధోని కోపానికి కారణం ఇదే
కాగా రిజర్వ్ ఆటగాళ్లతో పాటు డగౌట్‌లో కూర్చోకుండా పేసర్ శ్రీశాంత్ డ్రెస్సింగ్‌రూంలోనే ఉండిపోవడమే ధోని ఆగ్రహానికి కారణం. ఆ తర్వాత అశ్విన్‌తో మెసేజ్ పంపగా.. శ్రీశాంత్ జెర్సీ వేసుకుని డగౌట్‌కు రావడంతో పాటు.. ధోని దెబ్బకు డ్రింక్స్ కూడా సర్వ్ చేశాడట. అదీ సంగతి!
చదవండి: బ్లడ్ క్యాన్సర్.. బాధగా ఉంది: బీసీసీఐకి కపిల్ దేవ్ విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment