మాజీ క్రికెటర్ ఆవేదన (PC: BCCI)
'I Had The Potential To Be A Hero': టీమిండియాలో తనకు తగినన్ని అవకాశాలు రాలేదని బెంగాల్ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి వాపోయాడు. అందరు క్రికెటర్ల మాదిరిగానే తనకూ ప్రోత్సాహం లభించి ఉంటే కచ్చితంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఉన్నత శిఖరాలకు చేరుకునేవాడినని పేర్కొన్నాడు.
మెరుగ్గా ఆడినప్పటికీ తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో అర్థంకాలేదని మనోజ్ తివారి ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా మాజీ బ్యాటర్, దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మనోజ్ ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా బిహార్‌తో మ్యాచ్ తర్వాత... 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో తన అంతర్జాతీయ క్రికెట్ గురించి మాట్లాడిన మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశాడు.
తొక్కేశారు!
‘‘2011లో నేను సెంచరీ బాదాను. అయితే, తర్వాతి మ్యాచ్‌లోనే నన్ను తుదిజట్టు నుంచి తప్పించారు. నాపై ఎందుకు వేటు వేశారని ధోనిని అడగాలనుకున్నా! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలా రాణించగల సత్తా నాకుంది. కానీ వాళ్లలా నాకు అవకాశాలు రాలేదు.
కానీ.. ఈరోజుల్లో యువ ఆటగాళ్లకు ఎన్నో ఛాన్సులు ఇస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు నా గురించి తలచుకుంటే బాధగా అనిపిస్తుంది’’ అని తివారి ఉద్వేగానికి లోనయ్యాడు.
కోల్‌కతా స్పోర్ట్స్' జర్నలిస్టు క్లబ్‌లో తనకు సన్మానం జరిగిన సమయంలో మనోజ్ తివారి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా.. యువ క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న అతడు.. రంజీ ట్రోఫీ ఆడాల్సిన ఆవశ్యకతను వారు అర్థం చేసుకోవాలని సూచించాడు.
దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపాడు
కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 148 మ్యాచ్‌లు ఆడిన మనోజ్ తివారి.. 10,195 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్ లో 169 మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 5581 రన్స్ చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అదే విధంగా 183 టీ20లలో 3436 పరుగులు సాధించిన మనోజ్ తివారి.. 2008- 2015 మధ్య కాలంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 12 వనేడ్లు, 3 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 287, 15 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మనోజ్ తివారి అత్యధిక స్కోరు 104*. చెన్నైలో వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ మేరకు స్కోరు సాధించాడు. అయితే, ఆ తదుపరి మ్యాచ్‌లో మాత్రం అతడికి ఆడే అవకాశం రాలేదు. ఇక 38 ఏళ్ల మనోజ్ తివారి బెంగాల్ రాష్ట్ర క్రీడామంత్రి కూడా!
Few moments bring tears to your eyes, few moments make you emotional... 🙌#GoodByeCricket pic.twitter.com/d4Pd8nSXbZ
— MANOJ TIWARY (@tiwarymanoj) February 19, 2024
Comments
Please login to add a commentAdd a comment