అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (140) శతక్కొట్టడంతో 337 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.
157 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరోసారి ఘోరంగా విఫలమైంది. కమిన్స్ (5/57) ధాటికి భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ కుమార్ రెడ్డే (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది.
చెత్త రికార్డు సమం చేసిన రోహిత్
తాజా ఓటమితో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో వరుసగా అత్యధిక ఓటములు (4) చవిచూసిన మూడో భారత సారథిగా ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, దత్తా గైక్వాడ్ సరసన నిలిచాడు. రోహిత్ సారథ్యంలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ధోని, విరాట్ నేతృత్వాల్లో కూడా భారత్ వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది.
టెస్టుల్లో అత్యధిక వరుస ఓటములు చవిచూసిన భారత కెప్టెన్ల జాబితాలో మన్సూర్ అలీఖాన్ పటౌడి (6 ఓటములు, 1967-68), సచిన్ టెండూల్కర్ (5 ఓటములు, 1990-2000) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ధోని (4 ఓటములు, 2011, 2014), విరాట్ (4 ఓటములు, 2020-21), రోహిత్ (4 ఓటములు, 2024) ఉన్నారు. కాగా, ఆసీస్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా స్వదేశంలో రోహిత్ నేతృత్వంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment