టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ తండ్రి భారత క్రికెట్ దిగ్గజాలపై ఇష్టారీతిన కామెంట్లు చేయడం తగదని.. ఆయన క్షమాపణ చెబితే బాగుంటుందని హితవు పలికాడు. లేదంటే.. ఆ ప్రభావం సంజూ ఆటపై కచ్చితంగా పడుతుందని పేర్కొన్నాడు.
కాగా కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు.. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు.
ఇక టెస్టుల్లో ఇంత వరకు సంజూ స్థానం దక్కించుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ అతడికి అరకొర అవకాశాలే వచ్చేవి. అయితే, ఆ సమయంలోనూ నిలకడలేమి ఆటతో చోటు కోల్పోయేవాడు.
సఫారీ గడ్డపై శతకాలు బాది
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. సంజూకు టీ20 జట్టులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో, సౌతాఫ్రికా గడ్డపై సంజూ బ్యాట్‌తో సత్తా చాటాడు. సఫారీలతో టీ20 సిరీస్‌లో రెండు శతకాలు బాది.. జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.
ఆ నలుగురి కారణంగానే
ఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఓ మలయాళ చానెల్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ వల్లే తన కుమారుడి పదేళ్ల కెరీర్ నాశనమైనందని ఆయన ఆరోపించాడు. విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆసీస్ లెజెండ్ బ్రాడ్ హాగ్ తాజాగా స్పందించాడు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు
ఈ మేరకు.. ‘‘సంజూ శాంసన్ తండ్రి బహిరంగంగా ధోని, కోహ్లి, రోహిత్, ద్రవిడ్ పేర్లు చెబుతూ.. తన కొడుకు కెరీర్‌లో పదేళ్లు వెనకబడటానికి కారణం వాళ్లే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. భారత క్రికెట్‌లో ముఖ్యమైన, కీలకమైన నాలుగు పేర్లను ఆయన ప్రస్తావించారు.
వాళ్లంతా తమ హయాంలో టీమిండియాను అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తులు. నిజానికి సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నాడు. రెండు సెంచరీలతో సత్తా చాటి.. తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉన్నాడు.
సంజూ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే అతడిపై ఒత్తిడి పెరుగుతుంది
ఇలాంటి సమయంలో సంజూ కుటుంబం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం.. అతడిపై ఒత్తిడిని పెంచుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. సంజూ కెరీర్ సాఫీగా, ప్రశాంతంగా సాగాలంటే.. అతడి తండ్రి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే.. తండ్రి వ్యాఖ్యల వల్ల ఒత్తిడికి లోనైతే.. సంజూ ఆట తీరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.
నోళ్లను అదుపులో పెట్టుకుని
ఐపీఎల్‌లో ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు అతడు కెప్టెన్‌గా ఉన్నాడు. సంజూతో పాటు భారత్‌లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. కాబట్టి ఎవరైనా సరే.. నోళ్లను అదుపులో పెట్టుకుని.. బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానం ఇస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అంటూ బ్రాడ్ హాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం: టీమిండియా కోచ్
Comments
Please login to add a commentAdd a comment