వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని | 60 In 6 Overs With Our Lineup Will Be Very Difficult: Dhoni After KKR Beat CSK | Sakshi
Sakshi News home page

వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని

Published Sat, Apr 12 2025 9:06 AM | Last Updated on Sat, Apr 12 2025 10:26 AM

60 In 6 Overs With Our Lineup Will Be Very Difficult: Dhoni After KKR Beat CSK

Photo Courtesy: BCCI/IPL

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వరుస పరాజయాలతో చతికిలపడ్డ సీఎస్‌కే.. తాజాగా మరో ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.

తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో తొలిసారి వరుసగా ఐదో ఓటమితో పాటు.. సొంత మైదానం చెపాక్‌లో హ్యాట్రిక్‌ పరాజయాన్ని నమోదు చేసింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) సీఎస్‌కేను ముందుండి నడిపించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

పూర్తిగా విఫలమైపోయాం
అయితే, కెప్టెన్‌గా పునరాగమనం చేసిన వేళ ధోనికి ఇలా ఊహించని, ఘోర పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందిస్తూ.. ‘‘గత కొన్ని రోజులుగా మాకు ఏదీ కలిసి రావడం లేదు. మా ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిని అంగీకరించకతప్పదు.

ఈరోజు మేము స్కోరు బోర్డుపై సరిపడా పరుగులు నింపలేకపోయాం. గత మ్యాచ్‌లలో రెండో ఇన్నింగ్స్‌లో మేము తడబడ్డాం. కానీ ఈసారి తొలి ఇన్నింగ్స్‌లోనే మేము దారుణంగా విఫలమయ్యాం. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైపోయాం.

పవర్‌ ప్లేలో 31 పరుగులు మాత్రమే వచ్చాయన్నది వాస్తవం. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటానికే ప్రాధాన్యం ఇస్తాం. గత రెండు మ్యాచ్‌లలో మీరు ఈ విషయం గమనించే ఉంటారు.  మా బలాలు ఏమిటో మాకు తెలుసు. అందుకు అనుగుణంగానే మేము ఆడతాం.

వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా
ఇతరులను అనుకరిస్తూ.. వారితో పోటీ పడుతూ.. వారిలాగానే ఆడాలనుకోవడం సరికాదు. స్కోరు బోర్డును చూస్తూ పవర్‌ప్లేలో అరవై పరుగులు చేయాలనే ఆతురత ఒత్తిడిని పెంచుతుంది. మా ఓపెనర్లు అచ్చమైన క్రికెట్‌ షాట్స్‌ ఆడతారు. పరిధులు దాటి హిట్టింగ్‌ మాత్రమే ఆడాలనే దృక్పథం మాకు లేదు. మాకు అది చేతకాదు కూడా.

భాగస్వామ్యాలు నెలకొల్పుతూ మధ్య ఓవర్ల సమయానికి పటిష్ట స్థితిలో ఉండాలని భావిస్తాం. ఒకవేళ ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే మిడిలార్డర్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకుంటుంది. మా ప్రణాళికలు ఇలాగే ఉంటాయి’’ అని ధోని పేర్కొన్నాడు. 

కాగా సీఎస్‌కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనికి ఉంది. కానీ ఇప్పుడిలా చేదు అనుభవం ఎదుర్కోవడంతో తాము తీవ్ర నిరాశకు గురైనట్లు తలా తెలిపాడు.

103 పరుగులు మాత్రమే
కాగా చెపాక్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన కేకేఆర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాపార్డర్‌లో ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (4), డెవాన్‌ కాన్వే (12).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి (16) మూకుమ్మడిగా విఫలమయ్యారు.

మిడిల్‌లో విజయ్‌ శంకర్‌ (21 బంతుల్లో 29), శివం దూబే (29 బంతుల్లో 31) ఫర్వాలేదనిపించగా.. అశ్విన్‌ (1), రవీంద్ర జడేజా (0), దీపక్‌ హుడా (0), కెప్టెన్‌ ధోని (1) తీవ్రంగా నిరాశపరిచారు. కేకేఆర్‌ బౌలర్లలో స్పిన్నర్లు సునిల్‌ నరైన్‌ మూడు, వరుణ్‌ చక్రవర్తి రెండు వికెట్లతో అదరగొట్టగా.. మొయిన్‌ అలీ కాన్వే రూపంలో కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.

10.1 ఓవర్లలోనే ఫినిష్‌
పేసర్లలో వైభవ్‌ అరోరా ఒకటి, హర్షిత్‌ రాణా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక సీఎస్‌కే విధించిన స్పల్ప లక్ష్యాన్ని కేకేఆర్‌ 10.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (16 బంతుల్లో 23), సునిల్‌ నరైన్‌ (18 బంతుల్లో 44) రాణించగా.. కెప్టెన్‌ అజింక్య రహానే (17 బంతుల్లో 20), రింకూ సింగ్‌ (12 బంతుల్లో 15) కలిసి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. 

చదవండి: SRH vs PBKS: సన్‌రైజర్స్‌కో విజయం కావాలి! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement