గొప్పగా బ్యాటింగ్‌ చేశాం.. కానీ మా బౌలర్లలో ఆ ఇద్దరు మాత్రం... | "He Was Struggling With The Ball...": KKR Captain Ajinkya Rahane Comments On LSG Defeat KKR By 4 Runs | Sakshi
Sakshi News home page

మేము గొప్పగా బ్యాటింగ్‌ చేశాం.. కానీ మా బౌలర్లలో ఆ ఇద్దరు మాత్రం..: రహానే

Published Wed, Apr 9 2025 9:09 AM | Last Updated on Wed, Apr 9 2025 10:18 AM

He Was Struggling With Ball: Rahane After LSG Defeat KKR By 4 Runs

Photo Courtesy: BCCI/IPL

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)కు మరో పరాజయం ఎదురైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో ఎదురైన ఈ చేదు అనుభవం పట్ల కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (Ajinkya Rahane) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.

గొప్పగా బ్యాటింగ్‌ చేశాం..
లక్నో చేతిలో ఓటమి అనంతరం స్పందిస్తూ.. ‘‘టాస్‌ సమయంలో నేను చెప్పినట్లుగానే.. ఈ వికెట్‌ 40 ఓవర్లపాటు బ్యాటర్లకు అనుకూలించింది. మేము కూడా మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. ఇదొక గొప్ప మ్యాచ్‌.

కానీ చివర్లో విజయానికి మేము కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాం. 230 పరుగులకి పైగా స్కోరును ఛేదించే క్రమంలో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. నిజంగా బ్యాటింగ్‌కు ఇది అత్యుత్తమ పిచ్‌.

కానీ మా బౌలర్లలో ఆ ఇద్దరు మాత్రం...
నిలదొక్కుకునేందుకు మా బ్యాటర్లు కాస్త ఇబ్బందిపడినా.. తర్వాత కుదురుకున్నారు. మధ్య ఓవర్లలో మా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే, సునిల్‌ నరైన్ బౌలింగ్‌ చేసే సమయంలో ఇబ్బంది పడ్డాడు. 

నిజానికి మిడిల్‌ ఓవర్లలో సునిల్‌, వరుణ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తారు. కానీ ఈరోజు మా బౌలర్లకు ఏదీ పెద్దగా కలిసి రాలేదు’’ అని అజింక్య రహానే పేర్కొన్నాడు. బౌలర్లు ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

పూరన్‌ వీరంగం
కాగా ఈడెన్‌ గార్డెన్స్‌లో మంగళవారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నికోలస్‌ పూరన్‌ (36 బంతుల్లో 87 నాటౌట్‌; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు), మిచెల్‌ మార్ష్‌ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకాలతో చెలరేగారు.

మరోవైపు.. మార్క్‌రమ్‌ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో పేసర్‌ హర్షిత్‌ రాణా రెండు, రసెల్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి,  సునిల్‌ నరైన్‌ మాత్రం ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వరుణ్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 31 పరుగులు ఇచ్చి వికెట్‌ తీయలేకపోయాడు. మరోవైపు.. నరైన్‌ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 38 పరుగులు ఇచ్చుకున్నాడు.

కేకేఆర్‌ మెరుపులు సరిపోలేదు
ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ అజింక్య రహానే (35 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో మెరవగా... వెంకటేశ్‌ అయ్యర్‌ (29 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్‌), సునీల్‌ నరైన్‌ (13 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (15 బంతుల్లో 38 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలి ప్లేయ‌ర్‌గా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement