‘కేకేఆర్‌ను వదిలెయ్‌ రింకూ.. వాళ్లకు ఆ అర్హత లేదు’! | I Request KKR With Folded Hands Should Send Rinku Slightly Up Order: Aakash Chopra | Sakshi
Sakshi News home page

KKR: చేతులు జోడించి అడుగుతున్నా.. రింకూని కాస్త ముందే పంపండి!

Apr 9 2025 4:17 PM | Updated on Apr 9 2025 4:47 PM

I Request KKR With Folded Hands Should Send Rinku Slightly Up Order: Aakash Chopra

Photo Courtesy: BCCI/IPL

ఈడెన్‌ గార్డెన్స్‌లో.. మంగళవారం సాయంత్రం.. పరుగుల వరద పారిన పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌దే పైచేయి అయింది. ఐడెన్‌ మార్క్‌రమ్ (28 బంతుల్లో 47), మిచెల్‌ మార్ష్‌ (48 బంతుల్లో 81)మెరుపులు మెరిపిస్తే... నికోలస్‌ పూరన్ (36 బంఉతల్లో 87 నాటౌట్‌)‌ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు.

ఫలితంగా లక్నో భారీ స్కోరు చేయగా... కొండంత లక్ష్యఛేదనలో రహానే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (35 బంతుల్లో 61)తో పోరాడినా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇరు జట్లు కలిసి 45 ఫోర్లు... 25 సిక్స్‌లతో రెచ్చిపోవడంతో ఓవరాల్‌గా మ్యాచ్‌లో 472 పరుగులు నమోదయ్యాయి. తాజా సీజన్‌లో లక్నోకు ఇది మూడో విజయం కాగా... కోల్‌కతాకు మూడో పరాజయం!  

ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) నాయకత్వ బృందంపై భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా విమర్శలు గుప్పించాడు. కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎందుకిలా ఉందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. పవర్‌ హిట్టర్‌గా పేరొందిన రింకూ సింగ్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు.

‘‘రమణ్‌దీప్‌ సింగ్‌ను ఐదో స్థానంలో పంపించారు. అంగ్‌క్రిష్‌ రఘువన్షీని ఆరో స్థానంలో ఆడించారు. కానీ రింకూ సింగ్‌ను లోయర్‌ ఆర్డర్‌కి పంపేశారు. ఇప్పటికీ కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై నేను ఒక అవగాహనకు రాలేకపోతున్నా.

చేతులు జోడించి అడుగుతున్నా
విజయానికి ఇంకో ఐదు లేదా ఏడు బంతులే మిగిలి ఉన్నాయనుకుంటే.. అప్పుడు కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు. చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. దయచేసి రింకూ సింగ్‌ను కాస్త టాప్‌లోకి ప్రమోట్‌ చేయండి. లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్లు ప్రతిసారీ వర్కౌట్‌ కావు.

ఆఖర్లో హర్షిత్‌ రాణా అతడికి స్ట్రైక్‌ ఇచ్చి ఉంటే.. మీరు నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయే వారు కాదు’’ అని ఆకాశ్‌ చోప్రా కేకేఆర్‌ మేనేజ్‌మెంట్‌ తీరును తప్పుబట్టాడు. గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకున్నారని విమర్శించాడు.

కాగా లక్ష్య ఛేదనలో నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన రమణ్‌దీప్‌ సింగ్‌(1), అంగ్‌క్రిష్‌ రఘువన్షీ (5) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కేకేఆర్‌ విజయ సమీకరణం 28 బంతుల్లో 62గా మారిన వేళ.. అప్పుడు రింకూను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు.

ఈ క్రమంలో 15 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడి కంటే ముందు అంటే ఏడోస్థానంలో వచ్చిన ఆండ్రీ రసెల్‌ (7) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.  

ఇక ఆఖర్లో రింకూకు జతకలిసిన పేసర్‌ హర్షిత్‌ రాణా 9 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేశాడు. అప్పటికే ఓవర్లు పూర్తి కావడంతో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో కేకేఆర్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది.

కేకేఆర్‌ను వదిలేయ్‌ రింకూ
ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా పైవిధంగా స్పందించగా.. అభిమానులు సైతం రింకూ సింగ్‌ ఆటను చంపేస్తున్నారంటూ అభిమానులు సైతం సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు. 

రింకూ కేకేఆర్‌ జట్టును వదిలి వెళ్లిపోవాలని.. కోల్‌కతా ఫ్రాంఛైజీకి అతడిని తమతో అట్టిపెట్టుకునే అర్హత లేదంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. కాగా కేకేఆర్‌ వల్లే రింకూ వెలుగులోకి వచ్చి.. టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న  విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు రింకూను కేకేఆర్‌ రూ. 13 కోట్లకు రిటైన్‌ చేసుకుంది.

చదవండి: PBKS Vs CSK: గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement