ఖేర్వాడి ఫ్లైఓవర్‌కు మోక్షం | MMRDA sanctions flyover at Kherwadi | Sakshi
Sakshi News home page

ఖేర్వాడి ఫ్లైఓవర్‌కు మోక్షం

Published Sat, Oct 5 2013 12:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM

MMRDA sanctions flyover at Kherwadi

 సాక్షి, ముంబై: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఖేర్వాడి ఫ్లైఓవర్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ నెల చివరి వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) నిర్ణయించింది. ట్రాఫిక్ పోలీస్ శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే చకచక పనులు జరుగుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
 
 ‘ఈ ఫ్లై ఓవర్‌ను ఆరు లేన్లతో నిర్మించనున్నారు. 2.5 కి.మీ మేర చేపట్టనున్న దీని నిర్మాణం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి బాంద్రాలోని కలానగర్ జంక్షన్‌కు 100 మీటర్ల దూరం వరకు ఉంటుంద’ని చెప్పారు. ఇది వినియోగంలోకి వస్తే  ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రయాణ సమయం కూడా భారీగా ఆదా అవుతుందని తెలిపారు. అయితే ఈ నిర్మాణ సమయంలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని, రద్దీ సమయంలో  దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు.
 
 ట్రాఫిక్ అధికారులతో చర్చిస్తున్నాం
 ఈ ఫ్లైఓవర్ నిర్మాణం విషయమై ట్రాఫిక్ అధికారులతో చర్చిస్తున్నామని,  వీరి నుంచి త్వరలోనే అనుమతి లభిస్తుందని ఎమ్మెమ్మార్డీయే అదనపు కమిషనర్ అశ్విని భిహ్‌డే తెలిపారు. ఈ నెల 15వ తేదీన నిర్మాణ పనులు చేపట్టే అవకాశముందన్నారు. ఈ పనుల కోసం వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మార్గంలో రెండులేన్లను మూసివేయనున్నామని పేర్కొన్నారు. కల్యాణ్ దిశగా వెళ్లే వాహనచోదకులను సర్వీస్ రోడ్ మీదుగా మళ్లించాలని నిర్ణయించామన్నారు.
 
 కొంత సమయం తీసుకుంటుంది
 ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతిచ్చేందుకు మరికొంత సమయం తీసుకుంటుందని ట్రాఫిక్ పోలీస్ యూనిట్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ పీపీ టేమ్కర్ తెలిపారు. ఎమ్మెమ్మార్డీయే తమకు ట్రాఫిక్ మళ్లింపు పత్రాలతోపాటు అవసరమున్న ఇతర పత్రాలను తమకు అందజేయలేదని అన్నారు. దీంతో వాహన చోదకులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఖరారు చేయలేదని పేర్కొన్నారు. అయితే నవంబర్‌కు ముందు మాత్రం ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతిని ఇవ్వబోమని వారు తెలిపారు.  ‘రద్దీ సమయంలో కలానగర్ జంక్షన్ నుంచి వకోలా ఫ్లైఓవర్ వరకు నిత్యం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఖేర్వాడి సిగ్నల్ వద్ద ఇరు ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు నిలిచిపోతాయి. దీంతో ఇక్కడ అధిక సమయం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంద’ని టేమ్కర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement