త్వరలోనే మంచిరోజులు వస్తాయన్న ఎమ్మెమ్మార్డీయే అధికారి
సాక్షి, ముంబై: దేశంలోనే మొట్ట మొదటిసారిగా ముంబైలో ప్రారంభించిన మోనో రైలువల్ల మహానగర ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)కు సంవత్సర కాలంలో ఏకంగా రూ.18 కోట్ల మేర నష్టం వాటిల్లింది. చెంబూర్-వడాల మధ్య 8.9 కి.మీ. దూరం ఉన్నమార్గంపై ఉదయం ఆరు నుంచి రాత్రి 10 గంటల వరకు మోనో రైళ్లు సేవలు అందిస్తున్నాయి.
రోజుకు అవి తిరిగే 64 ట్రిప్పుల్లో 36,352 మంది ప్రయాణికులను అవి చేరవేయగలవు. కానీ వాటిలో ప్రతిరోజు సగటున 10-13 వేల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మోనోరైలుకు ప్రయాణికుల ఆదరణ తగ్గడానికి ఎమ్మెమ్మార్డీయే డిప్యూటీ డెరైక్టర్ దిలీప్ కవట్కర్ పలు కారణాలను వివరించారు. మోనోరైలు ప్రయాణించే మార్గం చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకా అభివృద్ధి కావాల్సి ఉందన్నారు. ఈ మార్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇతర వాణిజ్య, వ్యాపార భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని చెప్పారు.
దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పైన మోనో రైలు దిగిన ప్రయాణికులు అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు అవసరమైన బస్సు, ట్యాక్సీ, ఆటోలు తగినంత సంఖ్యలో అందుబాటులో లేవన్నారు. దీంతో చాలా మంది మోనో రైలుకు బదులుగా ఆటో, ట్యాక్సీ, బెస్ట్ బస్సులనే ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం (చెంబూర్-వడాల) మోనో రైలు చాలా తక్కువ దూరం ప్రయాణిస్తోంది. వడాల నుంచి సాత్‌రాస్తా మార్గం పనులు పూర్తయితే ఏకంగా ఈ మార్గం 20 కి.మీ. దూరం పెరుగుతుంది. అప్పుడు ప్రయాణికుల నుంచి స్పందన వస్తుందని దిలీప్ కవట్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతవరకు ఈ నష్టాలు తప్పవని అన్నారు. మోనో రైలుకు ప్రస్తుతం లోకల్ రైళ్ల కనెక్టివిటీ లేకపోవడం కూడా తమ నష్టాలకు కారణమని కవట్కర్ అన్నారు. ఈ సంవత్సరం చెంబూర్-వడాల- సాత్‌రాస్తా మార్గం పనులు పూర్తయితే, వడాల స్టేషన్‌లో హార్బర్, కరీరోడ్ స్టేషన్‌లో సెంట్రల్ రైలు మార్గాలు కనెక్టివిటీ అవుతాయి. అప్పుడు మోనోకు మంచి రోజులు వస్తాయని దిలీప్ కవట్కర్ అన్నారు.
మోనో రైలుతో రూ.18 కోట్ల నష్టం
Published Mon, Feb 2 2015 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM
Advertisement