సాక్షి, ముంబై: నవంబర్ చివరిలో వడాలా-చెంబూరు మధ్య 8.8 కి.మీ. మేర దూరంలో ప్రారంభమయ్యే మోనోరైలు ప్రారంభ దశలో కేవలం ఐదు గంటలు మాత్రమే నడుపనున్నారు. ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒక రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. వీటి పూర్తి స్థాయి కార్యకలాపాలకు మరికొంత సమయం పట్టనుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అయితే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ), ప్రాజెక్‌ట ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మోనోరైలు ప్రాజెక్టు మొత్తం పూర్తి అయిన వెంటనే వీటి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో మోనోరైలు ఐదు గంటలు మాత్రమే నడపాలని నిర్ణయించామన్నారు.
తర్వాత ఈ మార్గంలో పనులు సంపూర్ణంగా పూర్తి అయిన తర్వాత రెండు నెలల్లోనే ఈ రైలు సేవలు 10 గంటల వరకు పొడిగిస్తామని అధికారి తెలిపారు. అయితే చివరగా షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉందన్నారు. 20 కి.మీ. మోనోరైల్ కారిడార్ ఎస్‌జీఎం చౌక్ నుంచి చెంబూర్ వరకు వయా వడాలా మీదుగా నడిచే విధంగా ప్రణాళికను తయారుచేసిన విషయం తెలిసిందే. అయితే 11.2 కి.మీ దూరమైన ఎస్‌జీఎం చౌక్-వడాల మార్గంపై పెండింగ్ పనులు పూర్తి కావడానికి మరి కొన్ని నెలలు పడుతుందని, దీంతో ప్రయాణికులు ఈ మార్గంపై రైలు సేవల కోసం మరి కొన్ని నెలలు వేచి చూడక తప్పదని అధికారి తెలిపారు.
కాగా ఈ రైలు సేవలను ప్రారంభ దశలో నాలుగు నిమిషాలకు ఒకసారి ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకు గతంలో నిర్ణయించినప్పటికీ ఇప్పుడు తొమ్మిది నిమిషాలకు ఒక రైలును అందుబాటులో ఉంచనున్నట్లు వారు వెల్లడించారు. అయితే కాంట్రాక్‌ట ఒప్పందం ప్రకారం.. తొమ్మిది నిమిషాలకు ఒక రైలు నడిపే విధంగా ఉందని అడిషినల్ మెట్రోపాలిటన్ కమిషనర్ అశ్విని భిడే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రజా స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత షెడ్యూల్‌ను ఖరారు చేయాలని మరో అధికారి అభిప్రాయపడ్డారు. అయితే ఇది కొత్త విధానం కావడంతో ప్రారంభంలో ఈ రైలు సేవలను ఎంత మంది ప్రయాణికులు వినియోగించుకుంటారనేది ముందుగానే అంచనా వేయలేమన్నారు. ఇదిలా ఉండగా ఈ రైలు మార్గంలో ఇతర మార్గాలతో పోల్చితే వడాలా-చెంబూర్ మార్గం చాలా ప్రఖ్యాతి గాంచిందన్నారు. దీంతో ఈ మార్గంలోనే నవంబర్ ఆఖరు వరకు రైలు ప్రారంభించాలని నిర్ణయించామని అధికారి వెల్లడించారు.
వడాలా - చెంబూరు మార్గంలో ‘మోనో’రైలు మొదటి సేవలు
Published Thu, Oct 10 2013 1:38 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement