సాక్షి, ముంబై: నగరంలోనే మొదటి సొరంగ మెట్రో రైలు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొలాబా-బాంద్రా-సీప్జ్ మధ్య ప్రతిపాదిత 33.5 కి.మీ. సొరంగ మెట్రో రైలు మార్గ నిర్మాణానికి అవసరమైన రుణం మంజూరుకు జపాన్ బ్యాంకులు ముందుకు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అవసరమైన వివిధ శాఖల నుంచి తీసుకునే అనుమతుల ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ సొరంగ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.23 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారుల అంచనా. ఇందులో రూ.13 వేల కోట్లను రుణాల రూపంలో అందజేసేందుకు జపాన్ బ్యాంకులు అంగీకరించాయి. మొదటి విడతగా రూ.4,553 కోట్లు చెల్లించేందుకు రెండు రోజుల కిందట ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. దీనిపై ఢిల్లీకి చెందిన ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి రాజేశ్ ఖుల్లార్, జపాన్ బ్యాంకుకు చెందిన భారతదేశ ప్రధాన ప్రతినిధి శిన్యా ఎజిమా తదితరులు సంతకాలు చేశారు.
ఈ రుణాలను తిరిగి జపాన్ బ్యాంకులకు 30 ఏళ్లలో చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో మెట్రో-3 ప్రాజెక్టు పనుల ప్రతిపాదన కూడా ముందుకు సాగింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులు కూడా త్వరలో ప్రత్యక్షంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ వేగవంతమైంది. ఈ ప్రాజెక్టును ఏడు ప్యాకేజీల్లో మొదలుపెడతారు. గత అర్హత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఆరు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. 2014 నుంచి పనులు ప్రత్యక్షంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) కమిషనర్ యు.పి.ఎస్.మదన్ అన్నారు. నగరంలో రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి గట్టిక్కించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలక పాత్ర పోషించనుందని ఆయన వివరించారు.
ఈ ప్రాజెక్టు వివరాలు....
- కొలాబా-బాంద్రా-సీప్జ్ మధ్య 33.5 కి.మీ. సొరంగ మార్గం
- ఈ మార్గంపై మొత్తం 26 స్టేషన్లు ఉంటాయి.
- ముందుగా కఫ్ పరేడ్ నుంచి పనులు ప్రారంభమై వర్లీ, బాంద్రా ప్రాంతాలను తాకుతూ సీప్జ్ వరకు వెళుతుంది.
- కార్ డిపో కోసం గోరేగావ్‌లోని ఆరే కాలనీలో స్థలం కేటాయించారు.
- ఈ ప్రాజెక్టు పనులు పారదర్శకంగా కొనసాగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డెరైక్టర్లతో కూడిన సంయుక్త కంపెనీ స్థాపించనున్నారు.