Mumbai Metro
-
ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే?
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐదు రోజుల ముందు ముంబై మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్ల నిర్వహణ బాధ్యతను మొత్తం మహిళా సిబ్బందికే అప్పగించింది. మహిళా సాధికారతను చాటిచెప్పెందుకు ఇలా చేసింది. దీంతో ఈ రెండు మెట్రో స్టేషన్లలో పూర్తిగా మహిళా సిబ్బందే కన్పించనున్నారు. స్టేషన్ మేనేజర్ స్థాయి నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు మొత్తం 76 మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించున్నారు. వీరికి మూడు షిఫ్టుల్లో డ్యూటీ ఉంటుంది. రవాణా రంగంలోలో మహిళల భాగస్వామ్యాన్ని గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై మెట్రో అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు మహిళా దినోత్సవం సందర్భంగా తాత్కాలికంగా ఈ రెండు స్టేషన్లను మహిళా సిబ్బందికి అప్పగించలేదని, ఇకపై ఈ స్టేషన్ల బాధ్యత శాశ్వతంగా మహిళా ఉద్యోగులే చూసుకుంటారని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులోనూ మహిళా అనుకూల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్లు ఈ ఏడాది జనవరిలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం గమనార్హం.నెల రోజుల్లోనే వీటి బాధ్యతలను పూర్తిగా మహిళలకు అప్పగించారు. చదవండి: మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ.. -
‘అర్ధరాత్రి ఎందుకు ఇలా.. సిగ్గుచేటు’
ముంబై : మహారాష్ట్రలోని ఆరే కాలనీలో అర్ధరాత్రి చెట్ల నరికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద్దంటూ వందలాది మంది పర్యావరణ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేసి అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. గోరెగావ్ సమీపంలోని ఆరేకాలనీలో కార్ల పార్కింగ్ కోసం షెడ్డు నిర్మించేందుకు ముంబై మెట్రో నిర్ణయించింది. ఇందుకోసం భారీ సంఖ్యలో చెట్ల నరికివేత కార్యక్రమానికి పూనుకుంది. ఈ నేపథ్యంలో మెట్రో నిర్ణయాన్ని నిరసిస్తూ పర్యావరణ కార్యకర్తలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు చెట్ల నరికివేత అడ్డుకోవాలంటూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని కొట్టివేసింది. దీంతో మెట్రో అధికారులు రాత్రి సమయంలో నరికివేత పనులను ప్రారంభించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యావరణ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్డోజర్లకు అడ్డుగా నిలబడి శాంతియుతంగా నిరసన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై నిబంధనల ప్రకారం కోర్టు ఆర్డర్ వెబ్సైట్లో పెట్టిన 15 రోజుల తర్వాతే చెట్లు నరికివేసే వీలుంటుందని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. కానీ మెట్రో అధికారులు మాత్రం అర్ధరాత్రి అత్యుత్సాహం ప్రదర్శించి చెట్లను నరికివేయడం దారుణమని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై శివసేన చీప్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, వర్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య ఠాక్రే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు... ‘ మెట్రో 3 పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాల్సింది. కానీ అర్ధరాత్రి ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. భారీగా పోలీసులను మోహరించి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది. ఈ ప్రాజెక్టు ముంబైకి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే ప్రయోజనం చేకూరుస్తుంది అనుకున్నాం గానీ, ఇలా చెట్లను నరకుతుంది అనుకోలేదు అని వరుస ట్వీట్లు చేశారు. ఇక గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ సైతం పోలీసుల తీరును విమర్శించారు. ‘ ఆరేలో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై లాఠీచార్జీ చేశారు. వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. మహిళలను ఇష్టం వచ్చినట్లుగా నెట్టివేశారు. ఇది చట్టవ్యతిరేక చర్య’ అని ట్విటర్లో పేర్కొన్నారు. Lathi Charge done for the first time at the peaceful protests for Aarey. People have been detained inside, gates have been closed and the authorities are abusing the protestors. Women have been pushed and detained by the police at this hour, which is lawfully wrong. #SaveAarey — Jignesh Mevani (@jigneshmevani80) October 4, 2019 -
చేతిలో డబ్బు లేకున్నా మెట్రోలో ప్రయాణం
ముంబై: బ్యాంకు ఎకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే చాలు.. చేతిలో డబ్బు లేకున్నా మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. ముంబై మెట్రో బుధవారం నగదు రహిత ఆన్లైన్ టికెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ ద్వారా ఎకౌంట్లో నుంచి డబ్బు చెల్లించి సింగిల్, రిటర్న్ జర్నీ మెట్రో రైలు టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) మొబైల్ వాలెట్ పేటీఎంతో ఒప్పందం చేసుకుంది. పేటీఎం యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని దీని ద్వారా ముంబై మెట్రో రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పేటీఎం ద్వారా టికెట్ బుక్ చేసినపుడు రైల్వే స్టేషన్ కౌంటర్లోని ఉద్యోగికి ఎస్ఎంఎస్ వెళ్తుంది. పేటీఎం, మొబైల్ ఫోన్, కౌంటర్లలో ఒకే ట్రాక్షన్ ఐడీ కనిపిస్తుంది. ఇది మ్యాచ్ అయిన తర్వాత టికెటింగ్ ఆఫీసర్ టోకన్ మంజూరు చేస్తాడు. కొన్ని సెకన్లలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎంఎంఓపీఎల్ అధికారి చెప్పారు. -
పెరగనున్న మెట్రో చార్జీలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తున్న మెట్రోరైలు ప్రయాణం సామాన్యుడికి భారం కానుంది. మెట్రో చార్జీలు శుక్రవారం నుంచి వివిధ మార్గాల్లో రూ.10 -40 మధ్య పెరగనున్నాయి. మెట్రో నిర్వహణ పనులు చేపడుతున్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చెందిన ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్)కి వర్సోవా-అంధేరీ-గట్కోపర్ మార్గాల్లో ధరలని పెంచుకునే వెసులుబాటును ముంబై హైకోర్టు ఇచ్చింది. మెట్రో చార్జీల పెంపుపై స్టే విధించాలంటూ ఎంఎంఆర్డీఏ చేసిన విజ్ఞప్తిని ఇంతకుముందు సింగిల్ జడ్జి కొట్టేశారు. అయితే.. ఆ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ బర్గెస్ కొలాబావాలతో కూడిన డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. దాంతో రేట్ల పెంపునకు మార్గం సుగమమైంది. అయితే.. ధరల విషయాన్ని నిర్ణయించేందుకు మూడు నెలల్లోగా మెట్రో ఫేర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటుచేయాలని కూడా కోర్టు ఆదేశించింది. -
మెట్రోకు భూమిపూజ
సాక్షి, ముంబై: ముంబై మెట్రో-3 ప్రాజెక్టు పనులకు మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పుణే మెట్రో జాప్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలపై సమాచారం అందకపోవడమే కారణమని తెలిపారు. అయితే ఇప్పుడు అన్ని విషయాలపై సమాచారం లభించడంతో తొందర్లోనే ఆ ప్రాజెక్టు కూడా ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమం మరోల్‌లోని అంధేరీ-ఘాట్కోపర్ లింకు రోడ్డు (మరోల్ అగ్నిమాపక కేంద్రం) సమీపంలో జరిగింది. ఈ మెట్రో-3 ప్రాజెక్టును పూర్తిగా సొరంగాల ద్వారా భూగర్భంలో నిర్మిస్తారు. ఇది 2019 వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సుమారు రూ.23,136 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. మెట్రో రాకతో ముంబైలో రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. ఇప్పటికే ఘాట్కోపర్-వర్సోవా మధ్య మెట్రోరైలు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెట్రో-3 ప్రాజెక్టులో బాగంగా కొలాబా నుంచి సీప్జ్ వరకు మెట్రోరైలు మార్గాన్ని నిర్మించనున్నారు. -
ఠాణే వరకు ముంబై మెట్రో
అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి చవాన్ ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో ఇటీవల ప్రారంభమైన ముంబై మెట్రోను ఠాణే వరకు పొడిగిస్తామని ముఖ్యమంత్రి చవాన్ అసెంబ్లీలో శనివారం ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తుది నివేదిక త్వరలో వస్తుందన్నారు. ప్రతిపాదిత ఠాణే మెట్రోపై సభ్యులు అడిగిన ప్రశ్నకు చవాన్ సమాధానమిస్తూ... మెట్రోరైలు వ్యయాన్ని భరించే ఆర్థికస్థాయి ఠాణే నగరానికి లేదన్నారు. అందుకే ముంబై మెట్రోను ఠాణే వరకు విస్తరిస్తామని చెప్పారు. ఇక ఠాణే అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఘోడ్‌బందర్ ప్రాంతాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘ఠాణే నగరంలో మెట్రోరైలును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు రూపొందించినప్పుడు తీన్ హాత్ నాకా-కాపూర్బావ్డీ-ఘోడ్‌బందర్ ప్రాంతాల మీదుగా ఏర్పాటు చేసే విషయమై ఇంజనీర్ల బృందం అధ్యయనం చేసింది. ఆర్థిక విషయాలను కూడా పరిగణనలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అయితే ఆర్థికంగా అంత వెసులుబాటుగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో వడాలా-ఘాట్కోపర్-తీన్ హాత్ నాకా(ఠాణే) మార్గానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఠాణే నుంచి లక్షలాది మంది విధుల నిమిత్తం ముంబై నగరానికి వస్తుంటారు. దీంతో తీన్ హాత్ నాకా వరకు ముంబై మెట్రో రైలును పొడిగిస్తే ఠాణేవాసులకు సౌకర్యవంతంగా ఉంటుందని నిపుణుల బృందం అధ్యయనంలో తేలింది. అయితే దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం జరగాల్సి ఉంది. రెయిల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ సంస్థ ఇందుకు సంబంధించి అధ్యయనం చేస్తోంది. త్వరలో తుది నివేదిక అందుతుంది. ఆ తర్వాతే ఠాణే మెట్రోపై నిర్ణయం తీసుకుంటామ’న్నారు. ప్రతిపాదిత ముంబై-ఠాణే మెట్రో మార్గానికి రూ. 22,000 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు. 32 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ మార్గంలో 29 స్టేషన్లు ఉంటాయన్నారు. -
ప్రయాణానికి ముంబై మెట్రో రెడీ
సాక్షి, ముంబై: రాష్ట్రంలో మొదటిసారిగా అందుబాటులోకి వస్తున్న ‘ముంబై మెట్రో’ రైలుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) బృందం సోమవారం సాంకేతిక పరీక్షలు నిర్వహించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో అంతా సవ్యంగా ఉన్నట్లు అధికారులు సంతృప్తివ్యక్తం చేశారు. ఇక భద్రతాపరమైన సామర్థ్యాన్ని సూచించే ధ్రువపత్రం (సేఫ్టీ సర్టిఫికెట్) జారీ చేయడమే మిగిలిపోయింది. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని మే ఒకటో తేదీన దీనిని జారీ చేయనున్నట్లు ఇదివరకే సంకేతాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సేవలు ప్రారంభించేందుకు రైల్వే పరిపాలనా విభాగం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఆ తరువాత ముంత్రులు లేదా వీఐపీల నుంచి అపాయింట్మెంట్ లభించగానే ముహూర్తం ఖరారు చేస్తారు. లోకల్ రైళ్లలో నిత్యం రద్దీ, ఉక్కపోతతో సతమతమవుతున్న ముంబైకర్లకు మెట్రో సేవలు సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వేసవి ఎండల కారణంగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముంబైకర్ల మెట్రో ఏసీ బోగీల్లో సౌకర్యంగా ప్రయాణించవచ్చని చెబుతున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ముంబైలో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెమ్మార్డీయే తొలిసారిగా మెట్రోరైలు సేవలను ప్రారంభిస్తుండడంతో వీటి కోసం నగరవాసులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మెట్రో-1 ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో వర్సోవా-అంధేరి- ఘాట్కోపర్ మధ్య నిర్మిస్తున్న 11 కిలోమీటర్లు పొడమైన కారిడార్ ప్రాజెక్టు నిర్మాణ పనులు అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అనేక డెడ్లైన్లు కూడా వాయిదా పడటంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయింది. ఎట్టకేలకు పనులు పూర్తికావడంతో సీఎంఆర్ఎస్ బృందం భద్రతా పరీక్షలు నిర్వహించింది. సేఫ్టీ సర్టిఫికెట్ మంజూరు కాగానే ముహూర్తం ఖరారు చేస్తామని మెట్రో రైల్వే భద్రతా విభాగం కమిషనర్ పి.ఎస్.వాఘేలా చెప్పారు. విమానసేవలకు ఓకే రత్నగిరి-ముంబై ప్రాంతాల మధ్య 1991లో నిలిచిపోయిన విమానసేవలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబైకి చెందిన ‘ఇండియాపూల్’ కంపెనీ విమానం ద్వారా ఈ రెండు ప్రాంతాలను ఇటీవల సందర్శించింది. ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించేందుకు ఎలాంటి ఇబ్బందులూ లేవని సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రభుత్వమూ అనుమతులు ఇవ్వడంతో ఈ రెండు ప్రాంతాల మధ్య త్వరలోనే విమాన సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటగా ఎనిమిది సీట్ల సామర్థ్యమున్న తేలికపాటి విమానాలను నడపాలని యోచిస్తున్నారు. ఈ సేవలను స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నామని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) వర్గాలు తెలిపాయి. అప్పట్లో ఎంఐడీసీ ఆధ్వర్యంలో 1991 వరకు ముంబై-రత్నగిరి జిల్లా మధ్య విమాన సేవలు నడిచేవి. ఈ చిన్న విమానాలను రత్నగిరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు వినియోగించేవారు. కాలక్రమేణా వాటి వినియోగం తగ్గిపోయింది. అదేవిధంగా రన్‌వే కూడా విమానాలకు అనుకూలంగా లేదు. దీనికి మరమ్మతులు చేపట్టాలని ఎంఐడీసీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి స్పందనే రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఎంఐడీసీ 1991లో రత్నగిరి విమానాశ్రయంలో ప్రైవేటు విమానాల ల్యాండింగ్‌ను నిలిపివేసింది. అయితే ప్రస్తుతం రత్నగిరి జిల్లా వేగంగా విస్తరిస్తోంది. అనేక ప్రాజెక్టులు వచ్చాయి. జాతీయ ర హదారులు, రైల్వే, జలరవాణా ద్వారా రాకపోకలు, వాణిజ్య లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. వాహనాల సంఖ్య భారీగా పెరగడం, ర హదారిపై ప్రమాదకర మలుపులు, రోడ్డు ప్రమాదాలు, విలువైన సమయం వృథా తదితరాల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటే విమానసేవల ప్రాధాన్యమేమిటో తెలిసి వచ్చిందని ఎంఐడీసీ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అందుకే ముంబై-రత్నగిరి మధ్య తేలికపాటి విమానాల సేవలను ప్రారంభిస్తే బాగుంటుందనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అదేవిధ ంగా కొంకణ్ ప్రాంతం కూడా పర్యాటకపరంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అందమైన సముద్ర తీరాలు ఉన్నాయి. ఇక్కడికి నిత్యం దేశ, విదేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. విమానసేవలు ప్రారంభిస్తే కొంకణ్ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని జిల్లా ఇంచార్జి మంత్రి ఉదయ్ సామంత్ అభిప్రాయపడ్డారు. అందుకు ముంబైలోని ఇండియాపూల్ కంపెనీతో చర్చలు జరిపామని అన్నారు. దీంతో కంపెనీ అధికారులు ఈ రెండు ప్రాంతాలను విమానం ద్వారా పర్యవేక్షించి సేవల ప్రారంభానికి అంగీకరించారని సామంత్ వివరించారు. -
‘ముంబై మెట్రోగా మార్చండి’
ముంబై: అత్యంత ప్రతిష్టాత్మకమైన సిటీ మెట్రోకి ‘రిలయన్స్ మెట్రో’గా నామకరణం చేయడంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ ముంబై మెట్రోగా మార్చాలని డిమాండ్‌చేస్తూ బుధవారం స్థానిక అంధేరీ ప్రాంతంలోని మెట్రో స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రాందాస్ అథవాలే మాట్లాడుతూ మెట్రో రైళ్లు, ప్లాట్‌ఫాంలపై రిలయన్స్ మెట్రో అని రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు బదులు ముంబై మెట్రో అని రాయాలన్నారు. ఏడురోజుల్లోగా అవసరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్‌తోపాటు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారులను ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
సొరంగ మెట్రో రైలు లైన్ క్లియర్
సాక్షి, ముంబై: నగరంలోనే మొదటి సొరంగ మెట్రో రైలు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొలాబా-బాంద్రా-సీప్జ్ మధ్య ప్రతిపాదిత 33.5 కి.మీ. సొరంగ మెట్రో రైలు మార్గ నిర్మాణానికి అవసరమైన రుణం మంజూరుకు జపాన్ బ్యాంకులు ముందుకు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అవసరమైన వివిధ శాఖల నుంచి తీసుకునే అనుమతుల ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ సొరంగ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.23 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారుల అంచనా. ఇందులో రూ.13 వేల కోట్లను రుణాల రూపంలో అందజేసేందుకు జపాన్ బ్యాంకులు అంగీకరించాయి. మొదటి విడతగా రూ.4,553 కోట్లు చెల్లించేందుకు రెండు రోజుల కిందట ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. దీనిపై ఢిల్లీకి చెందిన ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి రాజేశ్ ఖుల్లార్, జపాన్ బ్యాంకుకు చెందిన భారతదేశ ప్రధాన ప్రతినిధి శిన్యా ఎజిమా తదితరులు సంతకాలు చేశారు. ఈ రుణాలను తిరిగి జపాన్ బ్యాంకులకు 30 ఏళ్లలో చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో మెట్రో-3 ప్రాజెక్టు పనుల ప్రతిపాదన కూడా ముందుకు సాగింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులు కూడా త్వరలో ప్రత్యక్షంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ వేగవంతమైంది. ఈ ప్రాజెక్టును ఏడు ప్యాకేజీల్లో మొదలుపెడతారు. గత అర్హత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఆరు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. 2014 నుంచి పనులు ప్రత్యక్షంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) కమిషనర్ యు.పి.ఎస్.మదన్ అన్నారు. నగరంలో రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి గట్టిక్కించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలక పాత్ర పోషించనుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు వివరాలు.... కొలాబా-బాంద్రా-సీప్జ్ మధ్య 33.5 కి.మీ. సొరంగ మార్గం ఈ మార్గంపై మొత్తం 26 స్టేషన్లు ఉంటాయి. ముందుగా కఫ్ పరేడ్ నుంచి పనులు ప్రారంభమై వర్లీ, బాంద్రా ప్రాంతాలను తాకుతూ సీప్జ్ వరకు వెళుతుంది. కార్ డిపో కోసం గోరేగావ్‌లోని ఆరే కాలనీలో స్థలం కేటాయించారు. ఈ ప్రాజెక్టు పనులు పారదర్శకంగా కొనసాగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డెరైక్టర్లతో కూడిన సంయుక్త కంపెనీ స్థాపించనున్నారు.