ఠాణే వరకు ముంబై మెట్రో
అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి చవాన్
ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో ఇటీవల ప్రారంభమైన ముంబై మెట్రోను ఠాణే వరకు పొడిగిస్తామని ముఖ్యమంత్రి చవాన్ అసెంబ్లీలో శనివారం ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తుది నివేదిక త్వరలో వస్తుందన్నారు. ప్రతిపాదిత ఠాణే మెట్రోపై సభ్యులు అడిగిన ప్రశ్నకు చవాన్ సమాధానమిస్తూ... మెట్రోరైలు వ్యయాన్ని భరించే ఆర్థికస్థాయి ఠాణే నగరానికి లేదన్నారు. అందుకే ముంబై మెట్రోను ఠాణే వరకు విస్తరిస్తామని చెప్పారు. ఇక ఠాణే అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఘోడ్‌బందర్ ప్రాంతాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
‘ఠాణే నగరంలో మెట్రోరైలును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు రూపొందించినప్పుడు తీన్ హాత్ నాకా-కాపూర్‌బావ్డీ-ఘోడ్బందర్ ప్రాంతాల మీదుగా ఏర్పాటు చేసే విషయమై ఇంజనీర్ల బృందం అధ్యయనం చేసింది. ఆర్థిక విషయాలను కూడా పరిగణనలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అయితే ఆర్థికంగా అంత వెసులుబాటుగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో వడాలా-ఘాట్‌కోపర్-తీన్ హాత్ నాకా(ఠాణే) మార్గానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఠాణే నుంచి లక్షలాది మంది విధుల నిమిత్తం ముంబై నగరానికి వస్తుంటారు. దీంతో తీన్ హాత్ నాకా వరకు ముంబై మెట్రో రైలును పొడిగిస్తే ఠాణేవాసులకు సౌకర్యవంతంగా ఉంటుందని నిపుణుల బృందం అధ్యయనంలో తేలింది.
అయితే దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం జరగాల్సి ఉంది. రెయిల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ సంస్థ ఇందుకు సంబంధించి అధ్యయనం చేస్తోంది. త్వరలో తుది నివేదిక అందుతుంది. ఆ తర్వాతే ఠాణే మెట్రోపై నిర్ణయం తీసుకుంటామ’న్నారు. ప్రతిపాదిత ముంబై-ఠాణే మెట్రో మార్గానికి రూ. 22,000 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు. 32 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ మార్గంలో 29 స్టేషన్లు ఉంటాయన్నారు.