పెరగనున్న మెట్రో చార్జీలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తున్న మెట్రోరైలు ప్రయాణం సామాన్యుడికి భారం కానుంది. మెట్రో చార్జీలు శుక్రవారం నుంచి వివిధ మార్గాల్లో రూ.10 -40 మధ్య పెరగనున్నాయి. మెట్రో నిర్వహణ పనులు చేపడుతున్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చెందిన ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్)కి వర్సోవా-అంధేరీ-గట్కోపర్ మార్గాల్లో ధరలని పెంచుకునే వెసులుబాటును ముంబై హైకోర్టు ఇచ్చింది.
మెట్రో చార్జీల పెంపుపై స్టే విధించాలంటూ ఎంఎంఆర్డీఏ చేసిన విజ్ఞప్తిని ఇంతకుముందు సింగిల్ జడ్జి కొట్టేశారు. అయితే.. ఆ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ బర్గెస్ కొలాబావాలతో కూడిన డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. దాంతో రేట్ల పెంపునకు మార్గం సుగమమైంది. అయితే.. ధరల విషయాన్ని నిర్ణయించేందుకు మూడు నెలల్లోగా మెట్రో ఫేర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటుచేయాలని కూడా కోర్టు ఆదేశించింది.