fare hike
-
ఆర్టీసీ కంటే నాలుగు రెట్లు అధిక ధర
-
ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ ఆర్టీసీ స్పందించింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్‌లోని టోల్ సెస్‌ను సంస్థ సవరించింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్‌ను యాజమాన్యం సవరించింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని సజ్జనార్ ట్వీట్ చేశారు.టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. #TGSRTC బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగింది. ఈ… pic.twitter.com/kO2mbAkjl2— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 12, 2024 -
‘ఉబర్ సీఈవో తిక్క కుదిరింది’
రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబర్ కస్టమర్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతంలో క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్ల ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంటే వారి నుంచి ఎక్కువ ఛార్జీ విధిస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అదనపు ఛార్జీల బాదుడు సెగ కస్టమర్లకే కాదు ఉబర్ సీఈవో ఖోస్రోషాహికి తగలింది. ఎలా అంటారా? మ్యాగజైన్ సంస్థ వైర్డ్ ఎడిటర్ స్టీవెన్ లెవీ ఉబర్ సీఈవోని ఇంటర్వ్యూ చేసేందుకు ఉబర్ క్యాబ్‌నే బుక్ చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం న్యూయార్క్‌లోని డౌన్‌టౌన్ సిటీ నుంచి నాలుగున్న కిలోమీటర్ల దూరంలో వెస్ట్‌సైడ్ ఉబర్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడే 2.95 మైళ్ల ఉబెర్ రైడ్ ఛార్జీ ఎంత అయ్యింటుందో చెప్పాలని స్టీవెన్ లెవీ.. ఖోస్రాషాహిని అడిగారు. అందుకు ఉబర్ సీఈవో ఇరవై డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా డ్రైవర్ టిప్‌తో కలిపి ఉబర్ రైడ్‌కి 51.69 డాలర్లు ఛార్జీ పడిందని అన్నారు. వైర్డ్ ఎడిటర్ ఊహించని దానికంటే ఎక్కువ చెల్లించడంపై ఉబర్ సీఈవో సైతం షాక్ తిన్నారు. ‘ఓ మై గాడ్’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఐదు నిమిషాల ముందు 20 డాలర్ల కంటే ఎక్కువగా ఉందని జర్నలిస్ట్ సీఈవోకి చెప్పారు. అంతేకాదు ఉబర్ రైడ్‌లో ఈ ధరల వ్యత్యాసం గురించి ప్రశ్నించారు. బదులుగా ఖోస్రోషాహి ద్రవ్యోల్బణం, రైడ్ సమయం పెరిగిపోతున్న కొద్ది ఛార్జీల విధింపు, కార్మికుల చెల్లించే వేతనాలే కారణమని తెలిపారు. ఇలా భారీగా ఉన్న ఉబర్ క్యాబ్ ధరలపై జర్నలిస్ట్ ఖోస్రోషాహిని ప్రశ్నించడం, సంభాషణల మధ్యలో ఉబర్ విధిస్తున్న ఛార్జీల్ని సీఈవో సమర్ధించడం.. అందుకు జర్నలిస్ట్ వ్యతిరేకించడం వంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చాకు దారి తీశాయి. దీంతో పలువురు నెటిజన్లు ఉబర్ క్యాబ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఉబర్ సీఈవో సమాధానం చెప్పలేకపోయారు. తిక్క కుదిరింది అంటూ సమర్ధిస్తున్నారు. కాగా, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..అమెరికాలో ఉబర్ ధరలు 2018 నుండి 2022 వరకు ద్రవ్యోల్బణం రేటు కంటే నాలుగు రెట్లు పెరిగాయని, దాదాపు నాలుగు సంవత్సరాలలో మొత్తం 83శాతం ధరలు పెరిగాయని వెల్లడించింది. -
విమానాశ్రయాలకు మంచి రోజులు!
ముంబై: మహమ్మారి వల్ల గత రెండు సంవత్సరాల్లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విమానాశ్రయాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23) మంచి రోజులు రానున్నాయని రేటింగ్ దిగ్గజం ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ, దేశీయంగా విమానయాన చార్జీల పెంపు దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. మహమ్మారి కారణంగా రెండేళ్ల నిషేధం తర్వాత ఆదివారం నుండి అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలను పునఃప్రారంభమయిన నేపథ్యంలో విడుదలైన నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► విమాన ప్రయాణీకుల రద్దీ సంవత్సరం వారీగా 68 నుంచి 70 శాతం మేర వృద్ధి చెంది 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో 31.7 కోట్ల నుంచి 32 కోట్ల శ్రేణికి చేరే వీలుంది. ► ఈ అంశాల కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో విమానాశ్రయాల నిర్వహణ ఆదా యం 49–51 శాతం శ్రేణిలో పెరిగి రూ. 14,400–14,600 కోట్లకు చేరుకుంటుంది. ఆపరేటర్లకు 29–30 శాతం ఆపరేటింగ్ మార్జిన్ లభించే అవకాశం ఉంది. 2021–22లో ఈ రేటు 18 నుంచి 19 శాతం ఉంది. అయితే కరోనా ముందస్తు ఏడాది అంటే 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆదాయాల వృద్ధి రేటు (అప్పట్లో 40 శాతం) ఇంకా వెనకబడి ఉండడం గమనార్హం. అయితే ఈ స్థాయి వృద్ధి రేటు తిరిగి 2023–24 ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యే వీలుంది. ► అంతర్జాతీయ ట్రాఫిక్ 100–105 శాతం పటిష్ట వృద్ధిని సాధిస్తుంది. అయితే ఈ స్థాయిలో మంచి గణాంకాల సాధనకు నాల్గవవేవ్ సవాళ్లు తలెత్తకూడదు. ఒకవేళ ఈ సవాళ్లు వచ్చినా దాని ప్రభావం అతి తక్కువగా ఉండాల్సి ఉంటుంది. ► ఇక మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వస్తే, పాసింజర్ ట్రాఫిక్ 62 నుంచి 64 శాతం పెరిగి 18.7 కోట్ల నుంచి 18.9 కోట్ల శ్రేణిలో నమోదుకావచ్చు. ఒమిక్రాన్ సవాళ్లు ఎదురయినప్పటికీ, ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకు పటిష్ట వ్యాక్సినేషన్ కారణం. ► అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభం కారణంగా ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఐరోపా దేశాల నుంచి ట్రాఫిక్ గణనీయంగా మెరుగుపడుతుంది. పెట్టుబడులు ఇలా.. ఇదిలాఉండగా ఇక్రా నివేదిక ప్రకారం, విమానయాన రంగం వచ్చే ఐదేళ్లలో రూ.90,000 కోట్ల కొత్త పెట్టుబడులను పొందే వీలుంది. ఇందులో ప్రధాన ప్రైవేట్ విమానాశ్రయాల్లో కొనసాగుతున్న సామర్థ్య విస్తరణ, ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహించే విమానాశ్రయాల్లో ఆ సంస్థ రూ. 25,000 కోట్ల పెట్టుబడులు, 21 కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు రూ. 30,000 –34000 కోట్లు, ఏఏఐ నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు విమానాశ్రయాలను అప్‌గ్రేడ్ చేయడానికి అదానీ గ్రూప్ పెడుతున్న దాదాపు రూ. 17,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. -
కరోనా: కేఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
కొచ్చి: కరోనా వైరస్ సంక్షోభం తరువాత కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ 4.0 సడలింపుల్లో భాగంగా అంతర్ జిల్లా సేవలకు ప్రభుత్వం బుధవారం అనుమతి నిచ్చింది. ఈ నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ టికెట్ల ధరలను 50 శాతం పెంచేసింది. కీలక సమయాల్లో సాధ్యమైన ఎక్కువ బస్సులను బుధవారం నుంచి నడపనున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎ.కె.ససీంద్రన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు, సూచనలను ప్రతి డిపోకి ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కేవలం 50 శాతానికి మాత్రమే అనుతి వుండటంతో టికెట్ ధర 50 శాతం పెంచినప్పటికీ, కార్పొరేషన్ రోజుకు రూ .42 లక్షల నష్టాన్ని చవిచూస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తాత్కాలికంగా టికెట్ రేటును 50 శాతం పెంచింది. కనీస ఛార్జీలను రూ. 8 నుండి రూ. 12కు పెంచింది. అలాగే అన్ని ఆర్టీసీ యూనిట్లకు ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేయడంతోపాటు, సిబ్బంది, ప్రయాణీకులకు ఫేస్ మాస్క్ వాడకం తప్పనిసరి చేసింది. ప్రభుత్వం.ప్రయాణీకులు భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. బస్సు ఎక్కే ముందు శానిటైజర్ ఉపయోగించాలి. (కరోనా: వారికి ఎం అండ్ ఎం బంపర్ ఆఫర్లు) 50శాతం సామర్థ్యంతో 25 కంటే ఎక్కువ మంది ప్రయాణికులతో బస్సులు నడపడానికి అనుమతి లేదు.డబుల్ సీటర్లలో ఒకే ప్రయాణీకుడికి, మూడు సీట్లలో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే అనుమతి వుంది. మరోవైపు ప్రజా రవాణాలో కీలక మైన ప్రైవేట్ బస్సుల సర్వీసులు తిరిగి ప్రారంభించడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. -
జియో బాదుడు.. 39% పైనే
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో... ఛార్జీలు పెంచుతూ కొత్త రేట్లను బుధవారం విడుదలచేసింది. డిసెంబర్ 6 నుంచి ధరలు పెరగనున్నట్లు కంపెనీ గతంలోనే ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న ట్యారిఫ్‌లతో పోల్చితే 39%కి పైగా పెంపును ప్రకటించింది. రోజుకు 1.5 జీబీ డేటాతో 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్యాకేజీ ధర ప్రస్తుతం రూ.399 ఉండగా.. దీని ధరను రూ. 555 చేసింది. రూ.153 ప్లాన్ ధర శుక్రవారం నుంచి రూ.199 కానుంది. రూ.349 ప్లాన్ రూ. 399గా మారనుంది. రూ.448 ప్లాన్ రూ.599 కానుండగా.. ప్రస్తుతం ఏడాదికి రూ.1,699గా ఉన్న ప్లాన్ రూ.2199కి చేరనుంది. ట్యారిఫ్ పెరిగినప్పటికీ.. పోటీ సంస్థలు ఇస్తోన్న ప్లాన్లతో పోలిస్తే మాత్రం తమ నూతన ట్యారిఫ్ 25 శాతం తక్కువగా ఉన్నట్లు కంపెనీ వివరించింది. రూ.199 ప్లాన్‌ను ఇతర సంస్థలు రూ. 249కి అందిస్తున్నాయని లెక్కలు వేసి చూపిస్తోంది. -
మరోసారి మెట్రో ఛార్జీల పెంపు
ఆదాయాలను పెంచుకోవడానికి ఢిల్లీ మెట్రో తన ఛార్జీలను పెంచడం మొదలు పెట్టింది. ఛార్జీల పెంపుతో ఓ వైపు ప్రయాణికులు తగ్గిపోతున్నా... మరోవైపు నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఈ పెంపుపై మాత్రం ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ అసలు తగ్గడం లేదు. మరోసారి 2019 జనవరిలో కూడా ఢిల్లీ మెట్రో తన ఛార్జీలు పెంచబోతున్నట్టు తెలిసింది. కేంద్రం నియమించిన కమిటీ ప్రతిపాదనలను ఢిల్లీ మెట్రో అమలు చేయబోతుందని వెల్లడైంది. ఇప్పటికే ఈ కమిటీ ప్రతిపాదించిన మేరకు మే, అక్టోబర్‌లో రెండు దశల్లో ఛార్జీల పెంపు జరిగింది. జస్టిస్(రిటైర్డ్) ఎంఎల్ మెహతా చైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పడింది. దీనిలోనే ఢిల్లీ చీఫ్ సెక్రటరీ, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ బోర్డులో అదనపు సెక్రటరీలున్నారు. మెట్రో రైల్వే యాక్ట్ కింద 4వ ఛార్జీలను నిర్ణయించే కమిటీ(ఎఫ్ఎఫ్సీ) ఏర్పడింది. ఆటోమేటిక్ యాన్యువల్ ఫేర్ రివిజన్‌ను ఇది ప్రతిపాదించింది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో ఛార్జీలు 2 కిలోమీటర్లకు రూ.10, 2 నుంచి 5 కిలోమీటర్లకు 20 రూపాయలు, 5 నుంచి 12 కిలోమీటర్లకు 30 రూపాయలు, 12 నుంచి 21 కిలోమీటర్లకు 40 రూపాయలు, 21 నుంచి 32 కిలోమీటర్లకు 50 రూపాయలు, 32 కిలోమీటర్లకు మించితే రూ.60 ఛార్జీలు విధిస్తున్నారు. ఛార్జీల పెంపును నిలిపివేయాలంటూ మోదీ ప్రభుత్వాన్ని సీఎం కేజ్రీవాల్ కోరినప్పటికీ, కేంద్రం అసలు తగ్గలేదు. ఛార్జీల పెంపుతో ఒక్క నెలలోనే భారీగా ప్రయాణికులను కోల్పోయింది. సెప్టెంబర్ లో 27.4 లక్షలుగా ఉన్న ప్రయాణికులు, ధరల పెంపు తర్వాత అక్టోబర్ నెలలో ప్రయాణికుల సంఖ్య 24.2 లక్షలకు పడిపోయారు. -
మెట్రోను చంపేస్తుంది : సీఎం
న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఛార్జీల పెంపు ఢిల్లీ మెట్రోను చంపేస్తుందని విమర్శించారు. 2002లో ఢిల్లీలో మెట్రో ప్రారంభమైన సమయంలో కనీస ఛార్జీ రూ.4, గరిష్ట ఛార్జీ రూ.8గా ఉండేది. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10. మాగ్జిమమ్ ఛార్జీ రూ.60 వరకు పెంచారు. దీంతో తీవ్ర భారంగా భావిస్తున్న ప్రజలు ఎక్కేందుకు ఆసక్తి చూపడం లేదు. '' మెట్రో ధరల్లో భారీగా పెంపు, ఢిల్లీ మెట్రోను చంపేస్తుంది. ఒకవేళ దీన్ని వాడటం ప్రజలు తగ్గిస్తే, అప్పుడు అది ఏ ప్రయోజనాన్ని సర్వ్‌చేస్తుంది'' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ధరల పెంపు అనంతరం దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు తగ్గిపోయినట్టు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే కేవలం ధరల పెంపు మాత్రమే ప్రయాణికులను తగ్గించడం లేదని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) పేర్కొంది. ఏడాది వ్యాప్తంగా నెలవారీ మార్పులున్నాయని చెప్పింది. సెప్టెంబరులో రోజుకు సగటున 27.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. అక్టోబరులో ధరలు పెరిగిన తర్వాత ఈ సంఖ్య 24.2 లక్షలకు పడిపోయింది. ధరల పెంపును ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. -
‘ఓలా, ఊబర్ మేలు కోసమే’
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో చార్జీల పెంపుపై కేంద్రం, ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కార్ల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ ఆపరేటర్ల లబ్థి కోసమే చార్జీల పెంపు కుట్ర జరిగిందని ఆప్ ఆరోపించింది. ప్రజల సొమ్ముతో చేపట్టిన మెట్రోలో ప్రయాణీకులపై భారం మోపడం తగదని, ఓలా, ఊబర్లకు మేలు చేసేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించిందని విమర్శించింది. ఢిల్లీ మెట్రోను ప్రతిష్టాత్మక ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఆప్ సర్కార్‌ను అనుమతించడం లేదని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో చార్జీలు అధికంగా ఉంటే ప్రజలు క్యాబ్‌లవైపు మొగ్గుచూపుతారని ఫలితంగా ఢిలీల్లో కాలుష్య స్థాయిలు మితిమీరుతాయని అన్నారు. కాగా కేంద్రం అంగీకరిస్తే మెట్రోను తాము చేపడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తమ ఆస్తులు, వనరులను సమర్ధంగా వాడుకుంటే మరోసారి చార్జీలను పెంచాల్సిన అవసరం తలెత్తేది కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో చార్జీలను పెంచడం పట్ల ప్రయాణీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఆదాయం పెరిగినా నష్టాలే!
సాక్షి, హైదరాబాద్: జూలైలో జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా దాదాపు 30 లక్షల మంది భక్తుల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. అంతకుముందు నెల(జూన్)తో పోలిస్తే రూ.30 కోట్ల ఆదాయం పెరి గింది. కానీ, ఆర్టీసీ ఆర్థిక విభాగం లెక్కల ప్రకారం జూలైలో తెలంగాణ ఆర్టీసీకి సుమారు రూ.32 కోట్ల నష్టా లు వచ్చాయి. ఈ నివేదికను బుధవా రం జేఎండీ ముందుంచింది. ఇదీ కొత్త ఫిట్మెంట్ మహిమ. ప్రభుత్వం ప్రకటించిన 44 శాతం ఫిట్మెంట్ జూలై నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో రూ.21 కోట్లకుపైగా ఆర్టీసీపై అదనపు భారం పడింది. ఈ నేపథ్యంలో జేఎండీ రమణరావు గురువారం అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఖర్చుల నియంత్రణ, ఆదాయ పెంపుపై చర్చించనున్నారు. అందని ప్రభుత్వ సాయం బడ్జెట్ వేళ ఆర్టీసీకి ప్రతి ఏటా కొంతమొత్తం కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిట్మెంట్ ప్రకటన సమయంలో హామీ ఇచ్చారు. కానీ ఈలోపు కొంత సాయం అవసరమని, వేతనాల రూపంలో పెరిగిన భారాన్ని ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయాలని అధికారులు కోరారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అదనంగా నయాపైసా సాయం అందలేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఆర్టీసీకి రూ.110 కోట్ల నష్టం వాటిల్లింది. చార్జీల పెంపుపై దృష్టి? టీఎస్ఆర్టీసీలో చార్జీలు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. గతంలోనే 10 నుంచి 15 శాతం మేర పెం చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. నష్టాల్లో ఉన్నందున చార్జీలు పెంచక తప్పదని మరోసారి ప్రభుత్వాన్ని కోరేందుకు అధికారులు సిద్ధమయ్యారు. -
త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు
-
త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు
హైదరాబాద్: త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో మహేందర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆర్టీసీలో ఆస్తుల పంపిణీ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులు ఈ ప్రాంతానివే అని మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆంధ్ర నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందేని చెప్పారు. ఈ నెల 28 నుంచి ఆర్టీసీ రెండుగా విడిపోతున్నాయని మహేందర్‌రెడ్డి వివరించారు. -
పెరగనున్న మెట్రో చార్జీలు
⇒ ఎంఎఆర్డీఏ పిటిషన్ కొట్టివేత ⇒ చార్జీల పెంపునకు ఎంఎంఓపీఎల్‌కు అనుమతి ⇒ 31లోగా ఎఫ్ఎఫ్సీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం సాక్షి, ముంబై: ముంబై మెట్రో చార్జీలు పెరగనున్నాయి. మెట్రో చార్జీలను పెంచకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను బొంబాయి హైకోర్టు గురువారం కొట్టివేసింది. వర్సోవా-ఘాట్కోపర్ కారిడార్‌లో చార్జీల పెంపునకు ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్)కు అనుమతినిచ్చింది. దీంతో చార్జీల పెంపుకు మార్గం సుగుమమైంది. ప్రతిరోజు తమకు రూ.85 లక్షల మేరకు నష్టం వాటిల్లుతోందన్న ఎంఎంఓపీఎల్ వాదనను కోర్టు అంగీకరించింది. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మధ్యన 11.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గంలో ప్రతిరోజు సుమారు 2.65 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కోర్టు తీర్పుతో ప్రయాణికుల జేబుపై మరింత ఆర్థికబారం పడనుంది. మెట్రో రైలు టిక్కెట్ ధరలు ప్రస్తుతం రూ. 10, రూ. 15, రూ. 20గా వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలను పెంచాలని మెట్రో ప్రాజెక్టులో భాగస్వామ్య పక్షమైన రిలయన్స్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చార్జీలు రూ. 10, రూ. 20, రూ. 30, రూ. 40 గా పెరగనున్నాయి. చార్జీలు పెంచాలన్న రిలయన్స్ ఇన్ఫ్రా ప్రతిపాదనలను మెట్రో ప్రాజెక్టులో మరో భాగస్వామ్యపక్షమైన ఎంఎంఆర్డీఏ కోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా, జస్టిస్ బీపీ కొలాబావాలాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వానికి చార్జీలు నిర్ణయించే అధికారం లేదన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునేంతవరకు స్టే మంజూరు చేయాలన్న ఎంఎంఆర్డీ న్యాయవాది అస్పీ చినాయ్ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 31వ తేదీలోగా చార్జీల స్థిరీకరణ కమిటీ (ఎఫ్ఎఫ్సీ) ని ఏర్పాటు చేయాలని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లో ఎఫ్ఎఫ్సీ చార్జీలను స్థిరీకరిస్తుందని పేర్కొంది. ఎఫ్ఎఫ్సీని ఏర్పాటు చేయాలని కోర్టు ఇంతకుముందు కేంద్రానికి గత ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు గడువు విధించింది. ఆ తరువాత డిసెంబర్ 31 వరకూ గడువును పొడిగించింది. జనవరి 31 వరకూ గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని కోర్టు క్రితంసారి విచారణ సందర్భంగా తిరస్కరించింది. అయితే ఈసారి ఎఫ్ఎఫ్సీని ఏర్పాటు చేసేందుకు ఈ నెల 31 వరకూ గడువు విధించి, మూడు నెలల్లోగా చార్జీలను నిర్ణయించాలని ఆదేశించింది. ప్రస్తుతం సేవలందిస్తున్న ముంబై మెట్రో మొదటి దశ మార్గంలో ప్రతిరోజు 4.1 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేశారని, కానీ 2.65 లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారని రిలయన్స్ తరఫు న్యాయవాది జనక్ ద్వారకాదాస్ చెప్పారు. దీంతో ప్రతిరోజు రూ.85 లక్షల మేరకు నష్టం వస్తోందని తెలిపారు. దినపై ప్రభుత్వ న్యాయవాది చినాయ్ స్పందిస్తూ ఢిల్లీ, హైదరాబాద్‌లో మెట్రో చార్జీలు ముంబై కన్నా తక్కువ ఉన్నాయని చెప్పారు. విద్యుత్ చార్జీలు ముంబైలో అధికంగా ఉన్నాయని ద్వారకాదాస్ కౌంటర్ ఇచ్చారు. హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ స్పందిస్తూ తాము ప్రజల పక్షాన ఉన్నామని చెప్పారు. అవసరమైతే ఈ తీర్పుపై అప్పీలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నామని, తమ న్యాయవాది ప్రభుత్వ వైఖరిని కోర్టు ముందు సరైన రీతిలో ఉంచారో లేదో పరిశీలిస్తున్నామని అన్నారు. -
పెరగనున్న మెట్రో చార్జీలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తున్న మెట్రోరైలు ప్రయాణం సామాన్యుడికి భారం కానుంది. మెట్రో చార్జీలు శుక్రవారం నుంచి వివిధ మార్గాల్లో రూ.10 -40 మధ్య పెరగనున్నాయి. మెట్రో నిర్వహణ పనులు చేపడుతున్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చెందిన ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్)కి వర్సోవా-అంధేరీ-గట్కోపర్ మార్గాల్లో ధరలని పెంచుకునే వెసులుబాటును ముంబై హైకోర్టు ఇచ్చింది. మెట్రో చార్జీల పెంపుపై స్టే విధించాలంటూ ఎంఎంఆర్డీఏ చేసిన విజ్ఞప్తిని ఇంతకుముందు సింగిల్ జడ్జి కొట్టేశారు. అయితే.. ఆ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ బర్గెస్ కొలాబావాలతో కూడిన డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. దాంతో రేట్ల పెంపునకు మార్గం సుగమమైంది. అయితే.. ధరల విషయాన్ని నిర్ణయించేందుకు మూడు నెలల్లోగా మెట్రో ఫేర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటుచేయాలని కూడా కోర్టు ఆదేశించింది. -
మెట్రో చార్జీల కమిటీని ఏర్పాటు చేయరేం?
సాక్షి, ముంబై: వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మధ్య నడుస్తున్న మెట్రో చార్జీలు నిశ్చయించేందుకు కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో కేంద్రంపై బాంబే ైెహ కోర్టు మండిపడింది. కోర్టు చార్జీలు నిర్ణయించేందుకు కేంద్రానికి ఇప్పటికే రెండు సార్లు గడువు ఇచ్చింది. అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమేగాకుండా 2015 జనవరి ఆఖరు వరకు మరోసారి గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కేంద్రం వైఖరిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఇంతవరకు కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో రిలయన్స్ సూచించిన చార్జీల పెంపు ప్రతిపాదనకు మంజూరు ఇవ్వాలా..? వద్దా..? అనే దానిపై ఆయోమయ పరిస్ధితి నెలకొంది. తీర్పు ఇచ్చేందుకు కోర్టు జనవరి ఏడో తేదీ నిర్ణయించింది. చార్జీలను జనవరి ఎనిమిదో తేదీ వరకు ఇప్పుడెలా ఉన్నాయో అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా చార్జీలు నిర్ణయించేందుకు హై కోర్టుకు చెందిన ఏక సభ్య కమిటీ రిలయన్స్‌కు అనుకూలంగా తీర్పు నిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెమ్మార్డీయే పరిపాలన విభాగం అపీల్ చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా, న్యాయమూర్తి బి.పి.కులాబావాలా ల ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా మెట్రో చార్జీలు నిశ్చయించేందుకు కమిటీ ఏర్పాటు చేసేందుకు జనవరి 31 వరకు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కాని కమిటీ ఏర్పాటుచేయాలని గత జూలై నుంచి తరుచూ హెచ్చరిస్తున్నప్పటికీ కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని రిలయన్స్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కోర్టు నవంబర్ 30లోపు కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి తుది గడువు ఇచ్చింది. అప్పటిలోగా కేంద్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోతే రిలయన్స్ సూచించిన చార్జీల పెంపు ప్రతిపాదనను పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయినా కేంద్రం స్పందనలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికే మెట్రో చార్జీలు స్వల్పంగా ఉండడంవల్ల రిలయన్స్‌కు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీనికి తోడు చార్జీలు నిర్ణయించే కమిటీ ఏర్పాటు చేయడంలో మరింత జాప్యం జరుగుతోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్టు కేంద్రాన్ని, ఇటు ఎమ్మెమ్మార్డీయేని గట్టిగా మందలించింది. మెట్రో చార్జీల పెంపు విషయమై కేంద్రం కమిటీని ఏర్పాటుచేయని పక్షంలో జనవరి ఏడో తేదీన రిలయన్స్ సమర్పించిన చార్జీల పెంపు ప్రతిపాదనపై విచారణ జరిపి ఎనిమిదో తేదీ నుంచి కొత్త చార్జీలు అమలుచేయాల్సి వస్తుందని హెచ్చరించింది. -
ఊరు వెళ్లాలంటే .... నడ్డి విరిగినట్లే
హైదరాబాద్: దసరా పండగ, బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని వరస సెలవులు రావడంతో ప్రజలంతా తమ తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. అదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికుల నుంచి అయిన కాడికి దండుకుంటుంది. దీంతో ప్రయాణికులు జేబులు గుల్ల అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ఒక్కో ప్రయాణీకుడి నుంచి రూ. 3500 వసూల్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి రూ. 2500 వసూల్ చేస్తున్నారు. పండగ సమయాల్లో ప్రభుత్వం అదనపు బస్సులు, పలు అదనపు రైలు సర్వీసులు ఏర్పాటు చేసిన వాటిలో కూడా ప్రజలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. అదికాక ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన అసలు టికెట్ మీద ప్రత్యేక ఛార్జీ పేరుతో అధిక మొత్తంలో వసూల్ చేస్తుంది. అలాగే రైళ్లు కూడా తత్కాల్ పేరిట ఇప్పుడు వరకు ఉన్న ఛార్జీల బాధుడు చాలదన్నట్లు... ప్రీమియం తత్కాల్ పేరిట ప్రయాణీకులపై మరింత భారాన్ని మోపాయి. దీంతో సామన్యా ప్రయాణికుడు పండగ సమయంలో ప్రయాణం పెట్టుకుంటే దూల తీరిపోతుంది. ఛార్జీలను కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుండటంతో ప్రజలు తమ ఖర్మ అని సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రయాణం మరింత భారం
సాక్షి, ముంబై: ముంబై నుంచి పుణే వరకు శివ నేరి వోల్వో బస్సుల్లో రాకపోకలు సాగించేవారికి ఇకనుంచి ప్రయాణం మరింత భారం కానుంది. శీతల బస్సుల చార్జీలను ఎంఎస్ఆర్టీసీ 2.54 శాతం మేర పెంచింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే పెరిగిన చార్జీల భారం మోయలేక సతమతమవుతున్న నగరవాసుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. పెంచిన చార్జీలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ముంబై నుంచి పుణే వరకు ప్రయాణ చార్జీని రూ.15 మేర పెంచారు. దీంతో దాదర్-పుణే ఏసీ బస్సు టికెట్ చార్జీ రూ.390 నుంచి 405కు చేరుకుంది. అదేవిధంగా బోరివలి-పుణే ఏసీ బస్సు చార్జీని రూ.465 నుంచి 480కి పెంచారు. ఇంధన ధరలు తరచూ మారుతున్న కారణంగా శివనేరి ఏసీ బస్సులతోపాటు సాధారణ, సెమీ లగ్జరీ బస్సుల చార్జీలను పెంచాల్సిన పరిస్థితి తలెత్తిందని ఎమ్మెస్సార్టీసీ ప్రజాసంబంధాల అధికారి ముకుంద్ వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ప్రయాణం కోసం ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న వారు కూడా ప్రయాణ సమయంలోనే ఈ పెరిగిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. -
భారీగా ఆర్టీసీ చార్జీల పెంపు
* నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి.. ప్రజలపై 600 కోట్ల మోత * కి.మీ.కి 4 -20 పైసల వరకు పెంపు * 9.5% వరకూ పెరిగిన టికెట్ల ధరలు * పల్లె వెలుగు బస్సులనూ వదల్లేదు * కనీస చార్జీలు యథాతథం.. రెండో స్టేజీ ప్రయాణానికి భారీగా వడ్డన * బస్‌పాస్‌ల ధరలూ పెంపు.. * నాలుగేళ్లలో 60% పెరిగిన చార్జీలు సాక్షి, హైదరాబాద్: సామాన్యుడి జేబుకు ప్రభుత్వం మళ్లీ చిల్లు పెట్టింది. ఇప్పటికే ధరల పెరుగుదలతో నడ్డి విరిగిన సగటు జీవిపై ఆర్టీసీ బస్సు చార్జీల మోత మోగించింది. అన్నిరకాల బస్సు సర్వీసుల్లో కలిపి సగటున 9.5 శాతం మేర టికెట్ల ధరలు పెంచేసింది. పేదలకు దిక్కయిన పల్లె వెలుగు దగ్గరి నుంచి లగ్జరీ బస్సుల దాకా భారీగా వడ్డించింది. కనీస చార్జీని పెంచలేదంటూనే.. దొడ్డిదారిన దోచుకోవడానికి రంగం సిద్ధం చేసింది. పెంచిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో ఇటీవలి ఉద్యమాల కారణంగా ఏర్పడ్డ నష్టాన్ని పూడ్చుకునేందుకు చార్జీలను పెంచాలన్న ఆర్టీసీ ప్రతిపాదనలకు ప్రభుత్వం సోమవారం పచ్చజెండా ఊపింది. ఆర్టీసీ ప్రతిపాదించిన స్థాయిలోనే పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో ప్రజలపై ఏటా రూ. 600 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. అయితే, నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించడానికి ఎన్నో మార్గాలుండగా.. కిరణ్ ప్రభుత్వం చార్జీలు పెంచడానికే నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ నుంచి వసూలు చేస్తున్న పన్నులను మాఫీ చేయడం ద్వారానో, తాత్కాలిక విరామం ప్రకటించటం ద్వారా నో.. ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన ప్రభుత్వం.. ప్రజల నెత్తిన భారం వేయడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెంపు ఇలా.. ప్రతి కిలోమీటరు దూరానికి పల్లె వెలుగు బస్సుల్లో 4 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లో 7, డీలక్స్‌లో 9, సూపర్ లగ్జరీ బస్సుల్లో 11, ఇంద్రలో 12, గరుడపై 20, గరుడ ప్లస్ బస్సుల్లో 15 పైసల చొప్పున పెంచారు. ఫలితంగా పల్లె వె లుగు బస్సుల్లో ప్రతి కిలోమీటరు ప్రయాణానికి 55 పైసల నుంచి 59 పైసలకు, ఎక్స్‌ప్రెస్‌లో 72 పైసల నుంచి 79 పైసలకు, డీలక్స్‌లో 80 పైసల నుంచి 89 పైసలకు, సూపర్ లగ్జరీలో 94 పైసల నుంచి రూ. 1.05కు, ఇంద్రలో రూ. 1.20 నుంచి రూ.1.32కు, గరుడలో రూ. 1.40 నుంచి రూ. 1.60కు, గరుడ ప్లస్‌లో రూ. 1.50 నుంచి రూ. 1.65కు టికెట్ల ధరలు పెరిగాయి. అత్యంత విలాసవంతమైన వెన్నెల బస్సు చార్జీలను మాత్రం కిలోమీటరుకు రూ. 2.30 గానే ఉంచడం గమనార్హం. కనీస చార్జీ జోలికి వెళ్లకుండా ప్రభుత్వం పేదలపై కొంత కనికరం చూపింది. ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగాకనీస చార్జీ పల్లె వెలుగు బస్సుల్లో రూ. 5, ఎక్స్ప్రెస్ల్లో రూ. 10, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ. 15, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో రూ. 25, వెన్నెల బస్సుల్లో రూ. 50 యధావిధిగా కొనసాగుతాయి. వైఎస్ మరణం తర్వాత ఏటా వడ్డింపే.. ప్రజలపై భారం మోపకుండా పాలన సాగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏటా చార్జీలు పెంచుతూపోతోంది. గత నాలుగేళ్లలో ఇప్పటికే నాలుగు సార్లు బస్సుల చార్జీల మోత మోగించిన సర్కారు.. తాజాగా ఐదోసారీ వాత పెట్టింది. తాజా పెంపుతో ఈ నాలుగేళ్లలో ఏకంగా 60 శాతం మేర టికెట్ ధరలు పెరగడం గమనార్హం కనీస చార్జి జోలికి వెళ్లలేదంటూనే.. తాజా చార్జీల సవరణలో కనీస టికెట్ చార్జీ జోలికి వెళ్లలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కానీ పల్లె వెలుగు నుంచి వెన్నెల సర్వీసు వరకూ కనీస చార్జీ తర్వాత ఉండే రెండో అంచె టికెట్ ధరను భారీగా పెంచటం ద్వారా సగటు ప్రయాణికుడిని దొంగదెబ్బ తీసింది. పేదల బస్సు పల్లె వెలుగునే ఉదాహరణగా తీసుకుంటే.. దాని కనీస చార్జీ రూ.5ను అలాగే ఉంచి... రెండో అంచె టికెట్ ధరను రూ. 6 నుంచి రూ. 7కు పెంచారు. ఈ లెక్కన కనీస చార్జీకి, రెండో అంచెకు మధ్య రూ. 2 వ్యత్యాసం వస్తోంది. 35 కిలోమీటర్లలోపు దూరానికి ప్రతీ అంచెకు రూ. 1 చొప్పున.. ఆపై ప్రతీ అంచెకు రూ. 2 చొప్పున టికెట్ల ధరలు పెంచారు. ఇలా వెన్నెల మినహా.. అన్ని రకాల సర్వీసుల్లో రెండో అంచె చార్జీల్లో భారీగా వడ్డించారు. మొత్తంగా అన్ని తరగతుల ప్రయాణికుల నుంచి భారీగా పిండుకోవటమే లక్ష్యంగా ఈ పెంపు విధానం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజూ 1.40 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వారిలో గ్రామీణ ప్రాంత సర్వీసుల్లో తిరిగే వారి సంఖ్యే ఎక్కువ. పల్లె వెలుగు, సిటీ బస్సుల్లోనే సగటున 75 లక్షల మంది ప్రయాణిస్తారు. తాజా పెంపు వీరిపై ఎక్కువ ప్రభావం చూపబోతోంది. ఇక సిటీబస్సుల్లో 14 కిలోమీటర్ల వరకు రూ. 1, ఆ తర్వాత దూరం ప్రయాణానికి రూ. 2 చొప్పున పెంచారు. ఇక ఈ పెంపుతో ఏర్పడిన రూపాయిలోపు చిల్లర వ్యత్యాసాన్ని సరిచేసేందుకు టికెట్ల ధరలను.. రూపాయల్లోకి సవరిస్తారు. ఉద్యమాల నష్టాన్ని పూడ్చుకొనేందుకే! రాష్ట్రంలో ఇటీవలి ఉద్యమాల ఫలితంగా ఆర్టీసీకి దాదాపు రూ. 800 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దానిని భర్తీ చేసుకొనేందుకు చార్జీలు పెంచక తప్పదని ప్రతిపాదించారు. అయితే, ఆ నష్టాన్ని భర్తీ చేసుకుని ఆర్టీసీని బయటపడేసేందుకు చార్జీలు పెంచాల్సిన అవసరం లేదని, మరెన్నో మార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం డీజిల్, విడిభాగాల కొనుగోలుపై ఆర్టీసీ వ్యాట్ రూపంలో ఏటా దాదాపు రూ. 700 కోట్లు చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని రీయింబర్స్ చేయటం ద్వారా ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవచ్చు. దాంతోపాటు మోటారు వాహనాల పన్ను రూపంలో ఆర్టీసీ మరో రూ. 450 కోట్లను చెల్లిస్తోంది. ఆర్టీసీ నష్టాలను పరిగణనలోకి తీసుకున్న నాటి సీఎం వైఎస్ 12 శాతంగా ఉన్న ఆ పన్నును 7 శాతానికి తగ్గించారు. అదే తరహాలో ఆ పన్నును మరికొంత తగ్గించటం ద్వారానో, ఒకటి రెండేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారానో ఆర్టీసీని ఆదుకోవచ్చు. ఇక బస్‌పాస్‌ల రూపంలో ఇచ్చే రాయితీని రీయింబర్స్ చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకొంటున్నా... అందులో ఏయేటికాయేడు ఎగనామం పెడుతూనే ఉంది. ఫలితంగా ఇప్పటికే రూ. 1,000 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించటం ద్వారా కూడా ఆర్టీసీకి చేయూతనిచ్చేందుకు అవకాశముంది. కానీ, కిరణ్ ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ గాలికి వదిలేసి, ప్రజల నడ్డి విరిచేందుకే సిద్ధమైంది. బస్‌పాస్‌ల ధరలూ భగ్గు.. అన్ని రకాల బస్సు చార్జీలతో పాటు బస్సు పాస్‌ల ధరలనూ భారీగా పెంచారు. ఒక్క విద్యార్థులు మినహా మిగతా కేటగిరీలకు చెందిన అన్ని రకాల పాస్‌ల ధరలను సవరించారు. ఎన్జీవో పాస్‌లపైనా వడ్డించారు. సాధారణ ప్రయాణికులకు సంబంధించి... సిటీ ఆర్డినరీ పాస్ ధరను రూ. 650 నుంచి రూ. 700కు, మెట్రో పాస్ రూ. 750 నుంచి రూ. 800కు, మెట్రో డీలక్స్ పాస్ రూ. 850 నుంచి రూ. 900కు, సిటీ శీతల్ పాస్ రూ.1,600 నుంచి రూ. 1,750కి, ఎయిర్‌పోర్టు మెట్రో బస్సు పాస్ ధరను రూ. 950 నుంచి రూ. 1,050కి పెంచింది. అలాగే ఎన్జీవోలకు సంబంధించి.. ఆర్డినరీ పాస్ ధరను రూ. 220 నుంచి రూ. 235కు, మెట్రో పాస్ ధరను రూ. 320 నుంచి రూ. 335కు, మెట్రో డీలక్స్ పాస్‌ను రూ. 420 నుంచి రూ. 435కు, ఎంఎంటీఎస్-ఆర్టీసీ కాంబో పాస్ ధరను రూ. 700 నుంచి రూ. 800కు, ఆర్డినరీ టూ మెట్రో కాంబినేషన్ టికెట్ ధరను రూ. 7 నుంచి రూ. 10కు పెంచారు. చార్జీలు పెంచొద్దు.. ఆర్టీసీకి సబ్సిడీ ఇవ్వాలి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపును వామపక్షాలు, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతమవుతోంటే మళ్లీ ఈ పెంపు ఏమిటని సోమవారం వేర్వేరు ప్రకటనల్లో ప్రశ్నించాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న మాట నిజమే అయినా దానికి చార్జీల పెంపు ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డాయి. సిటీ బస్సుల నుంచి ఏసీ బస్సులదాకా అన్ని సర్వీసుల చార్జీలు పెంచి ప్రభుత్వం పేదల నడ్డివిరిచిందని మండిపడ్డాయి. ఆర్టీసీకి సబ్సిడీ ఇచ్చి నష్టాల నుంచి గట్టెక్కించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చార్జీల పెంపు వల్ల ప్రజలపై ఏటా రూ. 600 కోట్లు భారం పడుతుందని, అదే ప్రైవేటు బస్సుల్ని నియంత్రిస్తే ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని నారాయణ వివరించారు. కాగా, ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలెందుకు భారాన్ని మోయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఈ పెంపును తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ అసమర్థత వల్లే చార్జీలు పెంచాల్సి వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.