
ఊరు వెళ్లాలంటే .... నడ్డి విరిగినట్లే
హైదరాబాద్: దసరా పండగ, బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని వరస సెలవులు రావడంతో ప్రజలంతా తమ తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. అదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికుల నుంచి అయిన కాడికి దండుకుంటుంది. దీంతో ప్రయాణికులు జేబులు గుల్ల అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ఒక్కో ప్రయాణీకుడి నుంచి రూ. 3500 వసూల్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి రూ. 2500 వసూల్ చేస్తున్నారు. పండగ సమయాల్లో ప్రభుత్వం అదనపు బస్సులు, పలు అదనపు రైలు సర్వీసులు ఏర్పాటు చేసిన వాటిలో కూడా ప్రజలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు.
అదికాక ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన అసలు టికెట్ మీద ప్రత్యేక ఛార్జీ పేరుతో అధిక మొత్తంలో వసూల్ చేస్తుంది. అలాగే రైళ్లు కూడా తత్కాల్ పేరిట ఇప్పుడు వరకు ఉన్న ఛార్జీల బాధుడు చాలదన్నట్లు... ప్రీమియం తత్కాల్ పేరిట ప్రయాణీకులపై మరింత భారాన్ని మోపాయి. దీంతో సామన్యా ప్రయాణికుడు పండగ సమయంలో ప్రయాణం పెట్టుకుంటే దూల తీరిపోతుంది. ఛార్జీలను కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుండటంతో ప్రజలు తమ ఖర్మ అని సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.