పెరగనున్న మెట్రో చార్జీలు | Mumbai Metro fare to increase, Bombay high court gives green signal to R-Infra | Sakshi
Sakshi News home page

పెరగనున్న మెట్రో చార్జీలు

Published Thu, Jan 8 2015 10:06 PM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

పెరగనున్న మెట్రో చార్జీలు

పెరగనున్న మెట్రో చార్జీలు

ఎంఎఆర్‌డీఏ పిటిషన్ కొట్టివేత
చార్జీల పెంపునకు ఎంఎంఓపీఎల్‌కు అనుమతి
31లోగా ఎఫ్‌ఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం


సాక్షి, ముంబై: ముంబై మెట్రో చార్జీలు పెరగనున్నాయి. మెట్రో చార్జీలను పెంచకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను బొంబాయి హైకోర్టు గురువారం కొట్టివేసింది. వర్సోవా-ఘాట్కోపర్ కారిడార్‌లో చార్జీల పెంపునకు ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్)కు అనుమతినిచ్చింది. దీంతో చార్జీల పెంపుకు మార్గం సుగుమమైంది. ప్రతిరోజు తమకు రూ.85 లక్షల మేరకు నష్టం వాటిల్లుతోందన్న ఎంఎంఓపీఎల్ వాదనను కోర్టు అంగీకరించింది. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మధ్యన 11.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గంలో ప్రతిరోజు సుమారు 2.65 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కోర్టు తీర్పుతో ప్రయాణికుల జేబుపై మరింత ఆర్థికబారం పడనుంది.  
 
 మెట్రో రైలు టిక్కెట్ ధరలు ప్రస్తుతం రూ. 10, రూ. 15, రూ. 20గా వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలను పెంచాలని మెట్రో ప్రాజెక్టులో భాగస్వామ్య పక్షమైన రిలయన్స్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చార్జీలు రూ. 10, రూ. 20, రూ. 30, రూ. 40 గా పెరగనున్నాయి. చార్జీలు పెంచాలన్న రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రతిపాదనలను మెట్రో ప్రాజెక్టులో మరో భాగస్వామ్యపక్షమైన ఎంఎంఆర్‌డీఏ కోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా, జస్టిస్ బీపీ కొలాబావాలాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది.
 
 ప్రభుత్వానికి చార్జీలు నిర్ణయించే అధికారం లేదన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునేంతవరకు స్టే మంజూరు చేయాలన్న ఎంఎంఆర్‌డీ న్యాయవాది అస్పీ చినాయ్ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 31వ తేదీలోగా చార్జీల స్థిరీకరణ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ) ని ఏర్పాటు చేయాలని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లో ఎఫ్‌ఎఫ్‌సీ చార్జీలను స్థిరీకరిస్తుందని పేర్కొంది. ఎఫ్‌ఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని కోర్టు ఇంతకుముందు కేంద్రానికి గత ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు గడువు విధించింది. ఆ తరువాత డిసెంబర్ 31 వరకూ గడువును పొడిగించింది.
 
 జనవరి 31 వరకూ గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని కోర్టు క్రితంసారి విచారణ సందర్భంగా తిరస్కరించింది. అయితే ఈసారి ఎఫ్‌ఎఫ్‌సీని ఏర్పాటు చేసేందుకు ఈ నెల 31 వరకూ గడువు విధించి, మూడు నెలల్లోగా చార్జీలను నిర్ణయించాలని ఆదేశించింది. ప్రస్తుతం సేవలందిస్తున్న ముంబై మెట్రో మొదటి దశ మార్గంలో ప్రతిరోజు 4.1 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేశారని, కానీ 2.65 లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారని రిలయన్స్ తరఫు న్యాయవాది జనక్ ద్వారకాదాస్ చెప్పారు. దీంతో ప్రతిరోజు రూ.85 లక్షల మేరకు నష్టం వస్తోందని తెలిపారు.
 
 దినపై ప్రభుత్వ న్యాయవాది చినాయ్ స్పందిస్తూ ఢిల్లీ, హైదరాబాద్‌లో మెట్రో చార్జీలు ముంబై కన్నా తక్కువ ఉన్నాయని చెప్పారు. విద్యుత్ చార్జీలు ముంబైలో అధికంగా ఉన్నాయని ద్వారకాదాస్ కౌంటర్ ఇచ్చారు. హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ స్పందిస్తూ తాము ప్రజల పక్షాన ఉన్నామని చెప్పారు. అవసరమైతే ఈ తీర్పుపై అప్పీలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నామని, తమ న్యాయవాది ప్రభుత్వ వైఖరిని కోర్టు ముందు సరైన రీతిలో ఉంచారో లేదో పరిశీలిస్తున్నామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement