రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబర్ కస్టమర్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతంలో క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్ల ఫోన్‌లో ఛార్జింగ్ తక్కువ ఉంటే వారి నుంచి ఎక్కువ ఛార్జీ విధిస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
అయితే, ఈ అదనపు ఛార్జీల బాదుడు సెగ కస్టమర్లకే కాదు ఉబర్ సీఈవో ఖోస్రోషాహికి తగలింది. ఎలా అంటారా? మ్యాగజైన్ సంస్థ వైర్డ్ ఎడిటర్ స్టీవెన్ లెవీ ఉబర్ సీఈవోని ఇంటర్వ్యూ చేసేందుకు ఉబర్ క్యాబ్‌నే బుక్ చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం న్యూయార్క్‌లోని డౌన్‌టౌన్ సిటీ నుంచి నాలుగున్న కిలోమీటర్ల దూరంలో వెస్ట్‌సైడ్ ఉబర్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడే 2.95 మైళ్ల ఉబెర్ రైడ్ ఛార్జీ ఎంత అయ్యింటుందో చెప్పాలని స్టీవెన్ లెవీ.. ఖోస్రాషాహిని అడిగారు. అందుకు ఉబర్ సీఈవో ఇరవై డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా డ్రైవర్ టిప్‌తో కలిపి ఉబర్ రైడ్‌కి 51.69 డాలర్లు ఛార్జీ పడిందని అన్నారు.
వైర్డ్ ఎడిటర్ ఊహించని దానికంటే ఎక్కువ చెల్లించడంపై ఉబర్ సీఈవో సైతం షాక్ తిన్నారు. ‘ఓ మై గాడ్’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఐదు నిమిషాల ముందు 20 డాలర్ల కంటే ఎక్కువగా ఉందని జర్నలిస్ట్ సీఈవోకి చెప్పారు. అంతేకాదు ఉబర్ రైడ్‌లో ఈ ధరల వ్యత్యాసం గురించి ప్రశ్నించారు. బదులుగా ఖోస్రోషాహి ద్రవ్యోల్బణం, రైడ్ సమయం పెరిగిపోతున్న కొద్ది ఛార్జీల విధింపు, కార్మికుల చెల్లించే వేతనాలే కారణమని తెలిపారు.
ఇలా భారీగా ఉన్న ఉబర్ క్యాబ్ ధరలపై జర్నలిస్ట్ ఖోస్రోషాహిని ప్రశ్నించడం, సంభాషణల మధ్యలో ఉబర్ విధిస్తున్న ఛార్జీల్ని సీఈవో సమర్ధించడం.. అందుకు జర్నలిస్ట్ వ్యతిరేకించడం వంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చాకు దారి తీశాయి. దీంతో పలువురు నెటిజన్లు ఉబర్ క్యాబ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఉబర్ సీఈవో సమాధానం చెప్పలేకపోయారు. తిక్క కుదిరింది అంటూ సమర్ధిస్తున్నారు.
కాగా, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..అమెరికాలో ఉబర్ ధరలు 2018 నుండి 2022 వరకు ద్రవ్యోల్బణం రేటు కంటే నాలుగు రెట్లు పెరిగాయని, దాదాపు నాలుగు సంవత్సరాలలో మొత్తం 83శాతం ధరలు పెరిగాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment