cab aggregators
-
‘ఉబర్ సీఈవో తిక్క కుదిరింది’
రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబర్ కస్టమర్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతంలో క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్ల ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంటే వారి నుంచి ఎక్కువ ఛార్జీ విధిస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అదనపు ఛార్జీల బాదుడు సెగ కస్టమర్లకే కాదు ఉబర్ సీఈవో ఖోస్రోషాహికి తగలింది. ఎలా అంటారా? మ్యాగజైన్ సంస్థ వైర్డ్ ఎడిటర్ స్టీవెన్ లెవీ ఉబర్ సీఈవోని ఇంటర్వ్యూ చేసేందుకు ఉబర్ క్యాబ్‌నే బుక్ చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం న్యూయార్క్‌లోని డౌన్‌టౌన్ సిటీ నుంచి నాలుగున్న కిలోమీటర్ల దూరంలో వెస్ట్‌సైడ్ ఉబర్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడే 2.95 మైళ్ల ఉబెర్ రైడ్ ఛార్జీ ఎంత అయ్యింటుందో చెప్పాలని స్టీవెన్ లెవీ.. ఖోస్రాషాహిని అడిగారు. అందుకు ఉబర్ సీఈవో ఇరవై డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా డ్రైవర్ టిప్‌తో కలిపి ఉబర్ రైడ్‌కి 51.69 డాలర్లు ఛార్జీ పడిందని అన్నారు. వైర్డ్ ఎడిటర్ ఊహించని దానికంటే ఎక్కువ చెల్లించడంపై ఉబర్ సీఈవో సైతం షాక్ తిన్నారు. ‘ఓ మై గాడ్’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఐదు నిమిషాల ముందు 20 డాలర్ల కంటే ఎక్కువగా ఉందని జర్నలిస్ట్ సీఈవోకి చెప్పారు. అంతేకాదు ఉబర్ రైడ్‌లో ఈ ధరల వ్యత్యాసం గురించి ప్రశ్నించారు. బదులుగా ఖోస్రోషాహి ద్రవ్యోల్బణం, రైడ్ సమయం పెరిగిపోతున్న కొద్ది ఛార్జీల విధింపు, కార్మికుల చెల్లించే వేతనాలే కారణమని తెలిపారు. ఇలా భారీగా ఉన్న ఉబర్ క్యాబ్ ధరలపై జర్నలిస్ట్ ఖోస్రోషాహిని ప్రశ్నించడం, సంభాషణల మధ్యలో ఉబర్ విధిస్తున్న ఛార్జీల్ని సీఈవో సమర్ధించడం.. అందుకు జర్నలిస్ట్ వ్యతిరేకించడం వంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చాకు దారి తీశాయి. దీంతో పలువురు నెటిజన్లు ఉబర్ క్యాబ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఉబర్ సీఈవో సమాధానం చెప్పలేకపోయారు. తిక్క కుదిరింది అంటూ సమర్ధిస్తున్నారు. కాగా, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..అమెరికాలో ఉబర్ ధరలు 2018 నుండి 2022 వరకు ద్రవ్యోల్బణం రేటు కంటే నాలుగు రెట్లు పెరిగాయని, దాదాపు నాలుగు సంవత్సరాలలో మొత్తం 83శాతం ధరలు పెరిగాయని వెల్లడించింది. -
క్యాబ్ సంస్థలపై కొరడా : దిగిరానున్న చార్జీలు
సాక్షి,న్యూఢిల్లీ: ఓలా ఉబెర్ సహా,ఇతర క్యాబ్ సేవల సంస్థలను నియంత్రించేలా వీటిని మోటారు వాహనాల (సవరణ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. క్యాబ్‌ల నిర్వాహక సంస్థలను చట్టం పరిధిలోకి తీసుకొస్తుంది. కాలుష్య నియంత్రణ,వారి వ్యాపారంలో పారదర్శకత, తదితర ప్రయోజనాల కోసం రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020 మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. దీంతో క్యాబ్ సేవలు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. సర్జ్ చార్జ్ వాయింపులకు చెక్, ఇతర నిబంధనలు నవంబర్ 27, శుక్రవారం జారీ చేసిన 26 పేజీల మోటారు వాహన అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌లో ఈ నిబంధనలు రూపొందించింది. ప్రభుత్వం ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్లు బాదేస్తున్న సర్జ్‌చార్జీలకు కేంద్రం చెక్ చెప్పింది. అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో 1.5 రెట్లు బేస్ ఛార్జీలకు కోత పెట్టింది. అలాగే అవి అందించే డిస్కౌంట్‌ను బేస్ ఛార్జీలలో 50 శాతానికి పరిమితం చేసింది. స్థానిక ప్రభుత్వం నిర్ణయించని రాష్ట్రాల్లో, బేస్ ఛార్జీ రూ .25/30గా ఉండాలి. అగ్రిగేటర్లతో అనుసంధానమైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని అవలంబించాలి.. అయితే బేస్ ఛార్జీలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. వెబ్సైట్ లేదా యాప్‌లో అగ్రిగేటర్ నిర్దేశించిన విధంగా చెల్లుబాటు అయ్యే సరైన కారణంగా లేకుండా రైడ్‌ను రద్దు చేసినట్లయితే, మొత్తం ఛార్జీలో 10శాతం పెనాల్టీ ఇద్దరికీ వరిస్తుంది. ఇది 100 రూపాయలకు మించకూడదు. కరోనావైరస్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న డ్రైవర్లను ఆదుకునేలా ప్రతీ రైడ్ ద్వారా సంపాదించిన ఆదాయంలో కనీసం 80 శాతం వారికి అందాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు డ్రైవర్లకు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందించాలి. రూ .10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ మొత్తం ప్రతీ సంవత్సరం 5 శాతం పెంచాలి. డ్రైవర్లు కూడా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఏ డ్రైవర్ కూడా12 గంటలకు మించి పనిచేయడానికి లేదు. తర్వాత 10 గంటల విరామం తప్పనిసరి. ఒకటి కంటే ఎక్కువ కంపెనీలలో పనిచేసే డ్రైవర్లు 12 గంటల పనిదినం నిబంధనను ఉల్లఘించకుండా అగ్రిగేటర్లు చూసుకోవాలి. వారి భద్రత, ప్రయాణీకుల భద్రతకు ఈ పనిగంటలను పర్యవేక్షించేందుకు ఆయా యాప్‌లలో ఒక యంత్రాంగాన్ని తీసుకురావాలని కోరింది. యాప్ ఆధారిత మొబిలిటీ సేవలను అందిస్తున్న సంస్థలు జవాబుదారీతనం వహించేలా చట్టానికి సవరణలు చేసింది. ముఖ్యంగా ‘అగ్రిగేటర్’ అనే పదం నిర్వచనాన్ని చేర్చేందుకు మోటారు వాహనాల చట్టం,1988ను మోటారు వాహనాల సవరణ చట్టం, 2019 ద్వారా సవరించామని రహదారి మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం వీరిని సెంటర్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో తమ ప్రాధమిక లక్ష్యం షేర్డ్ మొబిలిటీ సంస్థల సేవలను నియంత్రించడంతోపాటు ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని నివారించడమని స్పష్టం చేసింది. క్యాబ్ సేవల సంస్థలు కస్టమర్ భద్రత, డ్రైవర్ సంక్షేమంపై బాధ్యత వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా తప్పదని తెలిపింది. సవరించిన సెక్షన్ 93 మార్గదర్శకాల ప్రకారం క్యాబ్ సంస్థలు తమసేవలను, కార్యకలాపాలను ప్రారంభించడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం. వీటి నియంత్రణకోసం కేంద్రం పేర్కొన్న నిబంధనలను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశిస్తుంది.క్యాబ్‌సేవల సంస్థల నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. తద్వారా అగ్రిగేటర్లు జవాబుదారీగా ఉండటంతో పాటు, వారి కార్యకలాపాలకు బాధ్యత వహించేలా నిర్ధారించుకోవాలి. ఉపాధి కల్పన, సౌకర్యవంతమైన, సరసమైన ధరల్లో ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అందించే లక్ష్యంతో క్యాబ్ సేవల సంస్థల బిజినెస్ సాగాలి. ప్రజా రవాణ వ్యవస్థను గరిష్టంగా వినియోగించడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, వాహనాల ఉద్గార కాలుష్యాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది. తద్వారా మానవ ఆరోగ్యానికి హాని తగ్గించడం అనే లక్ష్యాన్ని సాధించాలనేది ప్రభుత్వ వ్యూహం. దీంతోపాటు తాజా సవరణ ప్రకారం వాహన యజమాని (అతడు / ఆమె) మరణించిన సందర్భంలో, తమ వాహనాన్ని నమోదు లేదా బదిలీ చేసే వ్యక్తిని నామినేట్ చేయవచ్చని మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ తెలిపింది. -
క్యాబ్ అగ్రిగేటర్లకు కష్టకాలం...!
న్యూఢిల్లీః టాక్సీ అగ్రిగేటర్ల సమస్య రాజధాని నగరంలో మరింత జఠిలమౌతోంది. రోజురోజుకూ డ్రైవర్లను పెంచుతుండటం నగరంలో ట్రాఫిక్ జామ్ లకు కారణమౌతోంది. దీంతో ఢిల్లీ రవాణాశాఖ త్వరలో కొత్త పర్మిట్లను జారీ చేయనుంది. సిటీ, ఎన్సీఆర్ పరిథుల్లోని ప్రయాణీకుల పికప్, డ్రాప్ లను నిషేధిస్తూ ఈ కొత్త అనుమతులు అమల్లోకి రానున్నాయి. ఇకపై అమల్లోకి రానున్న ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్(ఎన్) లో భాగంగా ఓలా, ఉబర్ వంటి క్యాబ్ డ్రైవర్లు తమ ధరఖాస్తులతోపాటు ఎన్సీఆర్ ప్రాంతంలో పాయింట్ టు పాయింట్ పికప్ సర్వీసు నిషేధానికి అంగీకరిస్తూ అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎపెక్స్ కోర్టు నిర్దేశాల ప్రకారం ఏఐటీపీ టాక్సీలకు త్వరలో కొత్త అనుమతులు జారీ కానున్నాయి. ఈ కొత్త అనుమతుల్లో భాగంగా జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఢిల్లీ ఎన్సీఆర్) లో ట్రాఫిక్ జామ్ కు కారణమౌతున్న డ్రైవర్లపై నిబంధనలు విధించింది. మే నెలలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం ఇంతకు ముందే ఉన్న పర్మిట్ ముగిసే వరకూ పాత టాక్సీలు మాత్రం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో తిరగొచ్చని మిగిలిన అన్నింటికీ నూతన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్(ఎన్) లో భాగంగా పాయింట్ టు పాయింట్ పికప్ సేవల రద్దు వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏఐటీపీ పర్మిట్ ఐదు సంవత్సరాలపాటు చెల్లుబాటు అవుతుంది. మరో రెండు సంవత్సరాలపాటు కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవలి కాలంలో డ్రైవర్లు..టాక్సీ అగ్రిగేటింగ్ కంపెనీలు ఓలా, ఉబర్ వంటి సంస్థలతో కలిసి భారీ స్థాయిలో ఏఐటీపీ పర్మిట్ ను పొందారు. కాగా ప్రస్తుతం ఎన్సీఆర్ ప్రాంతంలో పాయింట్ టు పాయింట్ పికప్ సేవను నిషేధిస్తూ త్వరలో కొత్త ఏఐటీపీ(ఎన్) పర్మిట్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో కొత్తగా అమల్లోకి రానున్న ఏఐటీపీ పర్మిట్.. ఢిల్లీ రవాణా శాఖ ద్వారా ఇచ్చే ఇతర అనుమతులకు భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రజాసేవలు అందించే వాహనాలకు అనుమతులు పొందినవారు ఢిల్లీలో వాహనాలు నడిపే సమయంలో పోలీసులు ధృవీకరించిన బ్యాడ్జీలను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. అలాగే ఇతర వాణిజ్య వాహనాలకు తప్పనిసరి అయిన సీఎన్జీ.. ప్రజాసేవల క్యాబ్ లకు అవసరం ఉండదు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం జారీచేయనున్నఈ కొత్త అనుమతి విధానం మాత్రం టాక్సీ అగ్రిగేటర్లపై తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తోంది.