క్యాబ్ అగ్రిగేటర్లకు కష్టకాలం...!
న్యూఢిల్లీః టాక్సీ అగ్రిగేటర్ల సమస్య రాజధాని నగరంలో మరింత జఠిలమౌతోంది. రోజురోజుకూ డ్రైవర్లను పెంచుతుండటం నగరంలో ట్రాఫిక్ జామ్ లకు కారణమౌతోంది. దీంతో ఢిల్లీ రవాణాశాఖ త్వరలో కొత్త పర్మిట్లను జారీ చేయనుంది. సిటీ, ఎన్సీఆర్ పరిథుల్లోని ప్రయాణీకుల పికప్, డ్రాప్ లను నిషేధిస్తూ ఈ కొత్త అనుమతులు అమల్లోకి రానున్నాయి. ఇకపై అమల్లోకి రానున్న ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్(ఎన్) లో భాగంగా ఓలా, ఉబర్ వంటి క్యాబ్ డ్రైవర్లు తమ ధరఖాస్తులతోపాటు ఎన్సీఆర్ ప్రాంతంలో పాయింట్ టు పాయింట్ పికప్ సర్వీసు నిషేధానికి అంగీకరిస్తూ అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఎపెక్స్ కోర్టు నిర్దేశాల ప్రకారం ఏఐటీపీ టాక్సీలకు త్వరలో కొత్త అనుమతులు జారీ కానున్నాయి. ఈ కొత్త అనుమతుల్లో భాగంగా జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఢిల్లీ ఎన్సీఆర్) లో ట్రాఫిక్ జామ్ కు కారణమౌతున్న డ్రైవర్లపై నిబంధనలు విధించింది. మే నెలలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం ఇంతకు ముందే ఉన్న పర్మిట్ ముగిసే వరకూ పాత టాక్సీలు మాత్రం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో తిరగొచ్చని మిగిలిన అన్నింటికీ నూతన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్(ఎన్) లో భాగంగా పాయింట్ టు పాయింట్ పికప్ సేవల రద్దు వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏఐటీపీ పర్మిట్ ఐదు సంవత్సరాలపాటు చెల్లుబాటు అవుతుంది. మరో రెండు సంవత్సరాలపాటు కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవలి కాలంలో డ్రైవర్లు..టాక్సీ అగ్రిగేటింగ్ కంపెనీలు ఓలా, ఉబర్ వంటి సంస్థలతో కలిసి భారీ స్థాయిలో ఏఐటీపీ పర్మిట్ ను పొందారు. కాగా ప్రస్తుతం ఎన్సీఆర్ ప్రాంతంలో పాయింట్ టు పాయింట్ పికప్ సేవను నిషేధిస్తూ త్వరలో కొత్త ఏఐటీపీ(ఎన్) పర్మిట్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీలో కొత్తగా అమల్లోకి రానున్న ఏఐటీపీ పర్మిట్.. ఢిల్లీ రవాణా శాఖ ద్వారా ఇచ్చే ఇతర అనుమతులకు భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రజాసేవలు అందించే వాహనాలకు అనుమతులు పొందినవారు ఢిల్లీలో వాహనాలు నడిపే సమయంలో పోలీసులు ధృవీకరించిన బ్యాడ్జీలను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. అలాగే ఇతర వాణిజ్య వాహనాలకు తప్పనిసరి అయిన సీఎన్జీ.. ప్రజాసేవల క్యాబ్ లకు అవసరం ఉండదు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం జారీచేయనున్నఈ కొత్త అనుమతి విధానం మాత్రం టాక్సీ అగ్రిగేటర్లపై తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తోంది.