
ఆదాయాలను పెంచుకోవడానికి ఢిల్లీ మెట్రో తన ఛార్జీలను పెంచడం మొదలు పెట్టింది. ఛార్జీల పెంపుతో ఓ వైపు ప్రయాణికులు తగ్గిపోతున్నా... మరోవైపు నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఈ పెంపుపై మాత్రం ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ అసలు తగ్గడం లేదు. మరోసారి 2019 జనవరిలో కూడా ఢిల్లీ మెట్రో తన ఛార్జీలు పెంచబోతున్నట్టు తెలిసింది. కేంద్రం నియమించిన కమిటీ ప్రతిపాదనలను ఢిల్లీ మెట్రో అమలు చేయబోతుందని వెల్లడైంది. ఇప్పటికే ఈ కమిటీ ప్రతిపాదించిన మేరకు మే, అక్టోబర్‌లో రెండు దశల్లో ఛార్జీల పెంపు జరిగింది. జస్టిస్(రిటైర్డ్) ఎంఎల్ మెహతా చైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పడింది. దీనిలోనే ఢిల్లీ చీఫ్ సెక్రటరీ, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ బోర్డులో అదనపు సెక్రటరీలున్నారు.
మెట్రో రైల్వే యాక్ట్ కింద 4వ ఛార్జీలను నిర్ణయించే కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ) ఏర్పడింది. ఆటోమేటిక్ యాన్యువల్ ఫేర్ రివిజన్‌ను ఇది ప్రతిపాదించింది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో ఛార్జీలు 2 కిలోమీటర్లకు రూ.10, 2 నుంచి 5 కిలోమీటర్లకు 20 రూపాయలు, 5 నుంచి 12 కిలోమీటర్లకు 30 రూపాయలు, 12 నుంచి 21 కిలోమీటర్లకు 40 రూపాయలు, 21 నుంచి 32 కిలోమీటర్లకు 50 రూపాయలు, 32 కిలోమీటర్లకు మించితే రూ.60 ఛార్జీలు విధిస్తున్నారు. ఛార్జీల పెంపును నిలిపివేయాలంటూ మోదీ ప్రభుత్వాన్ని సీఎం కేజ్రీవాల్ కోరినప్పటికీ, కేంద్రం అసలు తగ్గలేదు. ఛార్జీల పెంపుతో ఒక్క నెలలోనే భారీగా ప్రయాణికులను కోల్పోయింది. సెప్టెంబర్ లో 27.4 లక్షలుగా ఉన్న ప్రయాణికులు, ధరల పెంపు తర్వాత అక్టోబర్ నెలలో ప్రయాణికుల సంఖ్య 24.2 లక్షలకు పడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment