Jica
-
మెట్రో రెండోదశకు జైకా నిధులు!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళనకు నిధుల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురువారం మెట్రో రైల్ విస్తరణ, మూసీనది పరీవాహక ప్రాంత అభివృద్ధికి తక్కువ వడ్డీకి రుణాలు, వివిధ విభాగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సునోరితో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత అంచనాల మేరకు 70 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రెండో దశకు అయ్యే రూ.18,900 కోట్ల వ్యయంలో సుమారు రూ.9,000 కోట్ల వరకు జైకా నుంచి, ఇతర సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించే అవకాశముంది. మెట్రో నిర్మాణ ఒప్పందం మేరకు కేంద్రం 35 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మరో 20 శాతం నిధులు భరించాలి. మిగతా మొత్తాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. ప్రస్తుతం జైకా మాత్రమే అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థపైనే ఆశలు పెట్టుకుంది. మెట్రోతో పాటు, మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి కూడా జైకా నిధులే కీలకం కానున్నాయి. ‘ఆ సంస్థ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఆశించిన స్థాయిలోనే రుణాలు లభిస్తాయని భావిస్తున్నాం.’అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. -
తెలంగాణ స్టార్టప్‌ల అభివృద్ధికి జైకా.. ఏకంగా రూ.1336 కోట్లు
ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వానికి రూ.1,336 కోట్లు (JPY 23679 మిలియన్స్) లోన్ అందించేందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA), ఈ రోజు లోన్ అగ్రిమెంట్ మీద సంతకం సంతకం చేసింది. ఈ కార్యక్రమం కేవలం పట్టణ పారిశ్రామికవేత్తలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, ఔత్సాహిక వ్యాపార నాయకులకు కూడా మద్దతునిచ్చేలా వ్యూహాత్మకంగా రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ కోసం లోన్ అగ్రిమెంట్ మీద ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ & జైకా ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సునోరి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జైకా ఇండియా ఆఫీస్ చీఫ్ రిప్రజెంటేటివ్ 'సైటో మిత్సునోరి' మాట్లాడుతూ.. తెలంగాణలో స్టార్టప్‌లు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడం మా లక్ష్యం అంటూ.. ప్రపంచంలోనే ఓడీఏ లోన్ ద్వారా స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్ అండ్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి JICA మద్దతిచ్చే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదే అని ప్రకటించడానికి నేను చాలా సంతోషిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నేతృత్వంలోని ప్రాజెక్ట్ దేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలో జపాన్ & భారతదేశం మధ్య బలమైన భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతుందని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది. -
కమీషన్లు దండుకుని ఎన్నికల్లో వెదజల్లే వ్యూహం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల జీవనోపాధుల అభివృద్ధి పథకం కాస్తా అధికార పార్టీ నేతలకు జీవనోపాధి కార్యక్రమంగా మారుతోంది. ఎన్నికలకు రెండు నెలల ముందు రూ.2 వేల కోట్ల వ్యయంతో మధ్య, చిన్న తరహా నీటివనరుల అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయిస్తున్నారు. అధిక అంచనా వ్యయంతో కూడిన ఈ పనులను అస్మదీయులకు కట్టబెట్టి, భారీ ఎత్తున కమీషన్లు దండుకుని.. ఆ డబ్బును ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా వ్యయం చేసేందుకు భారీ స్కెచ్ వేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాష్ట్రంలో మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద ఆయకట్టులో రైతుల జీవనోపాధి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల జీవనోపాధుల అభివృద్ధి పథకం (ఏపీఐఎల్‌ఐపీ ) రెండో దశను ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) రూ.1,700 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మిగతా రూ.300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. రెండో దశ అమలును పర్యవేక్షించడానికి జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సన్నిహితునికి చెందిన నిప్పాన్ కోయి సంస్థను ఎంపిక చేశారు. కన్సల్టెన్సీ ఫీజు కింద ఏకంగా రూ.61.29 కోట్లను ఆ సంస్థకు కట్టబెట్టారు. తాజాగా నీటివనరుల అభివృద్ధి, ఆధునికీకరణ పనులను కూడా అస్మదీయులకే కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునే వెసులుబాటును టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలకు ప్రభుత్వ పెద్దలు కల్పించారు. ఇదే అదనుగా టెండర్లలో టీడీపీ ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట కుడి కాలువ(50 కిమీ)లు కింద 18,362 ఎకరాలు, ఎడమ కాలువ, ఎడమ హైలెవ్ కాలువ (54.60 కిమీ) కింద 18,691 ఎకరాలు వెరసి 37,053 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. రూ.91.12 కోట్లతో టెండర్లు పిలిచారు. నారాయణపురం ఆనకట్ట, ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల(ప్యాకేజీ–ఎ)కు రూ.49.41 కోట్లతో, కుడి కాలువ ఆధునికీకరణ పనుల(బీ ప్యాకేజీ)కు రూ.41.71 కోట్లతో లంప్సమ్(ఎల్ఎస్) ఓపెన్ విధానంలో టెండర్లు పిలిచారు. వీటి నిబంధనలను అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రజాప్రతినిధి సూచించిన వారికే పనులు అప్పగించారు. ఈ వ్యవహారంలో రూ.18 కోట్లకుపైగా కమీషన్లు చేతులు మారినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కృష్ణా జిల్లాలో మున్నేరు బ్యారేజీ కింద 10,500 ఎకరాల ఆయకట్టు ఉంది. మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ పనులకు రూ.49.64 కోట్లతో టెండర్లు పిలిచి.. కీలక మంత్రి సూచించిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించారు. ఈ వ్యవహారంలో రూ.8 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. అనంతపురం జిల్లాలో పెన్నార్–కుముద్వతి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు రూ.16.83 కోట్లతో నిర్వహించిన టెండర్లలోనూ టీడీపీ ఎమ్మెల్యే సూచించిన వారికే పనులు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో రూ.3.2 కోట్లకుపైగా కమీషన్లు ముట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇదే జిల్లాలో అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు రూ.18.94 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 4న ఈ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం ద్వారా రూ.3.50 కోట్లకుపైగా కమీషన్ల రూపంలో దండుకునేందుకు కీలక మంత్రి పావులు కదుపుతున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లాలో కృష్ణాపురం రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు రూ.25.75 కోట్లతోను.. అరణియార్ రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు రూ.30.65 కోట్లతోనూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు ఫిబ్రవరి 4న కట్టబెట్టి.. రూ.11 కోట్లకుపైగా ముడుపులు వసూలు చేసుకోవడానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జికి ప్రభుత్వ పెద్దలు అవకాశం కల్పించారు. కమీషన్లు ఇచ్చిన వారికే టెండర్లు! శ్రీకాకుళం జిల్లాలో నారాయణపురం ఆనకట్ట, కృష్ణా జిల్లాలో మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ, చిత్తూరు జిల్లాలో అరణియార్, కృష్ణాపురం జలాశయాలు, అనంతపురం జిల్లాలో ఎగువ పెన్నార్, పెన్నార్–కుముద్వతి తదితర చిన్న మధ్య తరహా ప్రాజెక్టులకు నిర్వహిస్తున్న టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. అంచనాల్లో వంచన నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనుల్లో ప్యాకేజీ–ఎ కింద ఎం–15 కాంక్రీట్ పనులకు క్యూబిక్ మీటర్‌కు రూ.4,407.60 వంతున వ్యయం అవుతుందని లెక్కకట్టిన జలవనరుల శాఖ అధికారులు, పాకేజీ–బి పనుల్లో అదే రకమైన పనులకు క్యూబిక్ మీటర్‌కు రూ.5,184.90 చొప్పున ఖర్చు అవుతుందని తేల్చారు. మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ పనుల్లో కాంక్రీట్ పనుల వ్యయం కూడా క్యూబిక్ మీటర్‌కు రూ.5,883.50కు (2018–19 ఎస్ఎస్ఆర్ మేరకు క్యూబిక్ మీటర్‌కు ఖర్చుయ్యేది రూ.3,900లే కావడం గమనార్హం) పెంచేశారు. అరణియార్, కృష్ణాపురం రిజర్వాయర్లు, పెన్నార్–కుముద్వతి ప్రాజెక్టు, ఎగువ పెన్నార్ జలాశయం తదితర ప్రాజెక్టుల ఆధునికీకరణ పనుల్లోనూ ఇదే ఎత్తున తప్పుడు అంచనాలతో వ్యయాన్ని పెంచేయడం గమనార్హం. -
జపాన్ చదువు.. భలే సులువు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉన్నత, సాంకేతిక చదువుల కోసం ఇంగ్లండ్, జర్మనీ వంటి యూరోప్ దేశాలతో అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలపై ఆసక్తి చూపుతున్న భారతీయ విద్యార్థులు తమ దేశంవైపు కూడా దృష్టి పెట్టాలని జపాన్ యూనివర్సిటీలు కోరుతున్నాయి. జపాన్ ఆర్థిక సహకార సంస్థ జైకా భాగస్వామ్యంతో మంగళవారం ఐఐటీ హైదరాబాద్ ‘అకడమిక్ ఫెయిర్ 2017’ను ఐఐటీ హైదరాబాద్ కంది ప్రాంగణంలో నిర్వహించింది. జపాన్‌కు చెందిన హక్కాయిడో, నాగసాకి, నీగాట, ఒకయామా, సుమికాన్, షిజుకోవా, వాసెద, టోక్యో యూనివర్సిటీలు స్టాళ్లు ఏర్పాటు చేసి.. తమ యూనివర్సిటీల్లో అధ్యయన, పరిశోధన అవకాశాలపై అవగాహన కల్పించాయి. జపాన్‌కు చెందిన ఇతర యూనివర్సిటీలు కూడా తాము బోధిస్తున్న కోర్సుల వివరాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన 74 మంది విద్యార్థులు జైకా ఆర్థిక సాయం (స్కాలర్షిప్)తో అక్కడి యూనివర్సిటీల్లో మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులు అభ్యసిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యూనివర్సిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. జపాన్‌లో పార్ట్‌టైం జాబ్‌లు చేసే అవకాశం ఇవ్వకుండా.. వసతి, ఆహారం, బోధనకయ్యే ఖర్చు తదితరాలన్నింటినీ భరిస్తామని జైకా హామీ ఇస్తోంది. చదువులో ప్రతిభ చూపిన వారికి స్థానికంగా ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అన్ని వసతులు అందుబాటులో.. భారత్, జపాన్ మైత్రీ బంధం గత పదేళ్లలో పటిష్టమవుతూ వస్తోంది. ఇరుదేశాల సంబంధాలు మెరుగవడంలో ఐఐటీ హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే 74 మంది ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు జపాన్ యూనివర్సిటీల్లో చదువుతున్నారు. బోధనతో పాటు వసతి సౌకర్యాలు, రవాణ, భద్రత విషయాల్లో జపాన్ ఎంతో మెరుగ్గా ఉంది. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు అనేక మంది జపాన్ బహుళ జాతి కంపెనీల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. భవిష్యత్తులో జపాన్‌లో చదివే విద్యార్థులు సంఖ్య మరింత పెరుగుతుంది. – ప్రొఫెసర్ యూబీ దేశాయి, డైరెక్టర్, ఐఐటీ హైదరాబాద్ -
బుల్లెట్ ట్రైన్‌కు తొలి అడుగు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ) సోమవారం తన నివేదికను రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు సమర్పించింది. ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య 505 కిలోమీటర్ల దూర ప్రయాణం 7గంటల నుంచి రెండు గంటలకు తగ్గనుంది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం కూడా అదే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ట్రాక్ నిర్మాణం, రైలు నిర్మాణానికి సుమారు రూ. 9880 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని జేఐసీఏ అంచనా వేసింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ రైలులో ప్రయాణం అత్యంత ఖరీదు అవుతుంది. ఈ నివేదికను పూర్తి అధ్యయనం చేసిన తరువాత ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తారని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
2017 వరకూ యమునా ప్రక్షాళన
న్యూఢిల్లీ: యుమునా నది నీటిని తాగే రోజులు వస్తున్నాయి. అంతేకాదు నదిలో ఎంచక్కా ఈతకొట్టడానికి వీలుగా ప్రక్షాళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2017 వరకు ఈ కలను సాకారం చేసే దిశగా చర్యలు ముమ్మరం చేస్తున్నారు. యుమునా నీటిని వినియోగించే విధంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జపాన్ అంతర్జాతీయ సంస్థ (జేఐసీఏ)తో కలిసి భారత ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం చేసుకొంది. 2017 వరకు యుమునా ప్రక్షాళన పూర్తి చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే మురుగు నీటి శుద్ధి ప్రాజెక్టుల అమలుతోపాటు వివిధ కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. ‘2017 సంవత్సరం నాటికి యమునా నీటిలో ఈతకొడుతా, యమునా నీటిని తాగుతానని’ జేఐసీఏ-ఇండియా ప్రధాన ప్రతినిధి సినియా ఎజమా చెప్పారు. ఢిల్లీ పరిధిలో శుద్ధి చేయని మురుగు నీటిని యథేచ్ఛగా యమునా నదీలోకి వదిలివేయడంతో కాలుష్య కాసారంగా మారిందని అన్నారు. ఇండో-జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూపు ఆధ్వర్యంలో జేఐసీఏ పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాల్లో తీరుపై నిర్వహించిన సమావేశంలో సినియా ప్రసంగించారు. పట్టణ ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్టులు, నీరు-యాజమాన్యం(రవాణా) కోసం రూ. 2,40,000 కోట్ల వ్యయంతో చేపట్టడానికి తమ ఏజెన్సీ ఒప్పందం చేసుకొన్నదని చెప్పారు. రూ. 28,660 కోట్ల వ్యయంతో మురుగునీరు, నీటి సరఫరా కోసం 16 ప్రముఖ ప్రాజెక్టులు చేపట్టడానిక జపాన్ నాయకులు అంగీకరించారని చెప్పారు. ఈ ప్రాజెక్టులను ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఒడిశ్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, గోవాలో చేపట్టనున్నట్లు పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి పేర్కొన్నారు. నీటి విభాగంలో అనేక సవాళ్లు ఇండియాలో నీటి విభాగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని జేఐసీఏ అభిప్రాయపడింది. నీటి నిర్వహణ-పంపిణీ(ఓ అండ్ ఎం)ల కోసం స్థానిక సంస్థలు ఆర్థిక ఇబ్బందులను అధిగమిం చాల్సి ఉంది. పీపీపీ మోడల్ ద్వారా (ఓ అండ్ ఎం) ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆధునాతన పద్ధతుల్లో రీసైక్లింగ్ సాంకేతిక నైపుణ్యం పై ప్రచారం చేసి నీటి కొరతను అధిగమించాల్సి ఉంది. దేశంలో పట్టణ రవాణా వ్యవస్థ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రధానంగా పట్టణ మేధో రవాణా పద్ధతులను(ఐటీఎస్) ప్రవేశపెట్టడంలో వెనుకబడిపోయింది. మెట్రో రైలు ప్రవేశం-నిర్వహణ, ప్రాంతీయ రవాణా విభాగం, మోనోరైళ్లు, లైట్ రైలుపై సరైన అవగాహన లేదు. రవాణా-సాంకేతిక రంగాల్లో సమగ్ర చైతన్యం కొరవడిందని జేఐసీఏ తెలిపింది. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి సెక్రటరీ శంకర్ అగర్వాల్, జపాన్ డెరైక ్టర్ జనరల్ యోచి నాక్గమీ మాట్లాడుతూ.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ సందర్శించినప్పుడు ప్రధానంగా పట్టణ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పారు. ఏడేళ్ల తరువాత రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వర్కింగ్ గ్రూపుతో సమావేశమైందని అన్నారు. ముందంజలో.. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశ్సా, కేరళలో పట్టణ అభివృద్ధి కోసం సాంకేతిక, ఆర్థిక పరమైన ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 450 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో మెట్రో రైలును ప్రవేశపెట్టింది, 241 కిమీ శివారు రైలు మార్గం, 1,660 కిమీ పట్టణ హైవేలు, 77 కిమీ హైవే కారిడార్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. దీంతోపాటు ప్రయాణికులకు నీటి రవాణా తదితర పట్టణాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. 2031 వరకు పట్టణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. -
సొరంగ మెట్రో రైలు లైన్ క్లియర్
సాక్షి, ముంబై: నగరంలోనే మొదటి సొరంగ మెట్రో రైలు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొలాబా-బాంద్రా-సీప్జ్ మధ్య ప్రతిపాదిత 33.5 కి.మీ. సొరంగ మెట్రో రైలు మార్గ నిర్మాణానికి అవసరమైన రుణం మంజూరుకు జపాన్ బ్యాంకులు ముందుకు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అవసరమైన వివిధ శాఖల నుంచి తీసుకునే అనుమతుల ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ సొరంగ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.23 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారుల అంచనా. ఇందులో రూ.13 వేల కోట్లను రుణాల రూపంలో అందజేసేందుకు జపాన్ బ్యాంకులు అంగీకరించాయి. మొదటి విడతగా రూ.4,553 కోట్లు చెల్లించేందుకు రెండు రోజుల కిందట ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. దీనిపై ఢిల్లీకి చెందిన ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి రాజేశ్ ఖుల్లార్, జపాన్ బ్యాంకుకు చెందిన భారతదేశ ప్రధాన ప్రతినిధి శిన్యా ఎజిమా తదితరులు సంతకాలు చేశారు. ఈ రుణాలను తిరిగి జపాన్ బ్యాంకులకు 30 ఏళ్లలో చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో మెట్రో-3 ప్రాజెక్టు పనుల ప్రతిపాదన కూడా ముందుకు సాగింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులు కూడా త్వరలో ప్రత్యక్షంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ వేగవంతమైంది. ఈ ప్రాజెక్టును ఏడు ప్యాకేజీల్లో మొదలుపెడతారు. గత అర్హత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఆరు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. 2014 నుంచి పనులు ప్రత్యక్షంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) కమిషనర్ యు.పి.ఎస్.మదన్ అన్నారు. నగరంలో రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి గట్టిక్కించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలక పాత్ర పోషించనుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు వివరాలు.... కొలాబా-బాంద్రా-సీప్జ్ మధ్య 33.5 కి.మీ. సొరంగ మార్గం ఈ మార్గంపై మొత్తం 26 స్టేషన్లు ఉంటాయి. ముందుగా కఫ్ పరేడ్ నుంచి పనులు ప్రారంభమై వర్లీ, బాంద్రా ప్రాంతాలను తాకుతూ సీప్జ్ వరకు వెళుతుంది. కార్ డిపో కోసం గోరేగావ్‌లోని ఆరే కాలనీలో స్థలం కేటాయించారు. ఈ ప్రాజెక్టు పనులు పారదర్శకంగా కొనసాగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డెరైక్టర్లతో కూడిన సంయుక్త కంపెనీ స్థాపించనున్నారు.