జపాన్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన స్టాళ్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉన్నత, సాంకేతిక చదువుల కోసం ఇంగ్లండ్, జర్మనీ వంటి యూరోప్ దేశాలతో అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలపై ఆసక్తి చూపుతున్న భారతీయ విద్యార్థులు తమ దేశంవైపు కూడా దృష్టి పెట్టాలని జపాన్ యూనివర్సిటీలు కోరుతున్నాయి. జపాన్ ఆర్థిక సహకార సంస్థ జైకా భాగస్వామ్యంతో మంగళవారం ఐఐటీ హైదరాబాద్ ‘అకడమిక్ ఫెయిర్ 2017’ను ఐఐటీ హైదరాబాద్ కంది ప్రాంగణంలో నిర్వహించింది. జపాన్‌కు చెందిన హక్కాయిడో, నాగసాకి, నీగాట, ఒకయామా, సుమికాన్, షిజుకోవా, వాసెద, టోక్యో యూనివర్సిటీలు స్టాళ్లు ఏర్పాటు చేసి.. తమ యూనివర్సిటీల్లో అధ్యయన, పరిశోధన అవకాశాలపై అవగాహన కల్పించాయి.
జపాన్‌కు చెందిన ఇతర యూనివర్సిటీలు కూడా తాము బోధిస్తున్న కోర్సుల వివరాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన 74 మంది విద్యార్థులు జైకా ఆర్థిక సాయం (స్కాలర్‌షిప్)తో అక్కడి యూనివర్సిటీల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులు అభ్యసిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యూనివర్సిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. జపాన్‌లో పార్ట్‌టైం జాబ్‌లు చేసే అవకాశం ఇవ్వకుండా.. వసతి, ఆహారం, బోధనకయ్యే ఖర్చు తదితరాలన్నింటినీ భరిస్తామని జైకా హామీ ఇస్తోంది. చదువులో ప్రతిభ చూపిన వారికి స్థానికంగా ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
అన్ని వసతులు అందుబాటులో..
భారత్, జపాన్ మైత్రీ బంధం గత పదేళ్లలో పటిష్టమవుతూ వస్తోంది. ఇరుదేశాల సంబంధాలు మెరుగవడంలో ఐఐటీ హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే 74 మంది ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు జపాన్ యూనివర్సిటీల్లో చదువుతున్నారు. బోధనతో పాటు వసతి సౌకర్యాలు, రవాణ, భద్రత విషయాల్లో జపాన్ ఎంతో మెరుగ్గా ఉంది. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు అనేక మంది జపాన్ బహుళ జాతి కంపెనీల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. భవిష్యత్తులో జపాన్‌లో చదివే విద్యార్థులు సంఖ్య మరింత పెరుగుతుంది.
– ప్రొఫెసర్ యూబీ దేశాయి, డైరెక్టర్, ఐఐటీ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment