జైకా ప్రతినిధి సైటో మిత్సునోరిని సత్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.చిత్రంలో భట్టి, ఉత్తమ్, పొంగులేటి, సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళనకు నిధుల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురువారం మెట్రో రైల్ విస్తరణ, మూసీనది పరీవాహక ప్రాంత అభివృద్ధికి తక్కువ వడ్డీకి రుణాలు, వివిధ విభాగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సునోరితో చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత అంచనాల మేరకు 70 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రెండో దశకు అయ్యే రూ.18,900 కోట్ల వ్యయంలో సుమారు రూ.9,000 కోట్ల వరకు జైకా నుంచి, ఇతర సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించే అవకాశముంది. మెట్రో నిర్మాణ ఒప్పందం మేరకు కేంద్రం
35 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మరో
20 శాతం నిధులు భరించాలి. మిగతా మొత్తాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. ప్రస్తుతం జైకా మాత్రమే అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థపైనే ఆశలు పెట్టుకుంది. మెట్రోతో పాటు, మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి కూడా జైకా నిధులే కీలకం కానున్నాయి. ‘ఆ సంస్థ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఆశించిన స్థాయిలోనే రుణాలు లభిస్తాయని భావిస్తున్నాం.’అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment