సాక్షి, ముంబై: నూతన సంవత్సరంలో మిల్లు కార్మికులకు ఇళ్లు కేటాయించడానికి ‘ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (ఎంఎంఆర్డీయే) ఒప్పుకోవడంతో వారు తమ పోరాటాన్ని గురువారం విరమించారు. ఎంఎంఆర్డీయే నిర్మిస్తున్న వాటిలో 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ ఇళ్లను ఇచ్చేందుకు అవసరమైన అనుమతులు రావడానికి కొంత సమయం పట్టనుంది. దీంతో నూతన సంవత్సరంలో మిల్లు కార్మికులకు 50 శాతం ఇళ్లు కేటాయించడం ఖాయమేనని ఎంఎంఆర్డీయే వర్గాలు తెలిపాయి. ఇళ్ల కేటాయింపు డిమాండ్‌తో 25 మంది మిల్లు కార్మికులు ఆజాద్ మైదాన్‌లో బుధవారం ఉదయం నుంచి అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం విదితమే.
ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 1.48 లక్షల మంది మిల్లు కార్మికులకు ఇళ్లు ఇవ్వడం, ఎంఎంఆర్డీయేకి చెందిన 50 శాతం ఇళ్లు కార్మికులకు కేటాయిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలనే డిమాండ్‌తో కార్మికులు ఆందోళనకు దిగడం తెలిసిందే. ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం వీరితో చర్చలు జరిపింది. ఎట్టకేలకు మిల్లు కార్మికుల డిమాండ్లన్నంటినీ నెరవేర్చేందుకు హామీ ఇవ్వడంతో వారు నిరాహారదీక్షతోపాటు ఆందోళనలను విరమించుకున్నారు. దీక్షలో పాల్గొన్న మరాఠీ దినపత్రిక నవకాల్ సంపాదకురాలు జయక్ష ఖాడీల్కర్-పాండే, ‘గిర్నీ కామ్‌గార్ సంఘర్ష్ సమితి’ అధ్యక్షులు దత్తా ఇస్వాల్కర్, ‘సెంచరీ మిల్ కామ్‌గార్ ఏక్తామంచ్’కు చెందిన నందూ పార్కర్ తదితరులు ఓ వయోధిక మహిళ కార్మికురాలు అందించిన పానీయం సేవించి దీక్ష విరమించారు. ఎంఎంఆర్డీయే నిర్మిస్తున్న ఇళ్లను చౌకగా అద్దెకు ఇస్తామని గతంలో ఈ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామితో మిల్లు కార్మికులకు ఇళ్లపై 50 శాతం యాజమాన్య హక్కులు కూడా దక్కుతాయి.
మిల్లు కార్మికుల దీక్ష విరమణ
Published Sat, Nov 9 2013 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement