సాక్షి, ముంబై : నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలుకు ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రారంభించిన నెల రోజుల్లోనే దాదాపు కోటి మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ ల మధ్య 11.4 కి.మీ ప్రయాణించే మెట్రో రైలును జూన్ 8వ తేదీన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించిన విషయం తెలి సిందే. మంగళవారానికి నెల రోజులు పూర్తవుతోంది. ఈ మెట్రో రైళ్లు మొత్తం 13 వేల ట్రిప్పులు కొట్టాయి. దాదాపు లక్షన్నర కి.మీ ప్రయాణించాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయని రిలయన్స్ ఇన్‌ఫ్రా అభిప్రాయపడింది.
సెలవుదినాల్లో చిన్నారులకు ఉచితం
ముఖ్యంగా ప్రతీ శని, ఆదివారాల్లో 12 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించింది.
పిల్లలతోపాటు పెద్దలు కూడా అధిక సంఖ్యలోనే వస్తున్నారని ఇన్‌ఫ్రా స్పష్టం చేసింది. ప్రస్తుతం శని, ఆదివారాలు కార్యాలయలు, పాఠశాలలకు సెలవులు కావడంతో అత్యధిక శాతం జాయ్ రైడ్ కోసమే అందులో ప్రయాణిస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూలు ఉంటున్నాయి. ప్లాట్‌ఫారాలపై రద్దీకూడా కనిపిస్తుంది. మిగతా రోజుల్లో ఉద్యోగులు, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారు మినహా పిల్లలు, జాయ్ రైడ్ చేసే పెద్దల సంఖ్య అంతగా కనిపించడం లేదు.
పర్యాటకుల ఆకర్షణ
ముఖ్యంగా ఈ మెట్రో రైళ్లు స్థానిక ముంబైకర్లతోపాటు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బోగీలన్నీ మూసి ఉండడంతో బయటి శబ్ధం లోపలికి ఏమాత్రం వినిపించదు. రైలంతా ఏసీ, విశాలమైన కిటికీ అద్దాల్లోంచి బయట నగర అందాలను తిలకించేందుకు వీలుంది. దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్ల మాదిరిగా ఈ చివర నుంచి ఆ చివర వరకు వెళ్లేందుకు బోగీలన్నీ జాయింట్ చేశారు. లోపల ఎలక్ట్రానిక్ ఇండికేటర్లు ఉన్నాయి.
ప్రస్తుతం రైలు ఆగిన స్టేషన్, వచ్చే స్టేషన్ పేరు ముందుగానే హిందీ, ఇంగ్లిష్‌లో ప్రకటిస్తుంది. తత్ఫలితంగా ఈ రైళ్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కూర్చునే సామర్థ్యం తక్కువగా ఉంది. నిలబడి ప్రయాణించేందుకు ఎక్కువ స్థలం కేటాయించారు. అతి తక్కువ సమయంలో కోటికిపైగా ప్రయాణికులను చేరవేసిన ఘనత ముంబై మెట్రో రైళ్లు దక్కించుకున్నాయి.
మోనోరైలుకు విశేష స్పందన
Published Mon, Jul 7 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement