Metropolitan Region Development Authority
-
ఆకాశ హర్మ్యాల దిగువన...
విశ్లేషణ ముంబై నగరాన్ని నివసించడానికి కాకుండా జీవించడానికి తగిన గమ్యంగా వలస ప్రజలు ఎంచుకుంటున్నారనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. నగర కార్పొరేషన్లో భాగమైన శివారు ప్రాంతాలు కూడా నివాసగమ్యంగా లేవు. భౌగోళికంగా, జనాభా పరంగా ముంబైని రెండురకాలుగా విభజించాల్సి ఉంటుంది. ఒకటి నియతమైనది, సభ్యమైనది. రెండోది మురికివాడలకు సంబంధిం చినది. ఇలాంటి విభజనకు తగిన కారణాలున్నాయి. దాదాపు నగరంలోని సగం జనాభా మురికివాడల్లోనే నివసిస్తోంది. మురికివాడల్లో నివసించనివారి మధ్యన మురికివాడల్లో ఉంటున్నవారు ఎల్లప్పుడూ ‘వారు’ గానే ఉండిపోతారు. ముందుభాగంలో పూర్తిగా అద్దాలు పరిచిన భవంతులు నగర ప్రాంతంలోని ఆకాశంలోకి ఎగబాకి ఉంటాయి. అయితే మురికివాడలు అంటే తప్పకుండా భూమికి ఆనుకుని ఉంటాయని భావించనవసరం లేదు. ఇవి చాలావరకు రెండు అంతస్తులతో కూడి ఉంటాయి. కానీ ఇవి పెద్దగా కనిపించవు. వాస్తవానికి ఇవి తమతమ స్థానాల్లో తాము ఉంటున్నప్పటికీ పరస్పరం కలిసిపోయి ఉంటాయి. అయినప్పటికీ ఈ స్థితి ‘వారిని’ ‘మనంగా’ మార్చడం లేదు. నగరం జనసమ్మర్దంతో కిటకిటలాడుతూ ఉండటానికి మురికివాడల జనాభానే తప్పుపడుతుంటారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నగరంలోని మురికివాడలన్నీ కలిసి నగర భూభాగంలో పదిశాతం కంటే తక్కువ స్థానంలో ఏర్పడి ఉన్నాయి. ఇంత తక్కువ స్థలంలో ఇంత జనాభా కిక్కిరిసి ఉంది కాబట్టే మురికివాడలు కిటకిటలాడుతుంటాయి. ప్రతి 100 లేదా 125 చదరపు అడుగుల్లో ఐదుగురు నివసిస్తుంటారు. ధారవి ప్రాంతంలో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, స్థానిక రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఈ మురికివాడలు కనిపిస్తాయి. ఇక కొత్త ప్రాంతాల్లో మురికివాడలు ఏర్పడటం అసాధ్యం. పైగా సాధారణ గృహనిర్మాణ రంగం బహుళ అంతస్తుల రూపంలో కొత్త వర్గీకరణ విధానాన్ని రంగంలోకి తీసుకువచ్చింది. నేలను ఆనుకుని ఉండే మురికివాడలు ఇటుక గోడలు, తగరపు రేకుల పైకప్పులతో ఉంటాయి. వీటిలో అన్నిటికన్నా ఎత్తుగా కనిపించే ఇళ్లు మూడు వరుసలతో ఉంటాయి. ఇవి కూడా దాదాపుగా తగరపు పైకప్పుతోనే ఉంటాయి. ఇవి నేలకు ఆనుకుని ఉన్న ఇళ్ల మధ్యలో పైకి సాగి వచ్చినట్లుంటాయి. ఇటీవలే కూల్చివేతకు గురైన బాంద్రా సమీపం లోని మురికివాడలు పూర్తిగా నిలువుగా ఉండి నాలుగు అంతస్తులతో కూడి ఉండేవి. పురపాలక చట్టాలు మురికివాడల్లో నివాసాలకు 14 అడుగుల ఎత్తువరకు అనుమతించాయి కాబట్టి ఈ పరిధిలోనే ఉండే కుటుంబాలు కొంతమేరకు మరింత సౌకర్యంగా ఉంటాయి. దీంతో పై అంతస్తులో ఉన్న ఇళ్లను అద్దెకు ఇస్తుంటారు. ఇది అటు కిరాయి మార్కెట్‌కు, ఇటు మురికివాడల్లో స్థలం కొరత కొనసాగింపునకు సంకేతంగా నిలుస్తోంది. నివాసాల ఎత్తును 20 అడుగుల వరకు అనుమతించడానికి చేసిన ప్రతిపాదన దశాబ్ద కాలంగా నలుగుతూనే ఉంది. బాంద్రాలో జరిగిన విధ్వంసం వంటిది చోటు చేసుకున్నప్పుడే మురికివాడల గురించిన చైతన్యం ఆకస్మికంగా ఏర్పడుతూ ఉంటుంది. గృహరుణాలు అందుబాటులో ఉన్నా, మధ్యతరగతి ప్రజలకు కూడా గృహనిర్మాణం భారీ ఖర్చుతో కూడి ఉంటున్నందునే మురికివాడలు ఉనికిలో ఉన్నాయని మర్చిపోతుం టారు. ముంబై నగరాన్ని నివసించడానికి కాకుండా జీవించడానికి తగిన గమ్యంగా వలస ప్రజలు ఎంచుకుంటున్నారనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. నగర కార్పొరేషన్లో భాగంగా చేసిన సుదూరంలోని శివారు ప్రాంతాలు కూడా నివాసానికి అనుకూలమైన గమ్యంగా ఆకర్షించడం లేదు. ముంబై మురికివాడల గురించి ముఖం చిట్లించుకునేవారు ఒక వాస్తవాన్ని విస్మరిస్తున్నారనే చెప్పాలి. మురికివాడలను తీసేయండి. అప్పుడు సబర్బన్ రైళ్లకు అంతరాయం కలి గితే ఎలా ఉంటుందో అలా ముంబై నగరం స్తంభించిపోయిన మజిలీలాగా మారిపోతుంది. మీ డ్రైవర్, మీ పనిమనిషి, మీ క్యాబ్ డ్రైవర్, మీ ఆటోరిక్షావాలా, షాప్ అటెండెంట్లు, చిరువ్యాపారులు మొదలైన వారందరూ ఈ మురికివాడల నుంచే వస్తుంటారు. మురికివాడలు అసభ్యకరంగానే కనిపిస్తాయి. అవును. అవి చూసేవారి కళ్లకు పుండులాగే కనిపిస్తాయి. కానీ కోటిమంది జనాభాలో సగం మందికి అవి నివాసప్రాంతాలుగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే 1996లో మురికివాడల పునరావాస పథకాన్ని ప్రారంభించారు. ఉచిత భవంతులలో వారికి ఇళ్లను కట్టివ్వడం, దీనికోసం ఫ్రీ మార్కెట్లో అమ్ముకునేందుకు గృహనిర్మాతలకు అదనపు ఫ్లోర్లు కట్టుకోవడానికి అనుమతించడం ఈ పథకం ఉద్దేశం. అయితే వేలాది పునరావాస ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉండిపోయాయి. ఎందుకంటే భవననిర్మాతలు ఈ ప్రాజెక్టులకు అనుమతి మాత్రమే పొంది, వాటిని సొంతం చేసుకుంటారు. తర్వాతెప్పుడో లాభం పొందేందుకు దాన్ని అలాగే వదిలేస్తారు. ఉన్నట్లుండి రాజకీయనేతలు చొరబడతారు, భవన నిర్మాతలతో కుమ్మక్కవుతారు. మరోవైపు ముంబై మురికివాడలు నిలువుగా పైకి పెరుగుతుంటాయి. ఎవరికీ ప్రయోజనం లభించదు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
లక్ష బావులు, యాభైవేల చెరువులు
తవ్వించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణ చర్యల్లో భాగంగానే.. ముంబై : ముంచుకొస్తున్న కరవును నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లక్ష బావులు, యాభైవేల చెరువులు తవ్వించాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి పనులు ప్రారంభమవుతాయని ఈ మేరకు సీఎం ఫడ్నవీస్ గురువారం వెల్లడించారు. కరవు వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ‘ఈ కార్యక్రమం వల్ల 14 జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతమున్న బావుల తవ్వకం పనులు తొందరగా పూర్తి చేసి, వ్యవసాయం కోసం మరో లక్ష బావులు, యాభైవేల చెరువులు తవ్విస్తాం’ అని సీఎం అన్నారు. రాష్ట్రం ప్రస్తుతం సహజ విపత్తుల వల్ల ఇబ్బంది పడుతోందని, తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బంది తలెత్తుతోందని చెప్పారు. గతేడాది అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ ఏడాది అసలు వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, మేత లేక పశువులు అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కరువు నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని జిల్లాల అధికారులకు సూచించినట్లు చెప్పారు. నీటి సంరక్షణ చర్యలతో పాటు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆహార భద్రత పథకాలు ప్రారంభిస్తామని, రాజీవ్ గాంధీ జీవనిధి యోజన పథకం కింద ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పారు. ‘అంధేరీ-దహిసర్’ మెట్రోకు సర్వం సిద్ధం అంధేరీ తూర్పు-దహిసర్ తూర్పు మెట్రోకు ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీజ్ ఆమోదం తెలపనున్నారు. రూ.5,757 కోట్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనం పూర్తి చేసిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ).. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ)కి నివేదిక సమర్పించింది. 16.5 కిమీ మేర నిర్మించే ఈ మెట్రో మార్గానాకి గాను నాలుగు నుంచి నాలుగున్నర ఏళ్ల సమయం పడుతుందని, ఈ కారిడార్‌లో 16 స్టేషన్లు ఉంటాయని ఎమ్మెమ్మార్డీఏ సీనియర్ అధికారి అన్నారు. -
మోనోరైలుకు రిటర్న్ టికెట్
సాక్షి, ముంబై : మోనోరైలు ప్రయాణికులకు శుభవార్త! వీరికి ఇక నుంచి రిటర్న్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఫలితంగా టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీ కొంత మేర తగ్గనుందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ) అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఒకే టికెట్‌తో గమ్యస్థానం చేరుకొని తిరిగి రావచ్చు. ఎంత మంది ప్రయాణికులు మోనోరైలులో వెళ్లి ఇందులోనే తిరుగు ప్రయాణమవుతున్నారన్న (రిటర్న్ జర్నీ) విషయమై సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది. అయితే చాలా మంది ప్రయాణికులు తిరిగి వస్తుండడంతో రిటర్న్ టికెట్ సదుపాయం కూడా కల్పిస్తే బాగుంటుందని అధికారులు భావించారు. ఈ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెమ్మార్డీఏ కమిషనర్ యూపీఎస్ మదన్ పేర్కొన్నారు. ఇదిలా వుండగా ముంబై మెట్రోకు జూలై నుంచి రిటర్న్ టికెట్ సదుపాయం కల్పించారు. దీనికి ప్రయాణికుల నుంచి మంది స్పందన వస్తోందని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. జాయ్రైడ్ల కోసం మెట్రోరైళ్లు ఎక్కేవారు ఈ సదుపాయాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. మోనో రైలు ప్రయాణికులకు నెలసరి పాస్‌ను కూడా ప్రారంభించాలని ఎమ్మెమ్మార్డీఏ యోచిస్తోంది. ఇందుకోసం ప్రయాణికుల రద్దీపై అధ్యయనం నిర్వహించనున్నారు. ఈ రైలులో ఎంత మంది తిరుగుప్రయాణమవుతున్నారనే దానిపై అధ్యయనం నిర్వహించనున్నారు. ఎక్కువమంది ఈ రైలులో వెనక్కి వచ్చినట్లయితే నెలసరి పాస్‌లను కూడా జారీ చేస్తామని మదన్ తెలిపారు. ఎమ్మెమ్మార్డీఏ అందజేసిన గణాంకాల మేరకు.. మోనో రైలు ప్రయాణికుల్లో దాదాపు 50 శాతం మంది ప్రయాణికులు ఇదే రైలులో తిరుగు ప్రయాణం అవుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. మోనోతో పోల్చితే మెట్రో రైలులో 70 శాతం మంది తిరుగు ప్రయాణం అవుతారని తేలింది. 8.8 కిలోమీటర్ల పొడవుతున్న చెంబూర్-వడాలా కారిడార్‌ను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలుకు అనుకున్నంత మేర స్పందన లభించడం లేదని అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు మార్గాన్ని విస్తృతపర్చకపోవడంతోపాటు రద్దీ స్టేషన్లను ఈ మార్గంలో చేర్చకపోవడంతో కూడా స్పందన తక్కువగా ఉంది. రెండోదశ ప్రాజెక్టులో మోనోరైలును జాకబ్ సర్కిల్ వరకు విస్తరించనున్నారు. దీని వల్ల ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య రైల్వేస్టేషన్లు అయిన చెంబూర్, వడాలా, కర్రీరోడ్, మహాలక్ష్మి వంటి స్టేషన్లతో మోనో రైలు సేవలను అనుసంధానించనున్నారు. అంతేగాక మోనోరైలును తూర్పు శివారు ప్రాంతాల నుంచి పశ్చిమ శివారు ప్రాంతాలకు త్వరలోనే అనుసంధానిస్తామని మదన్ పేర్కొన్నారు. -
రంగ్ రబ్బా రబ్బా..
సాక్షి, ముంబై: నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి హోలీ హడావుడి ప్రారంభమైంది. నగరంలోని అనేక సొసైటీలు, టవర్లు, చాల్స్, భవనాల ఆవరణలో వివిధ రంగులతో ముగ్గులు వేశారు. ముగ్గుమధ్యలో కట్టెలు, గడ్డి, పిడకలతో కాముడిని పేర్చి దహనానికి సిద్ధంగా ఉంచారు. రాత్రి 9.30 గంటల తర్వాత అందరు గుమిగూడి మంత్రాలు చదువుతూ హోలీకి నిప్పంటించి దహనం చేశారు. ఒకవైపు డీజే లౌడ్‌స్పీకర్ల హోరు, మరోవైపు యువకులు రంగులు చల్లుకుంటూ బెంజో, నాసిక్ బాజా లాంటి వాయిద్యాల మధ్య నృత్యం చేస్తూ రాత్రిళ్లు హోరెత్తించారు. నియమాల ప్రకారం రాత్రి పది గంటల తర్వాత ఎలాంటి వాయిద్యాలు వినియోగించరాదు. అయితే అర్థరాత్రి వరకు ఈ తతంగ ం కొనసాగినా, గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. సోమవారం ఉదయం నుంచి పిల్లలు, పెద్దలు వయోభేదం లేకుండా సొసైటీ, చాల్స్ అవరణలోకి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్ధికంగా ఉన్న సొసైటీలు, టవర్ యాజమాన్యాలు విందు పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి. రంగులు చల్లుకునే కార్యక్రమం అనంతరం కలిసి కట్టుగా విందులో పాల్గొన్నాయి. హోలీ ఆడిన నటులు... సినీ పరిశ్రమకు చెందిన అనేక కొత్త, పాత తరం నటీనటులు హోలీ సంబరాలు జరుపుకున్నారు. మలబార్ హిల్స్, నెపెన్సీ రోడ్, బాంద్రాలోని పాలీ హిల్స్, ఖార్, శాంతాక్రజ్, చార్ బంగ్లా, సాత్ బంగ్లా తదితర ధనవంతులు, సినీ తారలు నివాసముండే ప్రాంతాలన్నీ సోమవారం ఉదయం నుంచి బిజీగా కనిపించాయి. వారివారి సొంత బంగ్లాలో హోలీ సంబరాలు చేసుకున్నారు. ‘మోనో’ సేవల నిలిపివేత హోలీ పండుగ నేపథ్యంలో మోనో రైలు బోగీలపై రంగులుపడకుండా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రైలు సేవలను సోమవారం పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఈ రైలు సేవలను ఆస్వాదించేందుకు ఆయా స్టేషన్లకు చేరుకున్న నగరవాసులకు నిరాశే మిగిలింది. హోలీ పండుగ నేపథ్యంలో దాదాపు అన్ని రంగాల ఉద్యోగులకూ సెలవు ఉంటుంది. రంగుల్లో మునిగితేలిన ముంబైకర్లు మోనో రైలులో ప్రయాణించేందుకు వస్తారు. ఈ నేపథ్యంలో ఆకతాయిలు ప్లాట్‌ఫారంతోపాటు రైలు లోపల రంగులు చల్లుకునే అవకాశముంది. దీంతో బోగీలన్నీ అపరిశుభ్రంగా మారతాయి. ఇటువంటి ఇబ్బందులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను నిలిపివేయడమే ఉత్తమమని భావించినట్లు ఎమ్మెమ్మార్డీయే డెరైక్టర్ దిలీప్ కవట్కర్ చెప్పారు. రైల్వే ట్రాక్‌ల వెంట పహారా... రైల్వే ప్రయాణికులపై పోలీసులు ఈసారి చాలా శ్రద్ధ తీసుకున్నారు. సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే ట్రాక్స్ వెంబడి ఉన్న మురికివాడల్లో నివాసముంటున్న పోకిరి, ఆకతాయిలు నీటితో నింపిన బెలూన్లు విసురుతున్నారని ఏటా అనేక ఫిర్యాదులు రైల్వే పోలీసులకు వస్తున్నాయి. నడిచే రైలుపై బెలూన్లు విసరడంవల్ల డోరు దగ్గర నిలబడిన ప్రయాణికులకు గట్టిగా దెబ్బ తగులుతుంది. కొన్ని సందర్భాలలో అదుపుతప్పి కిందపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది ఏటా జరుగుతున్నదే. తాజాగా మూడు రోజుల క్రితం భయందర్-మీరారోడ్ స్టేషన్ల మధ్య నీటి బెలూన్ విసరడంతో వైశాలి దమానియా అనే మహిళా ఉద్యోగి కంటికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో బెలూన్లు విసిరే ఆకతాయిల ఆట కట్టించేందుకు మురికివాడల వెంబడి ఉన్న ట్రాక్‌పై అక్కడక్కడ రైల్వే పోలీసులను మోహరించారు. నగరంలోని అన్ని జంక్షన్ల వద్ద పోలీసులు పహారా కాశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు వ్యాన్లలో గస్తీ నిర్వహించారు. హోలీ పండగ కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దీంతో నగరంలో తిరిగే బెస్ట్ బస్సులు, లోకల్ రైళ్లన్నీ దాదాపు ఖాళీగానే కనిపించాయి.