విశ్లేషణ
ముంబై నగరాన్ని నివసించడానికి కాకుండా జీవించడానికి తగిన గమ్యంగా వలస ప్రజలు ఎంచుకుంటున్నారనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. నగర కార్పొరేషన్‌లో భాగమైన శివారు ప్రాంతాలు కూడా నివాసగమ్యంగా లేవు.
భౌగోళికంగా, జనాభా పరంగా ముంబైని రెండురకాలుగా విభజించాల్సి ఉంటుంది. ఒకటి నియతమైనది, సభ్యమైనది. రెండోది మురికివాడలకు సంబంధిం చినది. ఇలాంటి విభజనకు తగిన కారణాలున్నాయి. దాదాపు నగరంలోని సగం జనాభా మురికివాడల్లోనే నివసిస్తోంది. మురికివాడల్లో నివసించనివారి మధ్యన మురికివాడల్లో ఉంటున్నవారు ఎల్లప్పుడూ ‘వారు’ గానే ఉండిపోతారు.
ముందుభాగంలో పూర్తిగా అద్దాలు పరిచిన భవంతులు నగర ప్రాంతంలోని ఆకాశంలోకి ఎగబాకి ఉంటాయి. అయితే మురికివాడలు అంటే తప్పకుండా భూమికి ఆనుకుని ఉంటాయని భావించనవసరం లేదు. ఇవి చాలావరకు రెండు అంతస్తులతో కూడి ఉంటాయి. కానీ ఇవి పెద్దగా కనిపించవు. వాస్తవానికి ఇవి తమతమ స్థానాల్లో తాము ఉంటున్నప్పటికీ పరస్పరం కలిసిపోయి ఉంటాయి. అయినప్పటికీ ఈ స్థితి ‘వారిని’ ‘మనంగా’ మార్చడం లేదు.
నగరం జనసమ్మర్దంతో కిటకిటలాడుతూ ఉండటానికి మురికివాడల జనాభానే తప్పుపడుతుంటారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నగరంలోని మురికివాడలన్నీ కలిసి నగర భూభాగంలో పదిశాతం కంటే తక్కువ స్థానంలో ఏర్పడి ఉన్నాయి. ఇంత తక్కువ స్థలంలో ఇంత జనాభా కిక్కిరిసి ఉంది కాబట్టే మురికివాడలు కిటకిటలాడుతుంటాయి. ప్రతి 100 లేదా 125 చదరపు అడుగుల్లో ఐదుగురు నివసిస్తుంటారు.
ధారవి ప్రాంతంలో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, స్థానిక రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఈ మురికివాడలు కనిపిస్తాయి. ఇక కొత్త ప్రాంతాల్లో మురికివాడలు ఏర్పడటం అసాధ్యం. పైగా సాధారణ గృహనిర్మాణ రంగం బహుళ అంతస్తుల రూపంలో కొత్త వర్గీకరణ విధానాన్ని రంగంలోకి తీసుకువచ్చింది.
నేలను ఆనుకుని ఉండే మురికివాడలు ఇటుక గోడలు, తగరపు రేకుల పైకప్పులతో ఉంటాయి. వీటిలో అన్నిటికన్నా ఎత్తుగా కనిపించే ఇళ్లు మూడు వరుసలతో ఉంటాయి. ఇవి కూడా దాదాపుగా తగరపు పైకప్పుతోనే ఉంటాయి. ఇవి నేలకు ఆనుకుని ఉన్న ఇళ్ల మధ్యలో పైకి సాగి వచ్చినట్లుంటాయి. ఇటీవలే కూల్చివేతకు గురైన బాంద్రా సమీపం లోని మురికివాడలు పూర్తిగా నిలువుగా ఉండి నాలుగు అంతస్తులతో కూడి ఉండేవి.
పురపాలక చట్టాలు మురికివాడల్లో నివాసాలకు 14 అడుగుల ఎత్తువరకు అనుమతించాయి కాబట్టి ఈ పరిధిలోనే ఉండే కుటుంబాలు కొంతమేరకు మరింత సౌకర్యంగా ఉంటాయి. దీంతో పై అంతస్తులో ఉన్న ఇళ్లను అద్దెకు ఇస్తుంటారు. ఇది అటు కిరాయి మార్కెట్‌కు, ఇటు మురికివాడల్లో స్థలం కొరత కొనసాగింపునకు సంకేతంగా నిలుస్తోంది. నివాసాల ఎత్తును 20 అడుగుల వరకు అనుమతించడానికి చేసిన ప్రతిపాదన దశాబ్ద కాలంగా నలుగుతూనే ఉంది.
బాంద్రాలో జరిగిన విధ్వంసం వంటిది చోటు చేసుకున్నప్పుడే మురికివాడల గురించిన చైతన్యం ఆకస్మికంగా ఏర్పడుతూ ఉంటుంది. గృహరుణాలు అందుబాటులో ఉన్నా, మధ్యతరగతి ప్రజలకు కూడా గృహనిర్మాణం భారీ ఖర్చుతో కూడి ఉంటున్నందునే మురికివాడలు ఉనికిలో ఉన్నాయని మర్చిపోతుం టారు. ముంబై నగరాన్ని నివసించడానికి కాకుండా జీవించడానికి తగిన గమ్యంగా వలస ప్రజలు ఎంచుకుంటున్నారనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. నగర కార్పొరేషన్‌లో భాగంగా చేసిన సుదూరంలోని శివారు ప్రాంతాలు కూడా నివాసానికి అనుకూలమైన గమ్యంగా ఆకర్షించడం లేదు. ముంబై మురికివాడల గురించి ముఖం చిట్లించుకునేవారు ఒక వాస్తవాన్ని విస్మరిస్తున్నారనే చెప్పాలి. మురికివాడలను తీసేయండి. అప్పుడు సబర్బన్ రైళ్లకు అంతరాయం కలి గితే ఎలా ఉంటుందో అలా ముంబై నగరం స్తంభించిపోయిన మజిలీలాగా మారిపోతుంది. మీ డ్రైవర్, మీ పనిమనిషి, మీ క్యాబ్ డ్రైవర్, మీ ఆటోరిక్షావాలా, షాప్ అటెండెంట్లు, చిరువ్యాపారులు మొదలైన వారందరూ ఈ మురికివాడల నుంచే వస్తుంటారు.
మురికివాడలు అసభ్యకరంగానే కనిపిస్తాయి. అవును. అవి చూసేవారి కళ్లకు పుండులాగే కనిపిస్తాయి. కానీ కోటిమంది జనాభాలో సగం మందికి అవి నివాసప్రాంతాలుగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే 1996లో మురికివాడల పునరావాస పథకాన్ని ప్రారంభించారు. ఉచిత భవంతులలో వారికి ఇళ్లను కట్టివ్వడం, దీనికోసం ఫ్రీ మార్కెట్‌లో అమ్ముకునేందుకు గృహనిర్మాతలకు అదనపు ఫ్లోర్లు కట్టుకోవడానికి అనుమతించడం ఈ పథకం ఉద్దేశం.
అయితే వేలాది పునరావాస ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉండిపోయాయి. ఎందుకంటే భవననిర్మాతలు ఈ ప్రాజెక్టులకు అనుమతి మాత్రమే పొంది, వాటిని సొంతం చేసుకుంటారు. తర్వాతెప్పుడో లాభం పొందేందుకు దాన్ని అలాగే వదిలేస్తారు. ఉన్నట్లుండి రాజకీయనేతలు చొరబడతారు, భవన నిర్మాతలతో కుమ్మక్కవుతారు. మరోవైపు ముంబై మురికివాడలు నిలువుగా పైకి పెరుగుతుంటాయి. ఎవరికీ ప్రయోజనం లభించదు.
మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment