సాక్షి, ముంబై: నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి హోలీ హడావుడి ప్రారంభమైంది. నగరంలోని అనేక సొసైటీలు, టవర్లు, చాల్స్, భవనాల ఆవరణలో వివిధ రంగులతో ముగ్గులు వేశారు. ముగ్గుమధ్యలో కట్టెలు, గడ్డి, పిడకలతో కాముడిని పేర్చి దహనానికి సిద్ధంగా ఉంచారు. రాత్రి 9.30 గంటల తర్వాత అందరు గుమిగూడి మంత్రాలు చదువుతూ హోలీకి నిప్పంటించి దహనం చేశారు.
ఒకవైపు డీజే లౌడ్‌స్పీకర్ల హోరు, మరోవైపు యువకులు రంగులు చల్లుకుంటూ బెంజో, నాసిక్ బాజా లాంటి వాయిద్యాల మధ్య నృత్యం చేస్తూ రాత్రిళ్లు హోరెత్తించారు. నియమాల ప్రకారం రాత్రి పది గంటల తర్వాత ఎలాంటి వాయిద్యాలు వినియోగించరాదు. అయితే అర్థరాత్రి వరకు ఈ తతంగ ం కొనసాగినా, గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. సోమవారం ఉదయం నుంచి పిల్లలు, పెద్దలు వయోభేదం లేకుండా సొసైటీ, చాల్స్ అవరణలోకి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్ధికంగా ఉన్న సొసైటీలు, టవర్ యాజమాన్యాలు విందు పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి. రంగులు చల్లుకునే కార్యక్రమం అనంతరం కలిసి కట్టుగా విందులో పాల్గొన్నాయి.
హోలీ ఆడిన నటులు...
సినీ పరిశ్రమకు చెందిన అనేక కొత్త, పాత తరం నటీనటులు హోలీ సంబరాలు జరుపుకున్నారు. మలబార్ హిల్స్, నెపెన్సీ రోడ్, బాంద్రాలోని పాలీ హిల్స్, ఖార్, శాంతాక్రజ్, చార్ బంగ్లా, సాత్ బంగ్లా తదితర ధనవంతులు, సినీ తారలు నివాసముండే ప్రాంతాలన్నీ సోమవారం ఉదయం నుంచి బిజీగా కనిపించాయి. వారివారి సొంత బంగ్లాలో హోలీ సంబరాలు చేసుకున్నారు.
‘మోనో’ సేవల నిలిపివేత
హోలీ పండుగ నేపథ్యంలో మోనో రైలు బోగీలపై రంగులుపడకుండా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రైలు సేవలను సోమవారం పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఈ రైలు సేవలను ఆస్వాదించేందుకు ఆయా స్టేషన్‌లకు చేరుకున్న నగరవాసులకు నిరాశే మిగిలింది. హోలీ పండుగ నేపథ్యంలో దాదాపు అన్ని రంగాల ఉద్యోగులకూ సెలవు ఉంటుంది. రంగుల్లో మునిగితేలిన ముంబైకర్లు మోనో రైలులో ప్రయాణించేందుకు వస్తారు. ఈ నేపథ్యంలో ఆకతాయిలు ప్లాట్‌ఫారంతోపాటు రైలు లోపల రంగులు చల్లుకునే అవకాశముంది. దీంతో బోగీలన్నీ అపరిశుభ్రంగా మారతాయి. ఇటువంటి ఇబ్బందులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను నిలిపివేయడమే ఉత్తమమని భావించినట్లు ఎమ్మెమ్మార్డీయే డెరైక్టర్ దిలీప్ కవట్కర్ చెప్పారు.
రైల్వే ట్రాక్‌ల వెంట పహారా...
రైల్వే ప్రయాణికులపై పోలీసులు ఈసారి చాలా శ్రద్ధ తీసుకున్నారు. సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే ట్రాక్స్ వెంబడి ఉన్న మురికివాడల్లో నివాసముంటున్న పోకిరి, ఆకతాయిలు నీటితో నింపిన బెలూన్లు విసురుతున్నారని ఏటా అనేక ఫిర్యాదులు రైల్వే పోలీసులకు వస్తున్నాయి. నడిచే రైలుపై బెలూన్లు విసరడంవల్ల డోరు దగ్గర నిలబడిన ప్రయాణికులకు గట్టిగా దెబ్బ తగులుతుంది. కొన్ని సందర్భాలలో అదుపుతప్పి కిందపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది ఏటా జరుగుతున్నదే.
తాజాగా మూడు రోజుల క్రితం భయందర్-మీరారోడ్ స్టేషన్ల మధ్య నీటి బెలూన్ విసరడంతో వైశాలి దమానియా అనే మహిళా ఉద్యోగి కంటికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో బెలూన్లు విసిరే ఆకతాయిల ఆట కట్టించేందుకు మురికివాడల వెంబడి ఉన్న ట్రాక్‌పై అక్కడక్కడ రైల్వే పోలీసులను మోహరించారు. నగరంలోని అన్ని జంక్షన్ల వద్ద పోలీసులు పహారా కాశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు వ్యాన్లలో గస్తీ నిర్వహించారు. హోలీ పండగ కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దీంతో నగరంలో తిరిగే బెస్ట్ బస్సులు, లోకల్ రైళ్లన్నీ దాదాపు ఖాళీగానే కనిపించాయి.
రంగ్ రబ్బా రబ్బా..
Published Mon, Mar 17 2014 10:11 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement
Advertisement