విశ్లేషణ
1993లో సీరియల్ బాంబు దాడుల్లో, 2008లో కసబ్ తదితరులు చేసిన ఉగ్రదాడిలో కంటే కూడా ముంబైలో కుక్క కాట్లతోనే అనేకమంది చనిపోయారు. కానీ దీనిపై పురపాలక సంస్థ ఎలాంటి యుద్ధం తలపెట్టలేదు.
ఈ వ్యాసం రెండు రకాల శునక ప్రేమికులకు నచ్చదు. శునకాలను గారాబంగా పెంచుకునేవారు, పెంచకున్నా వీధికుక్కలకు తిండి పెట్టేవారు. మొదటి విభాగంలో మళ్లీ రెండు రకాల వాళ్లున్నారు. పురపాలక సంస్థలనుంచి శునకాలకు లైసెన్స్ తీసుకునేవారు (వీరి సంఖ్య చాలా తక్కువ). అసలు అలాంటి ఆలోచనే చేయనివారు. ఏ పురపాలక సంస్థ అయినా సరే పెంపుడు జంతువులు లేదా వీధికుక్కలు లేక రెండింటి జనాభాను తన పరిధిలో అదుపులోకి తీసుకోగలదు అంటే నమ్మశక్యం కాదు. ఏరకంగా తీసుకున్నా సమాజంలో పెంపుడు కుక్కల కంటే వీధికుక్కల జనాభానే ఎక్కువ. పైగా వీధుల్లో కుక్కలకు తిండిపెట్టడాన్ని వ్యతి రేకించడం అనేది పెద్ద నేరం కిందే లెక్క. అలా చేస్తే జంతువులపై క్రూరత్వ నివారణ సమితి మీపై చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది.
నేను శునక ప్రేమికుడిని కాదు. కానీ పెంపుడు కుక్కల యజమానులు, వీధుల్లో కుక్కలకు తిండి పెట్టేవారి హక్కులను నేను గుర్తిస్తాను. కానీ వారు కొంచెం బాధ్యతతో వ్యవహరించాలన్నది పలువురి అభిప్రాయం. మీ పెంపుడు కుక్క మీ ముఖం నాకుతూ, మీ పరుపుమీదే పడుకుంటూ ఉన్నప్పుడు మల విసర్జనకు దాన్ని బయటకు ఎందుకు తీసుకెళ్లాలి? తమ కుక్కలు వీధుల్లో మలవిసర్జన చేయడం కోసం కొంతమంది రోజువారీగా కొందరికి డబ్బులిస్తుంటారు. వీధుల్లో కుక్కలకు తిండి పెట్టేవారు ఆ చర్యను ఎవరైనా వ్యతిరేకిస్తే మూకుమ్మడిగా వచ్చి మాట్లాడుతుం టారు.
సాధారణంగా ఇలాంటివారు ఒకేచోట కుక్కలకు తిండిపెడుతుంటారు కాబట్టి వీధికుక్కల ప్రేమికులకు, ఆ వీధికుక్కలకు కూడా అక్కడే తామేదో శాశ్వత నివాసముంటున్నట్లుగా తిష్టవేయడం పరిపాటిగా అవుతోంది. ఇలాంటి ప్రాంతాలే కుక్క కాట్లకు నెలవులుగా ఉంటాయి. వీధుల్లో కుక్కలకు తిండిపెడుతున్నవారిని ఆ కుక్కలకు రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయిస్తుంటారా అని అడిగి చూడండి చాలు. ఏ ఒక్కరూ దీనికి నేరుగా సమాధానం ఇవ్వరు. పైగా ఎవరినైనా ఏ కుక్క అయినా కరిచిందా, దానివల్ల ఎవరైనా బాధపడ్డారా అంటూ వాదిస్తుంటారు, ఎదురుప్రశ్నలు వేస్తుంటారు. పైగా కుక్కల జనాభా వృద్ధిని నిలిపేందుకు తగు చర్యలు తీసుకోవడంలో పురపాలక సంస్థకు సహకరించే పని కూడా చేయరు.
పురపాలక సంస్థలు కుక్కలను నపుంసకంగా మార్చడంలో ఘోరంగా విఫలమవుతుండటం మరొక విషయం. కానీ శునక ప్రేమికులు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. వీరికి రోడ్డుపైన లేక పక్కన కుక్కలు మలవిసర్జన చేయడం అభ్యంతరం అనిపించదు. కానీ ఆ పక్కనే నడిచి వెళ్లేవారికి ఇది మహా ఇబ్బంది కలిగిస్తుంటుంది. కుక్క విసర్జితాన్ని తీసివేసేం దుకు ఏ ఒక్కరైనా గెరిటలాంటిది తీసుకెళతారా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. మనదేశంలో మనుషులు బహిరంగ మల విసర్జన చేయకుండా నివారించడం అలవిగాని పని అని మనకు తెలుసు.
స్వచ్ఛభారత్ సర్‌చార్జి ద్వారా ప్రభుత్వ ప్రచారానికి మనం డబ్బు చెల్లిస్తున్నందున ఈ లక్ష్యం మనపై భారం వేస్తోంది కూడా. కానీ కుక్కలను, ప్రత్యేకించి వీధికుక్కలను ప్రేమించడం అనేది కొద్దిమేరకు పౌర బాధ్యతకు కూడా హామీ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా ముంబైలో కుక్క కాటు వల్ల రేబిస్‌కు గురై చాలామంది చనిపోయారు. కుక్కకాటు మరణాల సంఖ్య భీతిగొలిపేదిగా ఉంది. 1993లో సీరియల్ బాంబు దాడుల్లో, 2008లో కసబ్ తదితరులు చేసిన ఉగ్రదాడిలో కంటే కూడా ముంబైలో కుక్క కాట్లతోనే అనేకమంది చనిపోయారు. కానీ దీనిపై పురపాలక సంస్థ ఎలాంటి యుద్ధం తలపెట్టలేదు. దీంతో వీధికుక్కలపై మనమే యుద్ధం చేయాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో సోమవారం ది హిందూ పత్రికలో వచ్చిన వార్త నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. కేరళలో కుక్క కాటుకు గురి అయిన వారికి చెల్లిస్తున్న పరిహారం మితిమీరుతోందని, కొన్ని ప్రత్యేక కేసుల్లో అయితే రూ.20 లక్షల రూపాయల దాకా చెల్లించాల్సి వస్తోందని కేరళ ప్రభుత్వం సమీక్షించింది. కుక్కకాటు బాధితులకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. మునిసిపాలిటీలే వీటిని చెల్లిస్తున్నందున వీటిపై మరింత బాధ్యత పెట్టే అవకాశం లేదని తేల్చేసింది. కానీ మనం చూడాల్సింది కుక్కకాటు చెల్లింపులు మితిమిరిపోయాయా అని కాదు. తమ బాధ్యతలను నిర్వహించడంలో విఫలమవుతున్న వారిని కఠినంగా శిక్షించాలి.
ఇది చిన్న విషయం కాదు. మన దేశంలో దాదాపు మూడు కోట్ల వీధికుక్కలున్నాయి. 20 వేలమంది ప్రతి సంవత్సరం రేబిస్‌తో మరణిస్తున్నారు. ఒక్క ముంబై నగరంలోనే, మనుషులు నడవడానికి చోటు లేదు కానీ, 1994–2015 మధ్య కాలంలో 13 లక్షల కుక్క కాట్లు నగరంలో నమోదయ్యాయి. దేశంలోని ప్రతి నగరం, పట్టణం కూడా కుక్కకాట్లకు సంబంధించి సంతోషం కలిగించని గణాంకాలను కలిగిఉంటున్నాయి. ఉదాహరణకు భివండీలో రెండవ తరగతి విద్యార్థి ధీరజ్ యాదవ్ ఉదంతం భయం గొలుపుతుంది. చెత్త నిల్వ కేంద్రంలో ఆడుకుంటున్న ధీరజ్ అనుకోకుండా కుక్కపై పడ్డాడు. తోడుగా ఉన్న తొమ్మిది ఇతర కుక్కలతోపాటు ఆ కుక్క అతడిని ఎంతగా కరిచిందంటే స్థానిక ఆసుపత్రి అతడిని పెద్దాసుపత్రికి తరలించాల్సిందిగా సిఫార్సుచేసింది. చివరకు ధీరజ్ మరణించాడు. కొన్నేళ్ల క్రితం తొమ్మిదేళ్ల షాహిద్ నసీమ్ సయ్యద్ ముఖం, చేతులు, వక్షంపై 100 కుక్కకాట్లు పడ్డాయి.
- మహేశ్ విజాపుర్కర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment