
విమానాలను ఆపేసిన శునకం
ముంబై: విమానాశ్రయంలో కుక్క హల్చల్ చేసింది. ఎయిర్ పోర్ట్ రద్దీగా ఉండే సమయంలో రన్ వే మీదకు వచ్చిన ఓ శునకం అధికారులను పరుగులు పెట్టించింది. సుమారు అరగంట పాటు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించింది.
ఆదివారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో నాలుగు ఫ్లైట్లు రన్ వే పై దిగడానికి సిద్ధంగా ఉన్న సమయంలో.. అక్కడ ఓ శునకం ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ విమానాలను గాల్లోనే చెక్కర్లు కొట్టించారు. సుమారు అరగంట తరువాత కుక్కను అక్కడి నుండి తరిమేయడంతో విమానాలు రన్ వే పై దిగడానికి అధికారులు అనుమతించారు.
రద్దీ సమయంలో విమానాల రాకపోకలకు ఆ శునకం అరగంట అంతరాయం కలిగించిందని అధికారులు తెలిపారు. సమీపంలోని మురికివాడల నుండి ముంబై విమానాశ్రయంలోకి శునకాలు ప్రవేశించి విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించడం పరిపాటిగా మారింది.