కుక్కముందు తోకముడిచిన చిరుత | Caught on Camera: Dog Chases Away Leopard From House in Mumbai | Sakshi
Sakshi News home page

కుక్కముందు తోకముడిచిన చిరుత

Published Fri, Jun 26 2015 10:51 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

కుక్కముందు తోకముడిచిన చిరుత - Sakshi

కుక్కముందు తోకముడిచిన చిరుత

ముంబయి: సరిగ్గా అర్థరాత్రి రెండు గంటల ప్రాంతం. ఆ బంగ్లాలో ఉన్నవారంతా నిద్రపోతున్నారు. ఇంటికి కాపలా కాసే కుక్క కూడా గుర్రు పెట్టి నిద్రతీస్తుంది. ఈలోపు ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఆ ఇంటి ప్రాంగణంలోకి చిరుత పులి ప్రవేశించింది. బాగా ఆకలితో ఉన్నదనుకుంటా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కసిగా కుక్కపై దాడి చేయాలనుకుంది. కాని, ఆ కుక్క ఇంటిలోపలికి వెళ్లే ప్రవేశ ద్వారానికి ముందున్న గదిలో ఉంది. లోపలికి దూరిపోదామంటే మొత్తం ఇనుపచువ్వలు పెట్టి కట్టారు.

దీంతో ఆ గది చుట్టే అటూ ఇటూ తిరుగుతూ చివరికి తన పంజాను ఇనుపచువ్వల నుంచే దూర్చే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలోనే గాండ్రుమంటూ శబ్దం చేసింది. ఇంతలో కుక్కకు మెలకువ వచ్చి విశ్వాస విశ్వరూపాన్ని చిరుతకు చూపించింది. ఏమాత్రం జంకూబొంకూ లేకుండా చెవులు చిల్లులుపడేలా దానికి ఎదురపడి అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులకు చిరుత జంకి అక్కడి నుంచి తోకముడిచి పారిపోయింది. ఇదంతా ముంబయి శివారు ప్రాంతంలోని ఓ బంగ్లాలో చోటు చేసుకుంది. ఆ బంగ్లాకు వెలుపల బిగించిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం నమోదైంది. రోజువారి తనిఖీలో భాగంగా చూసిన ఇంటి యజమానులు ఆ సీన్ చూసి అదిరిపడ్డారు. ఒక వేళ నిజంగా చిరుత ఇంట్లోకి వచ్చినట్లయితే అనుకుని భయపడిపోయారు. ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టగా అది నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement