
సాక్షి, బెంగళూరు : ఎక్కడైనా చిరుతపులిని చూసి కుక్కలు, మనుషులు పరుగులు తీస్తారు. అయితే కుక్కలే చిరుతను తరిమిన ఘటన బెంగళూరులో జరిగింది. మాగడి రోడ్డులోని తావరెకెరె వద్ద కవితా అనే మహిళకు చెందిన ద్వారక ఫామ్ ఉంది. అక్కడ రక్షణ కోసం ఆమె కుక్కలను పోషిస్తున్నారు. ఫామ్‌లోకి మంగళవారం రాత్రి కుక్కలను వేటాడటానికి చిరుతపులి ఎక్కడి నుంచో చొరబడింది. దీనిని గమనించిన కుక్కలు జోరుగా అరిచి చిరుతను తరిమేశాయి. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
అదే చిరుత మళ్లీ
నెలరోజుల క్రితం ఇదే తోటలోకి వచ్చిన చిరుత ముధోల్ జాతికి చెందిన కుక్కను కరిచి వెళ్లింది. దీనితో జాగ్రత్త పడిన కవిత రక్షణ కోసం ఆరు కుక్కలను ఫాంహౌస్‌లో ఉంచారు. అదే చిరుత మంగళవారం అర్ధరాత్రి సమయంలో చొరబడి వరండా అంత తిరిగింది. కుక్కలు ఉంటున్న గది వద్దకు వెళ్లింది. చిరుతను చూసిన కుక్కలు జోరుగా అరుస్తూ చిరుత వెంట పడ్డాయి. చిరుత కుక్కల బారినుండి తప్పించుకొని పారిపోయిందని కవిత తెలిపారు. చుట్టుపక్కల ఉన్న అడవులు, సావనదుర్గ నుండి చిరుత వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతలను తరిమేయాలని అటవీశాఖ అధికారుల దృష్టికి తెచ్చినా సమస్య పరిష్కారం కాలేదని కవిత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment