చిరుతగా భావించిన కుక్క, దాని పాదముద్ర
పరిగి: గ్రామ సింహాన్ని చూసిన ఓ వ్యక్తి చిరుతపులి కనిపించిందని చెప్పడంతో రంగారెడ్డి జిల్లా పరిగిలో సోమవారం జనం రాత్రంతా జాగారం చేశారు. పోలీసులు, ఫారెస్టు అధికారులు రంగంలోకి దిగి అది కుక్క అని తేల్చడంతో అంతా అవాక్కయ్యారు. పరిగి వల్లభనగర్‌కు చెందిన ఓ యువకుడు సోమవారం రాత్రి 11 గంటలకు చిరుతను చూశానంటూ చెప్పాడు. ఈ విష యం ఊరంతా తెలిసింది. దీంతో పెద్దసంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసులు హుటాహుటిన తరలి వచ్చా రు. చిరుత వల్లభనగర్ సమీపంలోని మసీద్ పక్క ఇళ్లలోకి వెళ్లిందని ఆ యువకుడు చెప్పడంతో సీఐ ప్రసాద్ ఎస్‌ఐలు నగేష్, హన్మంతు టార్చిలైట్లతో గాలించారు.
అక్కడ కనిపించిన పాదముద్రలను పరిశీలించగా.. కాస్త అటు ఇటుగా చిరుత అడుగుల్లాగే కనిపించాయి. దీంతో వారి సందేహం మరింత బలపడి, అది చిరుతేనని నమ్మారు. మంగళవారం ఉదయం వరకు జనం అక్కడే జాగారం చేశారు. ఫారెస్టు అధికారులు వచ్చి పరిశీలిస్తుం డగా అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కుక్కను తీసుకొచ్చాడు. అది దాదాపు చిరుత సైజులోనే ఉంది. దాని అడుగులు పరిశీలించగా రాత్రి చూసిన పాద ముద్రలతో సరిపోయాయి. దీంతో రాత్రి యువకుడు చూసింది చిరుత కాదు కుక్కే అని నిర్ధారణకు వచ్చారు.