మూడేళ్లలో మోనోరైలు : ముఖ్యమంత్రి షీలా దీక్షిత్
Published Wed, Sep 4 2013 12:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో 2017 కల్లా మోనోరైలు పరుగులు పెట్టనుందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. ‘మోనోరైలు, లైట్ రైల్ ట్రాన్సిట్’ అనే అంశంపై మంగళవారం జరిగిన ఇండో- జపాన్ సెమినార్‌కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా దీక్షిత్ మాట్లాడుతూ శాస్త్రి పార్క్-త్రిలోక్‌పురి మధ్య మొదటి మోనో రైలు కారిడార్ 2017 కల్లా సిద్ధం కానుందని చెప్పారు. దీనిపై ఇప్పటికే డీఎంఆర్‌సీ, ‘రైట్స్’తో కలిసి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిందన్నారు. నగర తూర్పు ప్రాంతంలో మొదటి మోనో రైలు కారిడార్‌ను శాస్త్రిపార్క్- త్రిలోక్‌పురి మధ్య 11 కి.మీ. పరిధిలో నిర్మించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
వచ్చే రెండు, మూడేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 2017 నాటికి నగరంలో మొదటి మోనో రైలు తన సేవలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో ఇంకా చాలా మోనోరైలు కారిడార్లను నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగర అవసరాలను తీర్చేందుకు ఒక సుదీర్ఘ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆమె వివరించారు. నగరంలో ఇరుకైన ప్రాంతాల్లో, మెట్రో సేవలు అందుబాటులో లేని ఏరియాల్లో ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అంతకు ముందు అదే సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్ మాట్లాడుతూ భారతదేశంలోని పలు నగరాల్లో మోనోరైళ్లను ఏర్పాటు ఆవశ్యకతపై మాట్లాడారు. ఇరుకైన ప్రాంతాల్లో మోనోరైళ్ల ఏర్పాటు ఎంతైనా అవసరమన్నారు. మోనోరైలు ఏర్పాటుకు తక్కువ స్థలం సరిపోతుంది కాబట్టి స్థల సేకరణ కూడా పెద్ద సమస్య కాబోదన్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మించే మోనోరైళ్ల వల్ల నగరాల్లో ట్రాఫిక్ సమస్యను చాలావరకు అధిగమించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రెండు మోనోరైలు మార్గాలను నిర్మిస్తోందని, ఢిల్లీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.
అన్ని నగరాల్లో మెట్రో రైలు మార్గాలను ఏర్పాటుచేయడం చాలా కష్టమన్నారు. పది లక్షలకు మించి జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో చిన్నతరహా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక నొక్కిచెప్పిందన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 53 నగరాలను గుర్తించి, అక్కడ మోనోరైళ్లు, బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను జపాన్ దేశ సాంకేతిక సహాయంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జపాన్ సీనియర్ మినిస్టర్ హిరోషి కజియామా మాట్లాడుతూ ఢిల్లీ మెట్రో పనులు బాగా జరుగుతున్నాయని అభినందించారు.
Advertisement
Advertisement