మెట్రోకు పోటీగా మోనోరైల్
Published Sat, Aug 17 2013 12:42 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకే మధ్య పోరు అనేక ఏళ్లుగా సాగుతోంది. డీఎంకే హయూంలో ఒక పథకం మొదలైతే దానికి దీటైన పథకం అన్నాడీఎంకే ప్రభుత్వంలో మొదలు కావాల్సిందే. ఈ పోటీ రైళ్ల వరకు చేరింది. డీఎంకే మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కు దీటుగా మోనోరైల్ ప్రాజెక్ట్‌ను అన్నాడీఎంకే ప్రభుత్వం సాధించింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: పరిసరాల్లోని పంచాయతీలను కలుపుకుని చెన్నై కార్పొరేషన్ మహానగరంగా విస్తరించింది. శివారు ప్రాంతాల్లో ఐటీ సంస్థలు, పారిశ్రామికవాడలు, కార్పొరేట్ ఆస్పత్రులు కొలువుదీరాయి. ఈ క్రమంలో నగర ట్రాఫిక్ అత్యంత రద్దీగా మారిపోయింది. సమస్య పరిష్కారం దిశగా మెట్రోరైల్ ప్రాజెక్ట్ కోసం డీఎంకే ప్రభుత్వం 2007 నవంబరు 7న ప్రతిపాదనలు పెట్టింది. ఈ మేరకు 2009 జనవరి 28న కేంద్రం మంజూరు చేసింది. రూ.14 వేల కోట్ల అంచనాతో 41 కిలోమీటర్ల దూరం వరకు సేవలు అందించే దిశగా మెట్రోరైల్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. 2015 నాటికి సేవలు అందించాలనే లక్ష్యంతో పనులు చకచకా సాగుతున్నా రుు. ట్రయల్ రన్ కోసం నాలుగు బోగీలతో కూడిన మెట్రోరైల్ రెండు నెలల క్రితమే జర్మనీ నుంచి చెన్నై చేరుకుంది.
రూ.7687 కోట్లతో మోనోరైల్
మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కు పోటీగా అన్నాడీఎంకే ప్రభుత్వం మోనోరైల్‌కు ప్రతిపాదనలు పెట్టింది. ప్రాజెక్ట్ వ్యయం రూ.7687 కోట్లు. మోనోరైల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దీపాదాస్ మున్షీ పార్లమెంటులో ఇటీవల ప్రకటించారు. మెట్రోరైల్ మార్గంలేని ప్రాంతాలను కలుపుతూ మోనోరైల్ పథకాన్ని అమలు చేయనున్నారు. వండలూరు-వేలాచ్చేరి మధ్య 23 కిలోమీటర్లు, పూందమల్లి- కత్తిపారలను కలుపుతూ 16 కిలోమీటర్లు, పూందమల్లి- వడపళనిని కలుపుతూ 18 కిలోమీటర్ల మార్గాన్ని ఖరారు చేశారు.
Advertisement