మెట్రో రైలుకు రాజకీయ ‘రంగు’
Published Sat, Sep 28 2013 12:53 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
రాజకీయాలకు అనర్హమేదీ కాదని తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఏనాడో నిరూపించాయి. తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. చెన్నైలో మెట్రో రైల్వే లైను నిర్మాణ పనులు ప్రతిష్టాత్మకంగా సాగుతుండగా వాటి బోగీలకు వేసిన రంగుల విషయం చర్చనీయాంశమైంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో 2009లో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండగా చెన్నైకి రూ.14,600 కోట్ల అంచనాతో మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరైంది. నగరంలోని నలుమూలలను కలుపుతూ 45 కిలోమీటర్ల పొడవున రెండు రైలు మార్గాలు, వీటి మధ్యలో 32 రైల్వే స్టేషన్లు నిర్మించాలని సంకల్పించారు. సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి పూందమల్లి హైరోడ్డు, కోయంబేడు, వడపళని వంద అడుగుల రోడ్డు మీదుగా పరంగిమలై వరకు ఒక మార్గం, చాకలిపేట నుంచి సెంట్రల్ స్టేషన్ మీదుగా అన్నాశాలై మీదుగా మీనంబాకం ఎయిర్‌పోర్టు వరకు మరో మార్గం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైలు, బోగీల తయారీ బాధ్యతను బ్రెజిల్‌కు అప్పగించారు.
2011 ఆగస్టున విడుదల చేసిన మెట్రో రైలు బోగీల చిత్రాల్లో అప్పటి అధికార పార్టీ పతాకంలోని (డీఎంకే) రంగులను తలపించేలా పైన ఎరుపు, కింద నలుపుతో తయారు చేసినట్టు ఉన్నాయి. అదే ఏడాది సెప్టెంబరులో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. చెన్నైకి రానున్న మెట్రో రైలు బోగీల్లోని రంగుల ప్రత్యేకతను ఆ పార్టీ పసిగట్టింది. అంతే ఎరుపురంగు స్థానంలో నీలంరంగు చేరింది. మెట్రో పనులు పూర్తవుతున్న దశలో ఈ ఏడాది జూన్‌లో తొలి మెట్రో రైలు చెన్నైకి చేరింది. అన్నాడీఎంకే ప్రభుత్వం సూచన మేరకు తయారైన బోగీలన్నింటికీ రంగులు మార్పులు చేసినట్లు చెన్నై మెట్రో రైలు (సీఎంఆర్‌ఎల్) అధికారి చెప్పారు. మార్పులు చేసిన రంగులు ప్రస్తుత అధికార పార్టీవి కాకున్నా డీఎంకే రంగులను మాత్రం గుర్తుచేయకపోవడం గమనార్హం.
వచ్చేనెల ట్రయల్ రన్
రంగుల రాజకీయం ఇలా ఉండగా మెట్రో రైలు వచ్చేనెలలో ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. బ్రెజిల్ నుంచి చెన్నై చేరుకున్న నాలుగు బోగీలు కలిగిన మెట్రో రైలును కొయంబేడు ట్రాక్‌పై నిలబెట్టారు. ట్రయల్ రన్ కోసం కోయంబేడు సమీపంలో 800 మీటర్ల ట్రాక్‌ను సిద్ధం చేశారు. వచ్చే నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి జయలలిత పచ్చజెండా ఊపి ట్రయల్ రన్‌ను ప్రారంభించనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది చివరికి కోయంబేడు - పరంగిమలై మధ్య మెట్రో రైలు సేవలు ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Advertisement
Advertisement