మళ్లీ ‘మెట్రో’ పగుళ్లు
Published Sat, Oct 12 2013 3:23 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
చెన్నైలో సాగుతున్న మెట్రోరైల్ పనులు జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. సొరంగం పనులు జరుగుతున్న పరిసరాల్లో ఉన్న భవనాలు శుక్రవారం బీటలు వారాయి. భయపడ్డ జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దెబ్బతిన్న కట్టడాలను అధికారులు పరిశీలించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరానికి అదనపు శోభ, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దిశగా మెట్రోరైల్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొంతదూరం పై భాగాన, మరికొంత దూరం సొరంగ మార్గంలో రైల్ ప్రయాణించేలా పథకాన్ని అధికారులు రూపొందించారు. కొత్త చాకలిపేట నుంచి మన్నాడి, హైకోర్టు, సెంట్రల్, ఎల్‌ఐసీ సైదాపేట మీదుగా విమానాశ్రయం వరకు మెట్రోరైల్ మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. కొత్త చాకలిపేట నుంచి సైదాపేట వరకు భూమికి 17 నుంచి 20 అడుగుల లోతులో సొరంగ నిర్మాణం వేగంగా జరుగుతోంది.
మన్నాడి వరకు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మన్నాడి నుంచి హైకోర్టు వరకు సొరంగం పనులు సాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్యారిస్ కొత్వాల్‌చావడి అన్నాపిళ్లై రోడ్డులో ఇళ్లు బీటలు వారడం ప్రారంభించాయి. ఈ క్రమంలో పెద్ద శబ్దాలు రావడంతో ఆయా ఇళ్లలోని వారు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. సమీపంలోని స్వాతి హోటల్, ఒక బ్యాంకు భవనం, మరికొన్ని ఇళ్లలోనూ పగుళ్లు ఏర్పడ్డాయి. రెండు నెలల క్రితం బ్రాడ్‌వే ప్రకాశం రోడ్డులోని లూథరన్, సీఎస్‌ఐ వెస్లీ చర్చిలకు పగుళ్లు ఏర్పడ్డాయి. మెట్రోరైల్ అధికారులు వెంటనే మరమ్మతులు చేశారు.
ఈ నేపథ్యంలో ప్యారిస్ కొత్వాల్‌చావడి అన్నాపిళ్లై రోడ్డులో ఇళ్లు బీటలు వారాయి. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నివాసాల సమీపంలో మెట్రో సొరంగం పనులు చేపడతున్నట్లు మాటమాత్రమైనా చెప్పలేదన్నారు. పగుళ్ల సమాచారాన్ని తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. దెబ్బతిన్న భవనాలను పరిశీలించారు. మెట్రోరైల్ పనుల వల్లే పగుళ్లు ఏర్పడినట్లు తేలితే మరమ్మతులు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement