నష్టాల్లో ఎమ్మెమ్మార్డీయే
సాక్షి, ముంబై: దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన మోనో రైలుపట్ల ప్రయాణికులే కాకుండా ప్రకటనల సంస్థలు కూడా ముఖం చాటేశాయి. మోనో రైళ్లలో, ప్లాట్‌ఫారాలపై, పిల్లర్లపై, ట్రాక్ ప్రహరీ గోడలపై, స్టేషన్ పరిసరాల్లో ప్రకటనలు ఏర్పాటు చేసేందుకు వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థలు ముందుకు రావడం లేదు. దీంతో ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)కు భారీ నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే ప్రయాణికుల నుంచి అనుకున్నంత మేర ఆదాయం రావడంలేదు. దీంతో నష్టాల్లో కొట్టుమిట్టుడుతున్న ఎమ్మెమ్మార్డీయే అదనపు ఆదాయం బాటలో పడింది.
అందుకు ఎమ్మెమ్మార్డీయే పరిపాలన విభాగం వివిధ ప్రకటనల సంస్థలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాని వాణిజ్య, వ్యాపార, ఇతర రంగాల నుంచి స్పందన రావడం లేదు. వడాల-చెంబూర్ మధ్య సుమారు తొమ్మిది కి.మీ. మేర ఈ మోనో రైలు మార్గం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ప్రారంభంలో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాలక్రమేణా ఈ రైలుపై ముంబైకర్ల మోజు తగ్గిపోయింది. ప్రస్తుతం నామమాత్రంగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆదాయం లేక నిర్వహణ మరింత భారంగా మారింది. రైళ్ల లోపలి భాగంతో పాటు ఏడు స్టేషన్లలో ప్రకటనలు ఏర్పాటు చేసే బాధ్యతలు అప్పగించేందుకు ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియకు ఎవరూ స్పందించడం లేదు.
ఇదిలా ఉండగా, వార్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మధ్య నడుస్తున్న మెట్రో రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తోంది. కేవలం ఆరు నెలల కాల వ్యవధిలో ఐదు కోట్లకుపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ సంఖ్య ప్రపంచంలోని వివిధ దేశాలతో పోలిస్తే రికార్డు బ్రేక్‌గా మెట్రో రైలు అధికారులు భావిస్తున్నారు. మెట్రో రైలు ఈ ఏడాది జూన్ ఎనిమిదో తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి డిసెంబరు 11వ తేదీ రాత్రి వరకు మొత్తం మెట్రో రైళ్లు 70 వేల ట్రిప్పులు తిరిగాయి.
ఒక్కో రైలుకు కేవలం నాలుగు బోగీలు ఉన్నప్పటికీ ఇందులో ఏకంగా ఐదు కోట్లకుపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వర్సోవా-ఘాట్కోపర్‌ల మధ్య మెట్రో రైలు ద్వారా కేవలం 21 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గం మీదుగా వెళితే ట్రాఫిక్‌లో కనీసం గంటన్నరకుపైనే సమయం పడుతుంది. దీంతో ప్రజలు మెట్రో రైలుపై మరింత ఆసక్తి కనబరుస్తున్నట్లు స్పష్టమవుతోంది.
మోనోకు తగ్గిన ఆదరణ
Published Fri, Dec 12 2014 10:41 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement