ఇక ఇప్పట్లో మోనో పరుగులు లేనట్లేనంటున్నఅధికారులు
Published Tue, Aug 13 2013 4:31 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: పాత ఢిల్లీలోని శాస్త్రిపార్క్ నుంచి త్రిలోక్‌పురి మధ్య మొట్టమొదటి మోనోరైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫైలును ప్రభుత్వం ఆర్థిక శాఖకు పంపింది. అయితే నిర్మాణ వ్యయంపై స్పష్టత లేని కారణంగా ఫైలు ముందుకు కదలడం లేదు. దీంతో మోనోరైలు పరుగుపై నీలి నీడలు అలముకుంటున్నాయి.
మోనోరైలు ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఇటీవల మాట్లాడుతూ... ‘ఇది భవిష్యత్తులో చేపట్టబోయే నిర్ణయమ’ని చెప్పడం ద్వారా ఇప్పట్లో ఈ ప్రాజెక్టు నిర్మా ణం జరగదనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న షీలా సర్కారుకు మోనోరైలు ప్రాజెక్టుపై మాత్రం స్పష్టత కొరవడింది.
ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంపై ఆర్థికశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. మోనోరైలు నిర్మాణానికి అయ్యే ఖర్చులకు సంబంధించి ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ ఓ ప్రతిపాదిత నివేదికను ఢిల్లీ సర్కార్ మందుంచింది. దీనిలో మూడు అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. మోనోరైలు నిర్మాణానికి రూ.2,235 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. అందిన సమాచారం ప్రకారం.. ఒక్క రూట్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వంలో అంతర్మథనం కొనసాగుతోంది.
ఇంత పెద్ద మొత్తానికి బదులుగా పెద్ద సంఖ్యలో బస్సులు కొనుగోలు చేయవచ్చన్నది సర్కార్‌లోని కొందరు పెద్దల అభిప్రాయం. అయితే షీలాదీక్షిత్ స్వయంగా కలుగజేసుకొని ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటేనే ఫైలు ముందుకు కదిలే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా ఇప్పుడు పనులు ప్రారం భించినా దాని ఫలితం కనిపించాలంటే కనీసం నాలుగేళ్లు పడుతుందని, అది ఎన్ని కల్లో ఎలాంటి ఫలితం ఇవ్వదని భావించే షీలా ప్రభుత్వం వెనక్కు తగ్గిందని పలువురు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement