సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ స్పష్టం చేసినప్పటికీ, ఆమెపై మరిన్ని బాధ్యతలను అప్పగించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉంది. ప్రధానంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార పగ్గాలను షీలాదీక్షిత్‌కు అప్పజెప్ప వచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి. 15 సంవత్సరాల పాటు ఢిల్లీని పాలించిన షీలాదీక్షిత్ సేవలను రానున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఉపయోగించుకొని పార్టీని గట్టెక్కించుకోవాలని అధినాయకత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టనున్న పీసీ చాకో శుక్రవారం షీలాదీక్షిత్‌తో సమావేశం కావడం పై ఊహాగానాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
నిజాముద్దీన్ ఈస్ట్‌లోని షీలాదీక్షిత్ నివాసంలో పీసీ చాకో, ఆమె కుమారుడు తూర్పు ఢిల్లీ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. వీరంతా ఢిల్లీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలను కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది.అత్యంత ప్రజాధరణ: షీలాదీక్షిత్ ఢిల్లీలో అత్యంత ప్రజాదరణ గల నాయకురాలని, సమర్థురాలైన, నేత అని కావడంతో ఢిల్లీ రాజకీయాల కీలక బాధ్యతలను అప్పగించాలని షీలా మద్దతుదారులు పార్టీని ఇప్పటికే కోరారు. మతీన్ అహ్మద్ వంటి కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఈ అభిప్రాయాన్ని అధిష్టానం ముందుంచారు. కొందరు గిట్టని సొంతపార్టీ వర్గీయులు షీలాదీక్షిత్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె వల్లనే ఢిల్లీలో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైందని వారి ప్రధాన ఆరోపణ. ఏది ఏమైనా షిలాదీక్షిత్ సేవలను ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించుకోవాలని, ఆ దిశగా అధిష్టానం కసరత్తు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ఢిల్లీ ఇన్‌చార్జిగా పీసీ చాకో?: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఢిల్లీ కాంగ్రెస్ కొత్త టీమ్‌ను తయారు చేసే ఏర్పాట్లకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జి షకీల్ అహ్మద్ స్థానంలో కేరళకు చెందిన సీనియర్ నేత పీసీ చాకోను నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త టీమ్‌ను నియమించే ఏర్పాట్లను పక్కనపెట్టారు. పీసీ చాకోను ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా నియమిస్తూ అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఆ తర్వాతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నడుం బిగిస్తుందని భావిస్తున్నారు. కొత్త టీమ్ ఎంపిక చాకో అభీష్టం మేరకు జరుగుతుం దని పార్టీ సీనియర్ నాయకుడు తెలిపారు.త్వర లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మేని ఫెస్టో కమిటీ, ఎలక్షన్ కమిటీ, ప్రచార కమిటీతో పాటు వివిధ బ్లాకు, బూతు స్థాయి అధ్యక్షుల నియాకం కోసం ఏర్పాట్లు జరిగాయి. కానీ ఇన్ చార్జి మార్పు నిర్ణయంతో ఈ ఏర్పాట్లన్నీ మూలకుపడ్డాయి.
షకీల్ అహ్మద్ కోరిక మేరకే..: ప్రస్తుత ఢిల్లీ ఇన్‌చార్జి షకీల్ అహ్మద్ రానున్న మూడు నెలల పాటు ఢిల్లీలో ఉండనందు వల్ల చాకోను ఇన్‌చార్జిగా నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఢిల్లీలో ఉండడం లేదని, ఢిల్లీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తనను తప్పించాలని షకీల్ అహ్మద్ పార్టీని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా చాకో నియామకంపై దృష్టి సారించింది. కేరళ తరహాలో ఢిల్లీలోనూ బూతు కమిటీలను ఏర్పాటు చేసే విషయాన్ని పీసీ చాకో పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కనీసం ఓటరు స్లిప్‌లనే కూడా పంచలేదన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా బూతు కమిటీలు ఏర్పాటు చేయాలని చాకో యోచిస్తున్నట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఎన్నిక ల కసరత్తు ప్రారంభించాయి.
షీలాపైనే గంపెడాశలు
Published Sat, Nov 22 2014 10:50 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement