సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే నియమించిన పీసీసీ కమిటీలను ప్రక్షాళన చేయడంతోపాటు కొత్త పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే పనిలో పడింది. పీసీసీకి కొత్త జట్టు ఏర్పాటుపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం పెద్దలు.. రెండు రోజులుగా ఆయా అంశాలపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే పదవుల్లో ఉన్న ఇద్దరు, ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను తొలగించడంతోపాటు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఖరారు చేయనున్నట్టు సమాచారం.
సుదీర్ఘంగా కసరత్తు
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. పార్టీ పరిస్థితులు, నేతల పనితీరుపై ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావేద్, రోహిత్ చౌదరిలతో రెండు నెలల కిందే సమీక్షించారు. ఆమె సూచనల మేరకు ఈ ముగ్గురితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ బుధవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి చర్చించారు.
అనంతరం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న రేవంత్‌తో రాత్రి పన్నెండున్నర గంటల వరకు, గురువారం పొద్దంతా సుదీర్ఘంగా చర్చించారు. పార్టీలో సమన్వయం, నేతల్లో అసంతృప్తి అంశాలతోపాటు పీసీసీ కమిటీల్లో మార్పులు, కొత్త కార్యవర్గ కూర్పుపై ఈ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రస్తుతమున్న ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో పనితీరు ఆధారంగా ఇద్దరు, ముగ్గురికి ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్టు తెలిసింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్న పదిమందిలోనూ ఒకరిద్దరిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇతర కమిటీల్లోని కొందరిని కూడా పక్కనపెట్టే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
సమన్వయం కోసం వరుస భేటీలు
ఢిల్లీలో భేటీ సందర్భంగా పార్టీలో సమన్వయంతోపాటు ప్రజాపోరాటాల నిర్మాణం, వర్గపోరు నివారణ, కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచే కార్యక్రమాలపైనా చర్చించారు. కాంగ్రెస్‌లో గ్రూపుల పోరును చల్లార్చే బాధ్యతను పీసీసీ చీఫ్, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందుకోసం వారం రోజుల్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) భేటీ నిర్వహించాలని.. అనంతరం వరుసగా నియోజకవర్గ స్థాయి భేటీలను చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఢిల్లీ వెళ్లిన చిన్నారెడ్డి
పీసీసీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లారు. పార్టీలో నేతల మధ్య విమర్శలు, లోపిస్తున్న క్రమశిక్షణా రాహిత్యం, కొందరు నేతలపై వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై మాట్లాడేందుకే పార్టీ పెద్దలు ఆయనను ఢిల్లీ పిలిపించారని చర్చ జరుగుతోంది.
కొత్త కార్యవర్గం కూడా..
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు కార్యవర్గ కూర్పు జరగలేదు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకాలు చేయలేదు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటు కోసం నేతల నుంచి డిమాండ్ వస్తున్నా.. పదవుల పంపకాల్లో తేడాలు వస్తే గ్రూప్ వార్‌లు పెరుగుతాయన్న కారణంతో నాన్చుతూ వచ్చారు.
ఇప్పుడు ఏడాదిలోగా ఎన్నికలు ఉండటంతో పార్టీ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఆ దిశగా కొత్త కార్యవర్గ ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని అధిష్టానం పెద్దలు సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పార్టీ నేతలు కసరత్తు చేపట్టారు. చాలా జిల్లాలకు కొత్త అధ్యక్షుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment