‘చేయి’స్తారా! | Protests and dissatisfaction over second list of Congress candidates | Sakshi
Sakshi News home page

‘చేయి’స్తారా!

Published Sun, Oct 29 2023 4:17 AM | Last Updated on Sun, Oct 29 2023 10:34 AM

Protests and dissatisfaction over second list of Congress candidates - Sakshi

గాంధీభవన్‌ వద్ద విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరుల నిరసన

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితాపై రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతల్లో తీవ్ర నిరసన, అసంతృప్తి వ్యక్తమవుతోంది. టికెట్‌లు ఆశించి భంగపడిన పలువురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడిపై, అధిష్టానంపై మండిపడుతున్నారు. దొంగ సర్వేలు నిర్వహించి, వాటి పేరిట తమ వారికి టికెట్లు అమ్ముకున్నారని, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిని కాదని పారాచూట్‌ నేతలకు టికెట్లు కేటాయించారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమను మోసం చేసిన వారిని ఎన్నికల్లో ఓడిస్తామంటూ కొందరు బహిరంగంగానే శపథం చేస్తున్నారు.

పార్టీ తమకు న్యాయం చేస్తుందనే ఆశతో, ఎంతో ఉత్కంఠతో రెండో జాబితా కోసం ఎదురుచూసిన మరికొందరు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొందరు ఏదేమైనా బరిలోకి దిగుతామంటుంటే (రెబల్స్‌), మరికొందరు ఏకంగా రాజీనామాల బాట పట్టారు. మరోవైపు పలువురు నేతల అనుచరులు నిరసన కార్యక్రమాలకు దిగారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాందీభవన్‌పై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు కొందరు రాళ్ల దాడి చేశారు. తమ నేతకు జూబ్లీహిల్స్‌ టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా పార్టీ జెండాలను తగులపెట్టారు. ఇటుక పెళ్లలను విసరడంతో రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి రంధ్రం పడింది.  

పార్టీతో తెగదెంపులు: టికెట్‌ దక్కనందుకు నిరసనగా కాంగ్రెస్‌ అనుబంధ విభాగమైన మైనార్టీ సెల్‌ చైర్మన్‌ సోహైల్‌ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీతో 34 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని ప్రకటించారు. ఈ మేరకు ఖర్గేకు లేఖ పంపినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ తాళం ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ చేతుల్లో ఉందన్నారు. పాత కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డి చంపేశారని ఆరోపించారు. డిసెంబర్‌ 3 తర్వాత గాందీభవన్‌లో ఒక్కరు కూడా కనిపించరని అన్నారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఆశించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్రెడ్డి కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం కార్యకర్తలతో సమావేశమైన ఆయన తనకు పార్టీ అన్యాయం చేసిందని బోరుమన్నారు. ఆయన్ను చూసి కార్యకర్తలు కూడా కంటతడి పెట్టారు. గత ఎన్నికల్లో తాను టికెట్‌ త్యాగం చేశానని, ఈసారి ఇస్తామని చెప్పి చివరకు డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు.

ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దిగుతానని, కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావ్‌ను ఓడించి తీరతానని శపథం చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని పార్టీ నేత, ఎన్‌ఆర్‌ఐ విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ముధోల్‌ కాంగ్రెస్‌ టికెట్‌ను ఎంతకు అమ్ముకున్నారో రేవంత్‌రెడ్డి చెప్పాలన్నారు. అమెరికాలో ఉన్న తనను ఇక్కడికి రప్పించి టికెట్‌ ఇస్తామని ఆశ చూపి పని చేయించుకున్నారని, ఇప్పుడు వేరే అభ్యర్థికి టికెట్‌ అమ్ముకుని తనను మోసం చేశారని ఆరోపించారు. కాగా ఆయన అనుచరులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ ఫ్లెక్సీలను చించివేసి తగులబెట్టారు. 

తిరుగుబాటు బావుటాలు 
టికెట్‌ దక్కని కాంగ్రెస్‌ ఆశావహులు కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. కొందరు పార్టీని ధిక్కరించి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

వడ్డేపల్లి సుభాష్రెడ్డితో పాటు మునుగోడు టికెట్‌ రాని చల్లమల్ల కృష్ణారెడ్డి, హుస్నాబాద్‌ టికెట్‌ ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వరంగల్‌ వెస్ట్‌లో జంగా రాఘవరెడ్డి, ఆసిఫాబాద్‌లో ముందు నుంచి పనిచేస్తున్న తనను కాదని శ్యామ్‌నాయక్‌కు టికెట్‌ కేటాయిచండంపై మండిపడుతున్న ఆదివాసీ మహిళా నాయకురాలు మర్సుకోలు సరస్వతి స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉంటామని స్పష్టం చేశారు. అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒకట్రెండు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా అధిష్టానం తనను వంచించిందని హుస్నాబాద్‌ నేత అలిగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  

యుద్ధానికి సిద్ధంగా ఉన్నా.. 
వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో తాను యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్ననని, ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నానని డీసీసీబీ మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి తెలిపారు. నాయిని రాజేందర్‌రెడ్డికి ఏ సర్వే ప్రకారం  టికెట్‌ ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక నర్సాపూర్‌ టికెట్‌ ఆవుల రాజిరెడ్డికి కేటాయించడంపై టికెట్‌ ఆశించి భంగపడిన పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్, ముఖ్యనాయకులు రెడ్డిపల్లి ఆంజనేయులు, సోమన్నగారి రవీందర్‌రెడ్డి రగిలిపోతున్నారు.

హత్నూర మండలంలోని ఓ ఫాంహౌస్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తక్షణం అభ్యర్థిని మార్చాలని, లేకుంటే తమ ముగ్గురిలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతామని హెచ్చరించారు. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి.. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని అనుచరులతో చెప్పినట్లు తెలిసింది.
 
రాహుల్‌ సభను అడ్డుకుంటామంటున్నారు.. 
తనకు టికెట్‌ ఇవ్వకపోవడానికి నిరసనగా వచ్చే నెల 1న జడ్చర్లలో జరిగే రాహుల్‌గాంధీ బహిరంగ సభను అడ్డుకుంటామని తన అనుచరులు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ చెప్పారు. కార్యకర్తలు, అనుచరులతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్‌ టికెట్‌ స్థానికులకు ఇవ్వకుంటే రెండ్రోజుల్లో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు ప్రకటించారు.

బోథ్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి వన్నెల అశోక్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆడె గజేందర్‌ అనుచరులు, కాంగ్రెస్‌ నాయకులు అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు. ఇదేవిధంగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ టికెట్‌ను వెనక్కి తీసుకుని, స్థానికులకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అసంతృప్తి నేతలు పలువురు డిమాండ్‌ చేశారు.

లేనిపక్షంలో పోటీ బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నట్లు మాజీ డిప్యూటీ మేయర్‌ ఎంబాడి రవీందర్‌ తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై కూడా కాంగ్రెస్‌ అధిష్టానం పునరాలోచించాలని, సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నప్పటికీ తనకు కాకుండా ఇతరులకు టికెట్‌ కేటాయించడం సమంజసం కాదని పీసీసీ కార్యదర్శి, ప్రచార కమిటీ సభ్యుడు దండెం రాంరెడ్డి అన్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డిని కొనసాగిస్తే తాపే రెబల్‌ అభ్యర్థిగా పోటీలో ఉండడం ఖాయమని స్పష్టం చేశారు.

నిరాశలో యువనేతలు 
కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఆశించిన పలువురు యువ నేతలు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్, గిరిజన విభాగం అధ్యక్షులు బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, బెల్లయ్య నాయక్‌లు ఈసారి తప్పకుండా తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావించారు. కానీ వారికి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు.

ముఖ్యంగా హుజూరాబాద్‌ టికెట్‌ను బల్మూరి వెంకట్‌కు కేటాయించకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్‌ రాజీనామా చేసిన సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో చివరి నిమిషంలో ఆయనకు టికెట్‌ ఇచ్చి బలి పశువును చేశారని, ఆ తర్వాత కూడా పార్టీ కోసం ఎంత కష్టపడినా వెంకట్‌కు పార్టీ గుర్తింపు ఇవ్వలేదని అంటున్నారు.  

రేవంత్‌పై ఫిర్యాదుకు సిద్ధం 
టికెట్లు రాని నేతలు కొందరు పార్టీ నాయకత్వంపై, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని కొందరు ఆరోపించడం గమనార్హం. మరోవైపు రేవంత్‌రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి నేతలు సిద్ధమయ్యారు. శనివారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో కొందరు నేతలు రహస్యంగా సమావేశమయ్యారు.

ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల పట్ల రేవంత్‌ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆవేదనతో ఉన్న నేతలు ఈ భేటీకి హాజరైనట్లు సమాచారం. అద్దంకి దయాకర్, రాములు నాయక్‌ తదితరులు పాల్గొన్నారని, తమ భవిష్యత్తు కార్యచరణపై సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. రెబల్‌ అభ్యర్థులుగా పోటీ చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్టు సమాచారం. 

అభ్యర్థిత్వాలను సమీక్షించండి: సీనియర్ల లేఖ 
టికెట్ల కేటాయింపు తీరుపై సీనియర్లలోనూ అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టికెట్ల ఖరారు ప్రాతిపదికకు అర్థం లేకుండా పోయిందని, ఏళ్ల తరబడి పార్టీని పట్టుకుని వేలాడిన వారిని పట్టించుకోకుండా ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న వారికి పట్టం కట్టారని వాపోతున్నారు. కొందరు సీనియర్లు పార్టీ అధిష్టానానికి లేఖ రూపంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘దశాబ్దాలుగా పార్టీతో కలిసి నడుస్తున్న నేతలు, కేడర్‌లో అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది.

రెండు జాబితాల్లో ప్రకటించిన అభ్యర్థులను చూస్తే ప్యారాచూట్లకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారని, పార్టీకి విధేయులుగా ఉండి ఎన్నికలను ఎదుర్కొనగలిగిన సత్తా ఉన్న నాయకులను పార్టీ అధిష్టానం విస్మరించిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. కేడర్‌ మనోభావాలను పరిగణనలోకి తీసుకుని తొలి రెండు జాబితాల్లో ప్రకటించిన పేర్లను సమీక్షించాలి. అప్పుడే పార్టీ కేడర్‌లో విశ్వాసం పెరగడంతో పాటు పార్టీపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది..’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌కు పంపిన లేఖలో సీనియర్‌ నేతలు కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement