సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడినవారు తిరిగి సొంతగూటికి రావాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో భాగంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ టికెట్ ఇవ్వలేదని, సరైన అవకాశాలు కల్పించలేదనే ఆవేదనతోనే కొందరు పార్టీని వదిలివెళ్లారని, వారిని తిరిగి చేర్చుకోవాలని పీఈసీ సభ్యులను కోరారు.
అయితే, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారిని మాత్రమే చేర్చుకోవాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు పీఈసీ అంగీకారం తెలపడంతో ఎన్నికలకు ముందు బయటకు పోయినవారు మళ్లీ వచ్చేందుకు కాంగ్రెస్ ద్వారాలు తెరుచుకున్నట్టయ్యింది. పీఈసీ భేటీలో భాగంగా గత పదేళ్ల కాలంలో విద్యార్థి, ప్రజాసంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్న సూచనకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది.
లోక్‌సభ అభ్యర్థులెవరు?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుపై పీఈసీ ప్రధానంగా చర్చించింది. ప్రతి నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న వారి నుంచి కొన్ని పేర్లను డీసీసీ అధ్యక్షులు ప్రతిపాదించారు. 17 లోక్‌సభ స్థానాలకుగాను 187 పేర్లతో కూడిన జాబితాను ఎన్నికల కమిటీకి వారు అందజేశారు. ఈ జాబితాను పరిశీలించిన పీఈసీ వచ్చే నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. దరఖాస్తుతోపాటు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అయితే రూ.25వేలు, ఇతరులు రూ.50వేల చొప్పున రుసుము చెల్లించాలని నిర్ణయించారు.
ఈ దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి అదే నెల ఆరో తేదీలోపు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)తో పాటు హరీశ్‌చౌదరి, జిగ్నేశ్ మేవాని, విశ్వజిత్ కదంలతో కూడిన స్క్రీనింగ్ కమిటీకి కూడా పీఈసీ పంపనుంది. భేటీలో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్న దానిపై చర్చ జరిగింది. అయితే, ఇక్కడ ఫలానా నాయకుల పేర్లపై చర్చ జరపడం సరైంది కాదని, అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని ఏఐసీసీకి ఇవ్వాలనే సూచన రావడంతో ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లకు ఈ అధికారాన్ని కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని కమిటీ ఆమోదించింది.
మాకు అవకాశమివ్వండి
భేటీలో భాగంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత మెదక్ లోక్‌సభ నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గెలవలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌తో పాటు పార్టీ ఇన్‌చార్జ్ మున్షీ నిర్ణయిస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం యూత్‌కాంగ్రెస్ కోటాలో ఇవ్వాలని, ఒకవేళ సమీకరణలు కుదరకపోతే రాజ్యసభ సభ్యునిగా యూత్‌కాంగ్రెస్ నాయకుడిని ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రతిపాదనలపై అధిష్టానంతో మాట్లాడాలని పీఈసీ అభిప్రాయపడింది. టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, వి.హనుమంతరావు, రేణుకాచౌదరి, మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్, షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, అజారుద్దీన్, చల్లా వంశీచంద్‌రెడ్డి, బలరాంనాయక్, ప్రేంసాగర్‌రావు, సంపత్‌కుమార్, బల్మూరి వెంకట్, సునీతారావులతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.
అయోధ్య అక్షింతల తరహాలో సమ్మక్క బంగారం
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా అయోధ్య నుంచి అక్షింతలు పంపినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సమ్మక్క–సారలమ్మ బంగారాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి పంపే అంశాన్ని పరిశీలించాలని మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు. బెల్లంతో పాటు పసుపు, కుంకుమ పంపే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్రామాలకు వెళ్లే బంగారాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక కేడర్ నేతృత్వంలో ప్రజలకు పంచాలనే అభిప్రాయం సభ్యుల నుంచి వ్యక్తమైంది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ ఈ ప్రతిపాదనను అమల్లోకి తెచ్చే అంశాన్ని అధికారులతో కలిసి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖలకు సూచించారు.
వెళ్లిన వారు వచ్చేయండి: కాంగ్రెస్
Published Wed, Jan 31 2024 4:46 AM | Last Updated on Wed, Jan 31 2024 11:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment