సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్ల వర్షం కురిపించిన ‘గృహలక్ష్మి’ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని హామీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈనెల 17వ తేదీన తుక్కగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభ వేదికగా ఈ పథకాన్ని సోనియా గాంధీ చేత ప్రకటింపజేయాలని యోచిస్తోంది. కుటుంబ యజమాని హోదాలో ప్రతి మహిళకు నెలకు రూ.2వేల నగదు సాయం చేయడం ద్వారా పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేసి మహిళలకు అండగా నిలుస్తామని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీ కార్డు స్కీంల సంప్రదాయాన్ని తెలంగాణలోనూ కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ ఐదు గ్యారంటీ కార్డు స్కీంలలో ఏయే పథకాలను ప్రకటించాలన్న దానిపై టీపీసీసీ పెద్ద కసరత్తే చేస్తోంది.
ఓటు బ్యాంకు బ్రేక్ చేయాల్సిందే..!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందనే అంచనాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. వరుసగా మూడోసారి బీఆర్‌ఎస్‌కు ఓటేయాల్సి రావడం కూడా ప్రజలను ఆలోచింప చేస్తోందని కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ, పింఛన్, రైతుబంధు, కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాల ద్వారా మహిళలు పెద్ద స్థాయిలోనే లబ్ధి పొందుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలు పెద్దగా పట్టని గ్రామీణ మహిళా లోకం ఆలోచనలు ఎలా ఉంటాయనే గుబులు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచీ వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో రూ.500కే గ్యాస్‌సిలిండర్ ఇస్తామని ప్రకటించడం ద్వారా మహిళలను ఆకర్షించాలని భావించింది. అయితే, ఈ కార్యక్రమం అమలు కోసం నిన్న మొన్నటి వరకు రూ.1,100 ఉన్న వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.500కు ఇవ్వాలంటే ఆ మేరకు రూ.600 నగదు బదిలీ జరగాల్సి ఉంటుంది. ఎలాగూ నగదు బదిలీ చేయాల్సినందున కర్ణాటక తరహాలో రూ.2వేల నగదు సాయం అందించే గృహలక్ష్మి లాంటి పథకాన్ని ప్రకటిస్తే గంపగుత్తగా మహిళల ఓట్లు పొందే అవకాశముందని భావిస్తోంది.
బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును కచ్చితంగా బ్రేక్ చేయవచ్చనే ఆలోచనతోనే ఈ పథకాన్ని గ్యారంటీ కార్డు స్కీంలలో పొందుపర్చనున్నట్టు తెలుస్తోంది. ఇక, రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, నెలకు రూ. 4 వేల పింఛన్ పథకాలను ఐదు స్కీంలలో చేరుస్తామని, మిగిలిన రెండింటిలో ఒకటి బీసీ వర్గాలకు, మరొకటి మైనార్టీ వర్గాలకు లేదంటే ఎస్సీ, ఎస్టీల కోసం ప్రకటించే అవకాశముందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రూ. లక్ష కోట్ల పైనే ఆదా చేయొచ్చు..
దీనిపై టీపీసీసీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ ‘కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రూ.లక్ష కోట్లు పెట్టారు. ఇప్పుడు ఆ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ డబ్బులన్నింటినీ సంక్షేమ పథకాలకు అమలు చేస్తే ఐదేళ్లు సంక్షేమ పాలన వర్ధిల్లుతుంది. వీటికి తోడు సెక్రటేరియట్‌కు పెట్టిన రూ.1,500 కోట్లు, మిషన్‌భగీరథకు వెచ్చించిన రూ.45 వేల కోట్లు... ఇలా లెక్కపెట్టుకుంటూ పోతే కమీషన్ల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన మరో లక్ష కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చు.
ఆ నిధులతో సంక్షేమాన్ని డబుల్ ఇంజిన్‌తో ముందుకు తీసుకెళ్లవచ్చు. పథకాలను ఆషామాషీగా ప్రకటించడం కాంగ్రెస్‌కు అలవాటు లేదు. నాడు రైతులకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ నుంచి నేటి కర్ణాటక పథకాల అమలు వరకు కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది. అన్ని లెక్కలు కట్టిన తర్వాతే ఈ పథకాలపై ప్రజలకు హామీ ఇస్తున్నాం. అందుకే తుక్కుగూడ సభలో సోనియాగాంధీ చేత ఐదు గ్యారంటీ స్కీంలపై హామీ ఇప్పించబోతున్నాం. సోనియా హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ఎలా ఇచ్చారో ఈ హామీలను కూడా అలాగే నిజం చేస్తామనే భరోసా ప్రజల్లో కల్పిస్తాం.’ అని వ్యాఖ్యానించారు.
నిధుల సమీకరణ ఎలా?
కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న పథకాలు అమల య్యేవి కావని, అధికారంలోకి వచ్చే అవకాశా లు లేనందునే రోజుకో డిక్లరేషన్‌ను ప్రకటిస్తు న్నారని బీఆర్‌ఎస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి. అర్థం లేకుండా పథకాలు ప్రకటిస్తున్నారని, ఇవన్నీ ఇచ్చాక అభివృద్ధి ఎలా చేస్తారనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ఇందుకు దీటైన సమాధానం తమ దగ్గర ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
తాము మొదటి నుంచీ ఆరోపిస్తున్న విధంగా పాలనలో అవినీతిని నిర్మూలించి, రిటైరయిన వారికి నామినేటెడ్ పదవుల పేరిట కోట్ల రూపాయల జీతాలను నివారిస్తే తమ పథకాల అమలు అసాధ్యమేమీ కాదని వారంటున్నారు. అలాగే పథకాల అమలులో పారదర్శకతతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, నిధులను సద్వినియోగం చేసుకుంటే ఆయా పథకాలను ఇబ్బంది లేకుండా అమలు చేయొచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment