న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ సర్కార్ ఏర్పడే పరిస్థితే వస్తే.. ఆప్ కోరితే తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు. ఆప్‌తో మళ్లీ జతకట్టే అవకాశం ఉందా అని మీడియా గురువారం ఆమెను ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. ‘వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు.. మేం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాం.. ఒకవేళ హంగ్ ఏర్పడిన పక్షంలో ఆమ్‌ఆద్మీపార్టీ కోరితే మద్దతు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేద’ని ఆమె తెలిపారు.
కాగా, షీలా వ్యాఖ్యలపై ఆప్ మండిపడింది. ఆప్ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. 70 సీట్లలో కాంగ్రెస్ ఒక్క సీటైనా గెలుచుకుంటుందని తాము భావించడంలేదన్నారు. తమ పార్టీకి పూర్తి మెజారిటీ రానుందని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోయేది తమ పార్టీయేనని నొక్కిచెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32, ఆప్ 28, కాంగ్రెస్ 8 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్దతుతో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 49 రోజుల పాలన తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వం అనివార్య కారణాల వల్ల రాజీనామా చేసింది. ఇదిలా ఉండగా, కొంతమంది ఆప్ నాయకులు, కార్యకర్తలు గురువారం డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ, హరూన్ యూసుఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆప్ కోరితే మద్దతు
Published Thu, Jan 8 2015 11:03 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement