షీలాదీక్షిత్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ గవర్నర్‌గా కొనసాగుతున్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్నారు. షీలా నేతృత్వం వహిస్తేనే పార్టీ విజయతీరాలకు చేరుకుంటుందని వారంటున్నారు. ఈ విషయాన్ని తాము సోనియాగాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లామంటున్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మతీన్ అహ్మద్, ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మంగళవారం కలిశారు. పార్టీ వ్యవహారాలతో పాటు ఢిల్లీలో రాజకీయ పరిస్థితిని కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
కేరళ గవర్నర్‌గా ఉన్న షీలాదీక్షిత్‌ను వెనక్కి రప్పించి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని అధిష్టానాన్ని కోరినట్లు వారు చెప్పారు. షీలాదీక్షిత్ లేని లోటును ఢిల్లీవాసులు గుర్తిస్తున్నారని, నగరాన్ని అభివృద్ధి చేసినవైనాన్నివారు గుర్తుకు తెచ్చుకుంటున్నారని ఈ నేతలు చెప్పారు. పార్టీని శాసనసభ ఎన్నికల్లో గెలిపించగల సామర్థ్యం ఆమెకు మాత్రమే ఉందంటూఅధ్యక్షురాలికి చెప్పినట్లు వారు తెలిపారు. కాగా సీలంపుర్ శాసనసభ్యుడు మతీన్ అహ్మద్, ఓఖ్లా ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ చేసినతాజా డిమాండ్ డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, శాసనసభలో కాంగ్రెస్ నేత హరూన్ యూసఫ్ నాయకత్వాన్ని సవాలు చేసినట్టయింది.
ఢిల్లీలో కాంగ్రెస్‌కున్న ఎనిమిది ఎమ్మెల్యేల మధ్య విభేదాలున్నాయంటూ గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. క్లిష్టపరిస్థితులోనూ గెలిచినప్పటికీ తమను పార్టీ పట్టించుకోవడం లేదని, షీలాదీక్షిత్ హయాంలో మంత్రులుగా ఉన్న లవ్లీ, హరూన్ యూసఫ్‌లకే డీపీసీసీ అధ్యక్ష పదవి, శాసనసభాపక్ష నేత పదవి కట్టబెట్టారని, పదవుల్లేని ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితో ఉన్న ఈ నేతలనే తన వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. అయితే పార్టీని వీడి బీజేపీకి మద్దతు ఇచ్చినట్లయితే ఎన్నికల్లో మళ్లీ గెలవడం కష్టమని గుర్తించిన ఈ నేతలు ఇప్పుడు పార్టీ అధిష్టానం ముందు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.