సాక్షి, ముంబై: నగరంలో మోనో రైలు ప్రయాణం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు మొదలు కావడంతో ఈ రైలు ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ముంబైలో మోనోరైలు సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నగరవాసులు దీనిలో ప్రయాణించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాలనుంచి ముంబై వచ్చిన పర్యాటకులు సైతం మోనో రైలు ఎక్కనిదే నగరాన్ని విడిచి పోవడంలేదంటే అతిశయోక్తి కాదు.
మొదటి దశ సేవల్లో భాగంగా వడాలా-చెంబూర్‌ల మధ్య ప్రారంభమైన ఈ మోనో రైలుకు మొదట ప్రయాణికుల నుంచి స్పందన తక్కువగా కనిపించింది. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరిగి ఈ రైలు ప్రయాణంపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ రైలు పైనుంచి వెళ్లే సమయంలో కిందినించి దాన్ని చూసేందుకు వాహనాలను నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్‌కు కొంత సేపు అంతరాయం ఏర్పడుతోంది. అలాగే చాలామంది దీన్ని ఫొటోలు, వీడియోలు తీస్తూ ప్రజలు తమ అనుభూతులను భద్రపరుచుకుంటున్నారు.
పిల్లల సందడి...
వేసవి సెలవుల్లో ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ పిల్లలను మోనోరైలు ప్రయాణానికి తీసుకువస్తున్నారు. ముఖ్యంగా సెలవుదినాలు, ఆదివారం మోనో రైలులో ప్రయాణికుల సంఖ్య భారీఎత్తున కన్పిస్తోంది. మోనో రైలు ప్రారంభమయ్యే వడాలా, చెంబూర్ స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ప్రజలు టికెట్ కౌంటర్ వద్ద క్యూ కట్టాల్సి వస్తోంది. రైల్లోనూ పిల్లలు అటుఇటు తిరుగుతూ సందడి చేస్తున్నారు. కిటికీల నుంచి బైటకు చూస్తూ ఫొటోలు తీసుకొంటూ, బైట రోడ్డుమీద వచ్చే పోయేవారికి టాటాలు చెబుతూ సందడి చేస్తున్నారు.
రిటర్న్ టికెట్లు ఇవ్వాలి....
మోనో రైలులో రిటర్న్ టికెట్లు లేకపోవడంపై పర్యాటకులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమేతంగా పిల్లలతో మోనోరైలులో తిరిగేందుకు వచ్చిన వారందరూ చెంబూర్ నుంచి వడాలా వెళ్లిన తర్వాత మళ్లీ వడాలా నుంచి చెంబూర్ కోసం టికెట్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదే చెంబూర్‌లోనే రిటర్న్ టిక్కెట్లు ఇచ్చినట్టయితే సౌకర్యవంతంగా ఉంటుందని వాపోతున్నారు. ముఖ్యంగా వడాలా-చెంబూర్‌ల మధ్య సుమారు 30 నిమిషాల ప్రయాణం కోసం టికెట్లు తీసుకునేందుకు సుమారు గంటపాటు క్యూలో నిలుచోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టికెట్ ధర తక్కువే...
మోనోరైలులో ప్రయాణం చౌకగానే ఉందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పూర్తి ఏసీ ఉన్న మోనో రైలులో వడాలా నుంచి చెంబూర్ వరకు కేవలం రూ. 11లు చార్జీ వసూలు చేస్తున్నారు.
‘మోనో’ యానం..మన్మోహనం..
Published Fri, May 2 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM
Advertisement
Advertisement